iDreamPost

తెలంగాణ: తల్లి ప్రేమకు బహుమతిగా.. చంద్రుడిపై ల్యాండ్‌ కొన్న కుమార్తె

  • Published Aug 25, 2023 | 2:22 PMUpdated Aug 25, 2023 | 2:22 PM
  • Published Aug 25, 2023 | 2:22 PMUpdated Aug 25, 2023 | 2:22 PM
తెలంగాణ: తల్లి ప్రేమకు బహుమతిగా.. చంద్రుడిపై ల్యాండ్‌ కొన్న కుమార్తె

చంద్రయాన్‌ 3 విజయం తర్వాత.. చందమామ పేరు వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. చందమామ మీద మనుషులు జీవించేందుకు ఆస్కారం ఉందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటితో పాటు.. ఇక చందమామ మీద రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ప్రారంభం అవుతుంది అంటూ సోషల్‌ మీడియాలో ఫన్నీ టాక్‌ నడుస్తోంది. ఈ క్రమంలో చంద్రుడి మీద ల్యాండ్‌ కొన్న సెలబ్రిటీలు జాబితా విడుదల చేశారు కొందరు ఔత్సాహిక నెటిజనులు. అయితే సెలబ్రిటీలు మాత్రమే కాదండోయ్‌.. సామాన్యులు కూడా మూన్‌ మీద ల్యాండ్‌ కొన్న వారి జాబితాలో చేరుతున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన ఓ మహిళ.. తల్లి మీద ప్రేమతో.. జాబిల్లి మీద ప్లాట్‌ కొని.. తల్లికి బహుమతిగా ఇచ్చింది. ఆ వివరాలు..

పెద్దపల్లికి చెందిన ఓ మహిళ తన తల్లి మీద ఉన్న ప్రేమతో చంద్రుడిపై స్థలం కొనుగోలు చేసి.. గిఫ్ట్‌గా అందించారు. గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి సుద్దాల రాంచంద్ర, వకుళాదేవి దంపతుల పెద్ద కూతురు సాయి విజ్ఞత.. తల్లి మీద ప్రేమతో చంద్రుడి మీద ల్యాండ్‌ కొనుగోలు చేసింది. దీనిలో భాగంగా విజ్ఞత.. 2022లో లూనార్‌ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ అయ్యి.. తల్లి వకుళాదేవి పేరిట చంద్రుడి మీద భూమి కొనుగోలు చేసేందుకు దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టు 23న వకుళాదేవి, ఆమె మనువరాలు ఆర్త సుద్దాల పేర్ల మీద చంద్రుడిపై ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్‌ అయ్యింది. కాగా సాయి విజ్ఞత అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో గవర్నర్ కిమ్ రెనాల్డ్స్ వద్ద ప్రాజెక్ట్ మేనేజర్‌గా, ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు.

ఇక చంద్రుడి మీద భూమిని కొనుగోలు చేయాలి అనుకునే వారు లూనార్ రిజిస్ట్రీ అనే వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. భూమి కొనాలనుకునే వారు.. ఈ వెబ్‌సైట్‌ను సందర్శించి, చంద్రుడి మీద ఏ ప్రాంతంలో భూమిని కొనుగోలు చేయాలనుకుంటున్నారో.. ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో సీ ఆఫ్ ట్రాంక్విలిటీ, లేక్ ఆఫ్ డ్రీమ్స్ సహా పలు ప్రాంతాలు ఉంటాయి. ముందుగా మీకు నచ్చిన ప్రాంతాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్లను పొందాలి. చంద్రుడి మీద మనుషులు జీవించే అవకాశం ఉందో లేదో ఇంకా సరిగా తెలియదు. కానీ ఇప్పటికే మూన్‌ మీద రియల్‌ ఎస్టేట్‌ స్టార్ట్‌ అయ్యింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి