iDreamPost

మాచర్లను మడతెట్టేశారు

మాచర్లను మడతెట్టేశారు

గుంటూరు జిల్ల పల్నాడులోని మాచర్ల.. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీ మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై జరిగిన దాడితో రాష్ట్రం దృష్టిని ఆకర్షించింది. మీడియాలో పతాక శీర్షికల్లో నిలిచింది. తమ పార్టీ వారిని నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు గగ్గోలు పెట్టారు. అయితే బాబు చేసిన హడావుడికి భిన్నమైన పరిస్థితి మాచర్లలో నెలకొంది.

మాచర్ల మున్సిపాలిటీలో 31 వార్డులుండగా.. 60 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో అధికార వైఎస్సార్‌సీపీ 31 వార్డులకు 31 నామినేషన్లు వేయగా టీడీపీ కేవలం ఆరు వార్డులకే నామినేషన్లు వేసింది. మరో 23 మంది స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. 31 వార్డులకు గాను పది వార్డుల్లో సింగిల్‌ నామినేషన్లు దాఖలవడంతో అవన్నీ ఏకగ్రీవం అయ్యాయి.

తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ప్రతిపక్ష పార్టీ నానా యాగీ చేస్తుండగా మాచర్లలో మాత్రం తమ్ముళ్లు నామినేషన్లు వేయడానికే ముందుకు రాలేదు. నామినేషన్ల ఉపసంహరణ నాటికి స్వతంత్రుల్లో ఎంత మంది బరిలో ఉంటారన్నది సందేహమే. దీంతో మాచర్లలో 31 వార్డులకు గాను 25 వార్డులు వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా గెలుచుకున్నట్లే.

ఒక వేళ స్వతంత్రులు పోటీలో ఉన్నా అది నామమాత్రమేనని చెప్పవచ్చు. మిగిలిన ఆరు వార్డుల్లోనే వైసీపీ, టీడీపీల మధ్య పోటీ జరగనుంది. ఇది కూడా నామమాత్రమేనని సమాచారం. ఆరుగురిలో ఎంత మందికి టీడీపీ బీఫారం తీసుకునేందుకు వెళతారన్నది చూడాలి.

గత పర్యాయం మాచర్ల మున్సిపాలిటీని టీడీపీ గెలుచుకుంది. అప్పట్లో 29 వార్డులకు గాను 21 వార్డుల్లో పసుపు జెండా ఎగిరింది. జనరల్‌ మహిళకు చైర్మన్‌ పీఠం దక్కింది. ఈ సారి వార్డుల పునర్విభజనతో ఆ సంఖ్య 31కి చేరింది. చైర్మన్‌ సీటు బీసీ జనరల్‌కు రిజర్వ్‌ అయింది. ఇటీవల బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలపై మాచర్లలో దాడి చేసిన వార్తల్లో నిలిచిన తుర్క కిషోర్‌ (వడ్డెర సామాజికవర్గం) చైర్మన్‌ రేసులో ఉన్నారు. ఇతను 13వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. ఈ వార్డు కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి