iDreamPost

తమ్మినేని సీతారామ్ తో కూడా అనిపించుకున్నారు..

తమ్మినేని సీతారామ్ తో కూడా అనిపించుకున్నారు..

చంద్రబాబు…ఒకనాడు ఆయన ఏం చేసినా చెల్లిపోయేది. ఆయన చెప్పిందే వేదంగా ఉండేది. ఆయన దగ్గర నాయకులుగా ఉన్న నేతలంతా చెప్పిన ప్రతీ దానికి తల ఊపాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ప్రజల్లో పట్టు కోల్పోయిన తర్వాత టీడీపీ అధినేత ను అందరూ దూరం పెడుతున్నారు. ఆయన తీరుతో విసుగు చెంది పదేళ్ల క్రితమే దూరమయిన నేతలంతా ఆయన తీరు తెలుసు కాబట్టి తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆర్కే రోజా, కొడాలి నాని వంటి నేతల స్పందనలు దానికి అద్దంపడుతుంటాయి. ఒకనాడు చంద్రబాబు వెంట నడిచిన ఈ నేతలు ప్రస్తుతం బాబు బండారం బయటపెట్టే పనిలో తలమునకలై ఉన్నారు. తాజాగా అదే పరంపరలో తమ్మినేని సీతారామ్ కూడా చేరిపోయారు.

స్పీకర్ స్థానంలో కూర్చున్న సమయంలో తన రాజకీయ ప్రస్థానాన్ని తమ్మినేని సీతారామ్ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తాను టీడీపీలో ఉండగా చంద్రబాబుతో కలిసి పనిచేశానని కూడా చెప్పుకున్నారు. కానీ తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు తీరుతో ఆయన పూర్తిగా విసుగు చెందినట్టు కనిపిస్తోంది. బలం లేకపోయినా సభను శాసించాలనే తపనతో చంద్రబాబు చేస్తున్న దుస్సాహసాన్ని ఆయన సహించేది లేదని తేల్చేశారు. చివరకు టేక్ కేర్… జాగ్రత్త అంటూ తమ్మినేని సీతారామ్ నేరుగా చంద్రబాబుని హెచ్చరించడం విశేషంగా మారింది.

రాజకీయాల్లో అందరికీ అన్ని సార్లు అనుకూల పరిస్థితులుండవన్నది కాదనలేని వాస్తవం. అదే సమయంలో ప్రతికూల పరిస్థితుల్లో కూడా దానికి తగ్గట్టుగా వ్యవహరించడం సమర్థుడైన నాయకుడి పని. కానీ చంద్రబాబు పరిస్థితి అలా కనిపించడం లేదు. తనను ప్రజలు తిరస్కరించిన విషయాన్ని జీర్ణం చేసుకోలేని చంద్రబాబు, చివరకు అసెంబ్లీలో తాను ఆశించినట్టుగా జరగాలనే పట్టుదలకు పోతున్నట్టు కనిపిస్తోంది. కానీ దాని మూలంగా ఆయన పరువు పోతున్నట్టు అర్థం చేసుకోకపోవడమే విడ్డూరమే. ఒకనాడు తన అనుచరులుగా ఉన్న నేతలే ఇప్పుడు తనను హెచ్చరించే పరిస్తితిని చంద్రబాబు కొనితెచ్చుకున్నారు. అది మరింత తీవ్రమయ్యేందుకు ఆయన తీరు దోహదం చేస్తోంది. ఇప్పటికే నిగ్రహం పాటించి, సంయమనంతో చాకచక్యంగా వ్యవహరిస్తే చంద్రబాబుకి ప్రయోజనం ఉంటుంది. లేదంటే ప్రతీ రోజూ పంతాలకు పోతే బలం లేని ప్రతిపక్షమే బేజారవుతుందన్నది కాదనలేని నిజం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి