iDreamPost

చినబాబును మోయలేం..!

చినబాబును మోయలేం..!

ఎవరైనా ఒక నాయకుడు అద్భుతంగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాడు అంటే అందుకు వెనుక అనేక మంది కృషి ఉంటుంది. నాయకుడి స్థాయి పెరిగే కొద్దీ సపోర్టర్స్‌ సంఖ్య కూడా పెరుగుతూనే ఉంటుంది. నిస్వార్ధంగా ఈ విధంగా తోడ్పడిన వారు అనేక మంది ఉంటుంటారు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలో ఈ తరహా ‘కట్టప్ప’లు ఎక్కువగానే కన్పిస్తుంటారు.

అయితే రాజకీయ పరిణామాలు, పరిస్థితుల నేపథ్యంలో కొందరు కట్టప్పలు (వెన్నుపోటు పొడవకపోయినా) సైలెంటుగా తమదారి తాము చూసుకుంటారు. అటువంటి సమయంలోనే నాయకుడి అసలు శక్తిసామర్ధ్యాలు బైటపడుతుంటాయి. అప్పటి వరకు చతురంగ బలాలు, వందమాగధులతో పల్లకీలో ఊరేగిన నాయకుడు ఉన్నట్టుండి ఒకొక్కరే దూరమవుతున్నప్పటికీ అదే దర్పాని కొనసాగించుకోవడంలో నాయకత్వ పటిమ నిలబడుతుంది.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు నుంచి పార్టీని సొంతం చేసుకున్నాక కొందరు నాయకులు, కొన్ని సామాజికవర్గాలు చంద్రబాబును పల్లకీలో కూర్చోబెట్టి ముందుకు నడిపించుకువెళ్ళాయి. ఈ పల్లకీ సేవలను ఉభయ ప్రయోజనార్ధమే చేసినప్పటికీ చంద్రబాబు జాతీయ స్థాయి నేతగా ఎస్టాబ్లిష్‌ అయ్యేందుకు ఇది ఎంతో తోడ్పడిందనడం కాదనలేదని సత్యం.కానీ ఎప్పుడైతే తన తరువాత.. అంటూ లోకేష్‌ను తెరపైకి తీసుకువచ్చారో పల్లకీ మోసేవారు ఒకొక్కరే పక్కకు తప్పుకోవడం ప్రారంభమైందని విశ్లేషిస్తున్నారు. ఇందుకు కారణాలు ఏమైనా కావొచ్చునన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తండ్రిని మోసాం కానీ కొడుకును కూడా మోయాలా? అనే వారు కొందరైతే, అంత కేపబిలిటీ లేదు? అంటూ పెదవి విరిచేవారింకొందరు. రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను తట్టుకుని పార్టీని ముందుకు నడిపించడం చినబాబు వల్లకాదంటూ పెదవి విప్పేవారు ఇంకొందరుంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు వెన్నంటే నడిచిన నాయకులు, సామాజికవర్గాలు చినబాబును అంగీకరించడం లేదన్నది తేటతెల్లమైపోయిందంటున్నారు.

ఇదే క్రమంలో తమతమ మనుగడను కొనసాగించుకునేందుకు ప్రత్యామ్నాయాల వైపు సాగిపోవడమో, తెర వెనుకకు జరిగిపోవడంతో ప్రారంభించారని వివరిస్తున్నారు. అప్పటి వరకు అన్నీ తామై నడిపించిన నాయకులు, సామాజివర్గాలు ఇలా ఉన్నపళంగా కాడె వదిలేయడంతో ఇప్పుడు టీడీపీ నిలబెట్టుకునే క్రమంలో చంద్రబాబు తన శక్తికి మించే ప్రయత్నిస్తున్నట్టుగా అర్ధమవుతోంది. ఈ స్థాయిలో ప్రయత్నిస్తున్నప్పటికీ దూరమైపోయిన ఆయా వర్గాలు, నేతలను తిరిగి వెనక్కుతెచ్చుకోవడం సాధ్యమయ్యే పనిగా కన్పించడం లేదు.

పక్కకు తప్పుకున్న వారు తమ మనుగడ వరకు మాత్రమే పనిచేసుకుంటే ప్రస్తుతానికి టీడీపీకి వచ్చిన ఇబ్బందులు పెద్దగా ఉండకపోవచ్చునన్న వాదన కూడా ఉంది. అలా కాకుండా తమ హవాను కొనసాగించుకునేందుకు వీరంతా కలిసి తగిన ప్రత్యామ్నాయ నాయకుడ్ని చూసుకుంటేనే ఇబ్బందులు తప్పవని వివరిస్తున్నారు. ఒక వేళ ఇదే పరిస్థితులు గనుక ఎదురైతే అసలే వృద్ధాప్యంలో ఉన్న చంద్రబాబుకు మరింత మనోవేదన తప్పదంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి