iDreamPost

బీసీలపై ముసలి కన్నీరు

బీసీలపై ముసలి కన్నీరు

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై టీడీపీ స్టాండ్‌ ఏమిటి..? బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆ పార్టీ మద్ధతు ఉందా..? లేక 50 శాతం లోపు మాత్రమే రిజర్వేషన్లు ఉండాలా..? ఒకే సమయంలో రెండు భిన్నమైన వాదనలు వినిపిస్తున్న టీడీపీ నేతలు రెండు నాల్కల వైఖరిని అవలంభిస్తున్నట్లుగా అర్థమవుతోంది.

రిజర్వేషన్లు 50 శాతం లోపు ఉండాలని సోమవారం రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనంటూ సమావేశం అనంతరం ఆ పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం సుప్రింలో పిటిషన్‌ దాఖలు చేయాలని చెబుతూ.. దానిలో తాము కూడా ఇంప్లీడ్‌ అవుతామని చెప్పారు. బీసీలకు అన్యాయం జరిగితే చూస్తు ఊరుకోబోమని ఆ పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ నేతలు కూడా ఇదే వాదన వినిపించారు. ఇంత వరకూ బాగానే ఉంది. మరి తమ పార్టీ నేత, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర మాజీ డైరెక్టర్‌ బిర్రు ప్రతాప్‌ రెడ్డి 59.85 శాతం రిజర్వేషన్లను సవాల్‌ చేస్తూ హైకోర్టుకు వెళ్లడం, అక్కడ తోసిపుచ్చినా.. సుప్రిం కోర్టుకు ఎందుకు వెళ్లారో చెప్పాలని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెబుతున్న టీడీపీ, దాని అధినేత చంద్రబాబు.. తమ పార్టీ నేత అయిన బిర్రు ప్రతాప్‌ రెడ్డికి చెప్పి సుప్రిం కోర్టుకు వెళ్లకుండా ఆపి ఉంటే ఈ పాటికి మండల, జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికలు కూడా పూర్తయ్యేవి. బిర్రు ప్రతాప్‌ రెడ్డి సుప్రింలో పిటిషన్‌ దాఖలు చేయకుండా చంద్రబాబు ఆపి ఉంటే ఆయన చెబుతున్నట్లు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు దక్కేవి. కానీ అలా చేయకుండా.. హైకోర్టు తీర్పు వెల్లడించిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు బీసీలపై ముసలి కన్నీరు కారుస్తున్నారని వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది. బీసీ రిజర్వేషన్లు అంశంపై రాష్ట్రంలో స్థానిక సంస్థల నోటిఫికేషన్‌ వచ్చే వరకు రాజకీయం నడిచే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి