iDreamPost

ఆశ్చర్యకరంగా మైదుకూరు ఫలితం

ఆశ్చర్యకరంగా మైదుకూరు ఫలితం

మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్‌ గాలి వీస్తుంటే కడప జిల్లా మైదుకూరులో భిన్నమైన పరిస్థితి నెలకొంది. మైదుకూరు మున్సిపాలిటీలో టీడీపీ మెజారిటీ వార్డులు గెలుచుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మైదుకూరులోని 24 వార్డులకు గాను టీడీపీ 12 వార్డులు గెలుచుకుంది. వైసీపీ 11 వార్డుల్లో విజయం సాధించింది. ఒక వార్డులో జనసేన అభ్యర్థి గెలిచారు.

మున్సిపల్‌ ఎన్నికల ప్రారంభం నుంచి మైదుకూరులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీడీపీ బలంగా ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలోనే ఆ పార్టీ అన్ని డివిజన్లు, వార్డుల్లో పోటీ పెట్టలేని పరిస్థితి. అయితే మైదుకూరులో మాత్రం 24 వార్డుల్లోనూ బలమైన అభ్యర్థులను టీడీపీ నిలబెట్టింది. ఈ పరిణామం మైదుకూరు మున్సిపాలిటీని గెలుచుకునేందుకు టీడీపీ ఏ స్థాయిలో పని చేసిందో తెలిసిపోతోంది. మొత్తానికి టీడీపీ కృషి ఫలించింది.

మున్సిపల్‌ ఎన్నికలకు ముందు మైదుకూరులో రాజకీయంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. 2019 ఎన్నికలకు మూడు నెలల ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన మాచనూరు చంద్ర మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ చైర్మన్‌ అభ్యర్థి అయ్యారు. కాంగ్రెస్‌ని, అనంతరం వైసీపీని మైదుకూరు పట్టణంలో ముందుండి నడిపించిన ధనపాల జగన్‌ తనకు చైర్మన్‌ అభ్యర్థిత్వం దక్కకపోవడంతో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున చైర్మన్‌ అభ్యర్థిగా పోటీ చేశారు.

బలిజ సామాజికవర్గానికి చెందిన «మాచనూరు చంద్ర, వైశ్య సామాజికవర్గానికి చెందిన ధనపాల జగన్‌లు ముఖాముఖి తలపడ్డారు. ఒకే వార్డు నుంచి వీరిద్దరూ పోటీ చేశారు. మాచనూరు చంద్ర మరో వార్డు నుంచి కూడా పోటీ చేశారు. అక్కడ ధనపాల జగన్‌ సతీమణి మాచనూరు చంద్ర ప్రత్యర్థి అయ్యారు. ధనపాల జగన్‌పై గెలిచిన మాచనూరు చంద్ర.. మరో వార్డులో జగన్‌ సతీమణి చేతిలో ఓటమిపాలయ్యారు.

Also Read : గొట్టిపాటిని నిరాశపరిచిన అద్దంకి

ధనపాల జగన్‌ వర్గం వైసీపీకి దూరం కావడంతోనే ఇక్కడ అధికార పార్టీకి నష్టం జరిగిందనే విశ్లేషణలు సాగుతున్నాయి. ధనపాల జగన్‌ కుటుంబం కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీని అంటిపెట్టుకుని ఉంది. ధనపాల జగన్‌ తండ్రి ధనపాల కుళ్లాయిశెట్టి కాంగ్రెస్‌ హాయంలో డీఎల్‌ రవీంద్రారెడ్డి అనుచరుడుగా ఉండేవారు. కోట్ల భాస్కర రెడ్డి హాయంలో సారా మరణాలకు తన అనుచరుడు కళ్లాయిశెట్టి కారణమనే ఆరోపణలతో డీఎల్‌ రవీంద్రా రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

ధనపాల జగన్‌ 2001 ఎంపీపీ ఎన్నికల్లో మైదుకూరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచారు. మైదుకూరు పట్టణంలో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న ధనపాల జగన్‌ టీడీపీలోకి వెళ్లడం వల్ల ప్రతిపక్ష పార్టీకి మేలు జరిగిందనే చర్చ స్థానికంగా జరుగుతోంది. ధనపాల జగన్‌కు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల వైసీపీ శ్రేణులు కూడా మున్సిపల్‌ ఎన్నికల్లో సరిగా పని చేయలేదని చెబుతున్నారు. అందుకే ఇలాంటి ఫలితాలు వచ్చాయంటున్నారు.

అయితే చైర్మన్‌ పీఠం గెలుచుకునేందుకు అవసరమైన వార్డులు టీడీపీకి లేకపోవడం ఇక్కడ వైసీపీకి కలిసి వచ్చే అంశం. 24 వార్డులకు గాను టీడీపీ సగం (12) వార్డులు గెలుచుకుంది. వైసీపీకి 11 వార్డులే వచ్చినా.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీల ఎక్స్‌ అఫిషియో ఓట్లతో మైదుకూరు మున్సిపల్‌ చైర్మన్‌ పీఠాన్ని అధికార పార్టీనే గెలుచుకోవడం ఖాయం. మాచనూరు చంద్రకు చైర్మన్‌ గిరి దక్కడం లాంఛనమే. అయితే టీడీపీ మెజారిటీ వార్డులు గెలుచుకోవడమే ఇక్కడ వైసీపీ నేతలకు రుచించని అంశం.

Also Read : సత్తా చాటిన అన్నా రాంబాబు.. పత్తాలేని జనసేన

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి