iDreamPost

నిరుపేద కుటుంబం నుంచి టీమిండియాలోకి.. గంగూలీ మెచ్చిన ఈ ప్లేయర్ ఎవరంటే?

  • Author Soma Sekhar Published - 06:17 PM, Sat - 24 June 23
  • Author Soma Sekhar Published - 06:17 PM, Sat - 24 June 23
నిరుపేద కుటుంబం నుంచి టీమిండియాలోకి.. గంగూలీ మెచ్చిన ఈ ప్లేయర్ ఎవరంటే?

BCCI వెస్టిండీస్ టూర్ కు టీమిండియా జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకుని సెలక్టర్లు ఈసారి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చారు. టెస్ట్, వన్డే సిరీస్ కు టీమ్ లను ప్రకటించింది బీసీసీఐ. అయితే ఈ రెండు సిరీస్ లల్లో చోటు దక్కించుకున్న ఓ బౌలర్ గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. అతడే ముకేష్ కుమార్. కటిక పేదరికంలో పుట్టి.. పోషకాహార లోపంతో కెరీర్ ప్రశ్నార్థకంగా మారిన వేళ.. కఠోర శ్రమతో కమ్ బ్యాక్ ఇచ్చి టీమిండియాకు ఎంపికయ్యాడు ఈ ప్లేయర్. ఈ సందర్భంగా అతడి జీవిత విశేషాలను, అతడు పడిన కష్టాలను ఓసారి తెలుసుకుందాం.

అతడి జీవితం ఓ యుద్దం.. ఎన్నో కష్టాలు, మరెన్నో పోరాటాలు. అనుకున్న లక్ష్యం కోసం కటిక పేదరికాన్ని సైతం లెక్క చేయని అతడి ధైర్యమే.. అతడికి విజయాన్ని అందించింది. చిన్నప్పుడే పోషకాహార లోపంతో బాధపడ్డ అతడు తన కెరీర్ ముగిసిందని భావించాడు. కానీ కుంగిపోకుండా ధైర్యంగా తన కల కోసం అడుగులు ముందుకు వేశాడు. ఆ అడుగులే ఇప్పుడు విజయాన్ని సాధించి పెట్టి దేశం మెుత్తం అతడి పేరు మారుమ్రోగేలా చేశాయి. ముకేష్ కుమార్.. ప్రస్తుతం ఇండియన్ క్రికెట్లో మారుమ్రోగుతున్న పేరు.

ముకేష్ కుమార్ బిహార్ కు చెందిన పేద కుటుంబంలో పుట్టాడు. తండ్రి ఓ టాక్సీ డ్రైవర్. అయితే బతువుదెరువు కోసం కుటుంబంతో పాటుగా 2012లో బెంగాల్ చేరుకున్నాడు ముకేష్. చిన్నప్పటి నుంచి క్రికెట్ పై ఉన్న ఆసక్తితో.. ఎలాగైనా ఇండియన్ క్రికెట్ టీమ్ లోకి వెళ్లాలని కలలు కన్నాడు. కానీ పేదరికం వెక్కిరించడంతో పోషకాహార లోపం బారిన పడ్డాడు ముకేష్ కుమార్. ఈ లోపంతో బోన్ ఎడిమ, మోకాళ్ల నొప్పులతో ఇబ్బందులు పడ్డాడు. దాంతో అతడి క్రికెట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ కష్టాల నుంచి బయటపడ్డాడు ముకేష్ కుమార్.

ఈ క్రమంలోనే అతడికి బెంగాల్ మాజీ క్రికెటర్, స్పీడ్ స్టర్ రణదేవ్ బోస్ పరిచయం అయ్యాడు. ఈ పరిచయం అతడి జీవితాన్నే మలుపు తిప్పింది. రణదేవ్ బోస్ ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగి దేశవాళీ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు ముకేష్ కుమార్. ఇక అక్కడ తన అద్భుతమైన బౌలింగ్ ప్రతిభ కనబర్చడంతో.. ఐపీఎల్ ఫ్రాంఛైజీల కన్ను ముకేష్ కుమార్ పై పడింది. తొలుత రూ. 20 లక్షల కనీస ధరతో చెన్నై జట్టు అతడిని కొనుగోలు చేసింది. కాగా ఇటీవలే జరిగిన ఐపీఎల్-2023 మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఏకంగా రూ. 5.5 కోట్లు పెట్టి ముకేష్ కుమార్ ను కొనుగోలు చేసింది. దాంతో అతడి పంట పండినట్లు అయ్యింది.

అయితే ఇది ముకేష్ కుమార్ కల కాదు. ఇండియాకు ఆడాలి అన్నదే అతడి జీవిత ఆశయం. ముకేష్ కుమార్ కలలు కన్నట్లుగానే తొలిసారి భారత జట్టు నుంచి పిలుపు వచ్చింది. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా ఇతడిని ఎంపిక చేశారు. కానీ దురదృష్టవశాత్తు అతడికి తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు. ఇక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్-2023కి స్టాండ్ బైగా ఎంపికైయ్యాడు. ఇప్పుడు మరోసారి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ యువ పేసర్. వెస్టిండీస్ తో జరిగే టెస్ట్, వన్డే సిరీస్ కు సెలక్టర్లు ముకేష్ కుమార్ ను ఎంపిక చేశారు. ఇక తాను ఇండియాకు ఎంపిక కావడంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా తన తండ్రిని తలచుకుని ఎమోషనల్ అయ్యాడు ముకేష్.

నా ఎదుగుదల చూసి మా నాన్న తప్పకుండా సంతోషిస్తాడు, నేను ఈ స్థాయికి చేరుకున్నాను అంటే దానికి కారణం నా తల్లిదండ్రులు, నా స్నేహితులే అని చెప్పుకొచ్చాడు ముకేష్ కుమార్. ఇక బెంగల్ దాదా సౌరవ్ గంగూలీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు ముకేష్. గంగూలీ, జయ్ దీప్ ముఖర్జీ, రణదేవ్ బోస్ లు అందించిన సహకారాలు మర్చిపోలేనివని, వారి మద్దతు లేకుండా నేను ఇక్కడి వచ్చే వాడిని కానని ముకేష్ కుమార్ చెప్పుకొచ్చాడు. ఇక ముకేష్ కుమార్ బౌలింగ్ ను గతంలోనే మెచ్చుకున్నాడు సౌరవ్ గంగూలీ. కాగా ముకేష్ కుమార్ తండ్రి 2019లో మరణించారు. ఆయనకు మెదడులో రక్తస్రావం కావడం వల్ల కన్నుమూశారు. చివరిగా నా జీవితం పరిపూర్ణమైందని ముకేష్ కుమార్ పేర్కొన్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి