iDreamPost

తెలుగు దేశాన్ని నేనే గెలిపించాను – అశోక్ బాబు

తెలుగు దేశాన్ని నేనే గెలిపించాను – అశోక్ బాబు

పరుచూరి అశోక్ బాబు. ఈ మాజీ ఎన్జీవో నేత ఇప్పుడు టీడీపీ తరుపున ఎమ్మెల్సీ. ఆయన ఉద్యోగంలో ఉన్న కాలంలోనూ, రిటైర్ అయిన తర్వాత కూడా రాజకీయాలు ఆపలేదు. ఆ క్రమంలోనే తానే ఏకంగా టీడీపీని గెలిపించానని ఆయన చెప్పుకున్నారు. తాను లేకపోతే తెలుగుదేశం ఎక్కడో ఉండేది అని ప్రకటించుకున్నారు. అది కూడా నేరుగా 2014 ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేతోనే అశోక్ బాబు ఈ మాటలన్నారు. ఓ టీవీ చానెల్ చర్చలో అశోక్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.

పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన వైఎస్సార్సీపీకి 2014 ఎన్నికల్లోనే విజయం ఖాయమనే వాతావరణం కనిపించింది. అలాంటి సమయంలో అనేక శక్తుల తోడ్పాటుతో టీడీపీ కూటమి స్వల్ప ఓట్ల తేడాతో గట్టెక్కింది. దానికి అనేక రకాల పరిణామాలు కూడా తోడ్పడ్డాయి. కానీ ఇప్పుడు అశోక్ బాబు మాత్రం తనవల్లే తెలుగుదేశం గెలిచిందని, లేకుంటే అసలు ఆపార్టీయే ఉండకపోయేదన్నట్టుగా మాట్లాడడం ఆసక్తి రేపుతోంది.

అశోక్ బాబు అనాటికి ఏపీఎన్జీవో అధ్యక్షుడిగా ఉన్నారు. సమైక్యాంద్ర ఉద్యమం పేరుతో రాష్ట్రమంతా తిరిగారు. వివిధ ఆందోళనలకు పిలుపునిచ్చారు. అదంతా రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిన తర్వాత చేసిన ఉద్యమం కావడంతో ఫలితాలు రాలేదు. పైగా నాడు విభజన ఖాయం కావడంతో ఏపీ ప్రయోజనాల కోసం ఏం కావాలన్నది అడగకుండా ప్రజలను మభ్యపెట్టడంతో సమైక్యాంధ్ర పేరుతో ఛాన్స్ వదులుకున్నారనే వాస్తవం ఇప్పుడు అందరూ అంగీకరించాల్సిన వాస్తవం.

ఇక అలాంటి సమైక్యాంద్ర ఉద్యమం ద్వారా చంద్రబాబుని తాను గట్టెక్కించానని అశోక్ బాబు చెప్పుకోవడం గమనిస్తే తనను తాను ఎక్కువగా అంచనా వేసుకున్నారా లేక టీడీపీ బలహీనతలను ఆయన చెప్పదలచుకున్నారా అనేది సందిగ్దంగా మారింది. వాస్తవానికి రాష్ట్రంలో టీడీపీ ఎన్నడూ సొంతంగా అధికారంలోకి వచ్చిన అనుభవం లేదు. దానికి అనేక పార్టీల తోడ్పాటు ఎల్లవేళలా అవసరం అవుతుంది. అలాంటిది పార్టీలే కాకుండా ఉద్యోగ సంఘాల ముసుగులో తాను చేసిన రాజకీయాల కారణంగా చంద్రబాబు గట్టెక్కారని అశోక్ బాబు ఇప్పుడు చెప్పడం గమనిస్తే తన ఉద్యమం ద్వారా రాష్ట్ర ప్రజలను ఆయన మోసం చేసిన విషయం అంగీకరించినట్టుగా అంతా భావిస్తున్నారు. తమ ప్రయోజనాల కోసం ప్రజలను రోడ్డెక్కించి, రోజుల తరబడి ఉద్యమాల పేరుతో చేసిన నష్టానికి అశోక్ బాబు రాజకీయ కాంక్ష అసలు కారణం అని తేటతెల్లం అయ్యింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి తనలాంటి వాళ్లు తప్ప మరో దిక్కులేదనే సంకేతంగా కూడా ఆయన పంపించారు.

ఏమయినా తామంతా కలిసి చంద్రబాబు ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలకు, ప్రయోజనాలకు అన్యాయం చేసిన విషయాన్ని అశోక్ బాబు పరోక్షంగా అంగీకరించారు. అదే సమంయలో తెలుగుదేశం అప్పటికే మునిగిపోయే దశలో ఉండగా, ఇప్పుడు మరింత సంక్లిష్టంగా మారిన సమయంలో ఆపార్టీని కాపాడే పరిస్థితి ప్రశ్నార్థకం అనే విషయాన్ని తేల్చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి