iDreamPost

కన్ఫ్యూజన్‌లో తనను తానే..

కన్ఫ్యూజన్‌లో తనను తానే..

‘ఇలా చుట్టూ చేరి కన్ఫ్యూజ్‌ చెయ్యకండి.. కన్ఫ్యూజన్‌లో ఎక్కువ కొట్టేస్తాను..’ అంటాడు పోకిరీ సినిమాలో మహేష్‌బాబు. సహజంగా కన్ఫ్యూజన్‌లో చేయాల్సిన పనిని చెయ్యలేకపోతుండడం జరుగుతుంది. కానీ ఇక్కడ హీరో ఇంకా ఎక్కువ కొట్టేస్తానని చెప్పడం బాగానే పేలింది. వైస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ సేవలధాటికి రాష్ట్రంలో ప్రతిపక్షాలు తీవ్ర కన్ఫ్యూజన్‌లోనే ఉన్నాయంటున్నారు పరిశీలకులు. అసలు ఏ అంశాన్నెత్తుకుని జనం ముందుకు వెళ్ళాలో అర్ధం కాక ఒక్కోసారి ఒక్కో అంశాన్ని తెరపైకి తెస్తున్నారంటున్నారు.

ఈ తరహా వ్యూహం కారణంగా తరచు ఆయా పార్టీలు వార్తల్లోకెక్కడం వరకు బాగుంటుంది కానీ జనం మనస్సుల్లో రికగ్నైజ్‌ మాత్రం కావడం లేదని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీనే పరిగణనలోకి తీసుకుంటే ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఏదో ఒక సమస్యను తలకెత్తుకుని పట్టుమని 15 రోజులు కూడా పోరాడిన దాఖలాల్లేవని గుర్తు చేస్తున్నారు. వారానికి మూడు సమస్యలు, ఆరు జూమ్‌ మీటింగ్‌లు లెక్కన అసలు ఇప్పుడు ఆ పార్టీ దేనిపై పోరాడుతుందో కనీసం జనానికి కూడా గుర్తులేకుండా చేసేస్తున్నారంటున్నారు.

నిజానికి అధికార పక్షం «ఘాటుగానే వీరిని ఎదుర్కొంటోంది. అయినప్పటికీ ధీటుగా నిలబడాల్సిన చోట టీడీపీ గత కార్యాలు వెనక్కిలాగుతున్నారంటున్నారు. ఇందుకు సదరు పార్టీ అధినేతు కన్ఫ్యూజన్‌లో ఉండడమే కారణమంటున్నారు. ఏదైనా ఒక సమస్యను తలకెత్తుకోగానే మీ హయాంలో చేసారు? అన్న ప్రశ్న సూటిగానే తగులుకుంటోంది. దీంతో సమస్యపై ఫోకస్‌ చేసేలోపు, అప్పట్లో వీళ్ళిలా చేసారు కదా? అన్న భావన ప్రజలకు గుర్తుకొస్తోంది. దీనికి తోడు ఎక్కడ ఎటువంటి సమస్య ఏర్పడినప్పటికీ వెంటనే స్పందించి దానికి అనుగుణంగా జగన్‌ చర్యలు చేపడుతున్నారు. దీంతో ప్రతిపక్షాల కన్ఫ్యూజన్‌ మరింత ఎక్కువైపోతోందంటున్నారు.

ఈ కన్ఫ్యూజన్‌ నేపథ్యంలోనే తనకుతానుగా ఎప్పుడూ బైటపడని హిందూత్వ వాదనను కూడా టీడీపీ తలకెత్తుకుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. బీజేపీతో ఎంత డీప్‌ టచ్‌లో ఉన్నప్పటికీ నేరుగా హిందూత్వ భావనలను బైటపడకుండా టీడీపీ ఇప్పటి వరకు జాగ్రత్త పడింది. కానీ ఇటీవల ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీ ఎజెండా అయిన హిందూత్వ భావనను టీడీపీ కూడా తీసుకున్నట్టు మాట్లాడడం జనం గమనించారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు టీడీపీ ఉన్న లౌకిక భావనకు బీటలు వారడంతో పాటు, ఒక వర్గం ప్రజలు టీడీపీ పట్ల ఇప్పటి వరకు ఉన్న సానుకూల అభిప్రాయానికి దూరమవుతున్నారంటున్నారు.

రాజకీయాల్లో డక్కామొక్కీలు తిన్న తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎదుటి పక్షాలు వేసే రాజకీయ ఎత్తుగడలకు చిక్కే రకమేమీ కాదు. అయినప్పటికీ బీజేపీతో స్నేహం పొందాలన్న కాంక్షతో రాష్ట్రంలోని కొన్ని కాని వివాదాల్లోకి నేరుగా తలదూర్చడం విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి. జనాన్ని ఎలా ఆకట్టుకోలి అన్నదానిపై టీడీపీలో ఉన్న కన్ఫ్యూజనే ఇందుకు కారణమంటూ విశ్లేషిస్తున్నారు. పార్టీ వ్యూహంలోనే క్లారిటీ మిస్సవ్వడంతో జనాన్ని ఆకట్టుకోవడంలో కూడా వెనుకబడుతున్నారంటున్నారు.

ఏది ఏమైనా పోకిరీ సినిమాలో హీరో కన్ఫ్యూజన్‌ విలన్లను కొంచెం ఎక్కువ కొట్టడానికి ఉపయోగపడింది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు కన్ఫ్యూజన్‌ సొంత పార్టీకే దెబ్బలు తగిలిస్తోందంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి