iDreamPost

టీడీపీలో ఎన్నికల ధ్యాస ఎందుకూ.. తొందరపడి ఓ కోయిల ముందే కూసిందా

టీడీపీలో ఎన్నికల ధ్యాస ఎందుకూ.. తొందరపడి ఓ కోయిల ముందే కూసిందా

తెలుగుదేశం పార్టీ నేతలకు అప్పుడే ఎన్నికల ఫీవర్ అంటుకుంది. అదిగిదిగో ఎన్నికలంటూ హడావిడి మొదలెట్టేశారు. త్వరలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని జోశ్యం చెబుతున్నారు. అందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ మేకపోతు గాంభీర్యం కూడా ప్రదర్శిస్తున్నారు. కానీ లేస్తే మనుషులం కాదన్నట్టుగా ఉన్నట్టు టీడీపీ నేతల తీరు అసలు లేచేందుకు ఓపిక ఉందా అనే సందేహాలకు తావిస్తోంది. ఇప్పటికీ ఏపీలోని అనేక నియోజకవర్గాల్లో ఆపార్టీకి ఇన్ఛార్జులే లేరు. ఉన్న చోట కొందరు పనిలో లేరు. పనిలో ఉన్న వారికి ప్రజల్లో పట్టు లేదు. అయినప్పటికీ టీడీపీ నేతల హడావిడి వెనుక కారణాలేంటా అనే సందేహం కలుగకమానదు.

ఆంధ్రప్రదేశ్ లో మరో ఏడాదిలోనే ఎన్నికలు వచ్చేస్తున్నాయనేటంత రీతిలో టీడీపీ నేతల సందడి కనిపిస్తోంది. వారి మాటల్లో అది ప్రస్ఫుటిస్తోంది. ఏపీలో పాలకపక్షం తన పని తాను చేసుకుపోతోంది. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తోంది. మరోవైపు జిల్లాల విభజన, రాజధానుల ఏర్పాటు వంటి అంశాలకు సంబంధించి కసరత్తులు చేస్తోంది. అన్నీ కొలిక్కి వస్తే ఉగాదికి కొత్త జిల్లాలు ఎలానూ సిద్ధం చేస్తున్నందున వచ్చే ఆగష్ట్ 15 నాటికి కార్యనిర్వాహక రాజధాని వైపు కూడా కదిలే అవకాశం ఉంటుంది. రాజకీయంగానూ వైసీపీ లో ఉత్తేజం నింపేందుకు, పార్టీ శ్రేణులను కదిలించేందుకు జగన్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అనుబంధం విభాగాల బాధ్యతను విజయసాయిరెడ్డికి అప్పగించి మళ్లీ కార్యకలాపాల వైపు దృష్టి పెడుతున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గం విస్తరణ, ఆ తర్వాత పార్టీ ప్లీనంతో కూడా జరగుతుంది. కాబట్టి పూర్తిగా పార్టీ లోమళ్లీ కదిలిక ఖాయంగా భావిస్తున్నారు.

అధికార పార్టీ అంతా వ్యూహాత్మకంగా వ్యవహరాలు చక్కదిద్దుంటే టీడీపీ మాత్రం నానా హైరానా పడుతోంది. నేటికీ వారంలో నాలుగు రోజులు హైదరాబాద్ కే పరిమితమవుతున్న చంద్రబాబు వారంలో రెండు, మూడు రోజులు మాత్రం ఏపీకి కేటాయిస్తున్నారు. గతంలో మాదిరిగా నిత్యం మీడియా సమావేశాలు వద్దని పార్టీ నేతలంతా మొత్తుకోవడంతో చివరకు చంద్రబాబు కనికరించినట్టు కనిపిస్తోంది. కానీ మీడియా మీటింగ్స్ లేకపోయినా పార్టీ అంతర్గత సమావేశాల్లో మాత్రం సుదీర్ఘ ఉపన్యాసాలు కొనసాగిస్తున్నారు. అదే సమయంలో నియోజకవర్గ ఇన్ఛార్జుల నియామకం మీద దృష్టి పెట్టారు. కానీ అవి కొలిక్కి రావడం లేదు. పలుమార్లు సమీక్షలు నిర్వహించినా నేటికీ ఏపీలో 30 స్థానాలకు పార్టీ ఇన్ఛార్జులు లేని పరిస్థితి ఉంది. మరో 40 స్థానాల్లో ఇన్ఛార్జుల తీరు మీద అసంతృప్తి పార్టీలోనే కనిపిస్తోంది. దాంతో సగం స్థానాల్లో టీడీపీకి నాయకత్వంలోటు కనిపిస్తోంది.

ఇక మిగిలిన నేతల్లో కూడా చాలామంది ప్రజల్లో పట్టు దొరక్క విలవిల్లాడుతున్నారు. అయినప్పటికీ తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. తద్వారా పార్టీలోకి పలువురు నేతలను ఆకర్షించే లక్ష్యంతో చంద్రబాబు ఉన్నట్టు భావిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి మిగిలిన నాయకులను టీడీపీలోకి చేర్చుకునే ఉద్దేశంతో అధినేత ఉన్నట్టు చెబుతున్నారు. అదే సమయంలో జనసేనకి బాహాటంగానే మద్ధతు పలుకుతున్న తరుణంలో పవన్ కనికరిస్తే కూటమికి సిద్దం కావాలనే ఆలోచన కూడా చేస్తున్నారు. తద్వారా జగన్ ని ఒంటరిగా ఎదుర్కోలేం కాబట్టి జట్టుగా పోటీ పడాలనే సంకల్పంతో చంద్రబాబు ఉన్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో వరుసగా అభివృద్ధి కార్యక్రమాల వైపు ప్రభుత్వాధినేత దృష్టి పెట్టగా చంద్రబాబు మాత్రం తొందరపడి ఓ కోయిల ముందే కూసిందనే చందాన ముందస్తు ఎన్నికల పీవర్ కి గురికావడం మాత్రం ఆశ్చర్యంగా కనిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి