iDreamPost
android-app
ios-app

ప్రేమకు పెళ్లికి మధ్య స్వయంవరం – Nostalgia

  • Published May 22, 2021 | 3:05 PM Updated Updated May 22, 2021 | 3:05 PM
ప్రేమకు పెళ్లికి మధ్య స్వయంవరం – Nostalgia

ఇండస్ట్రీలో సక్సెస్ ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. ఇక్కడ విజయలక్ష్మి పక్కన ఉన్నన్ని రోజులు బాగానే ఉన్నట్టు అనిపిస్తాయి. ఎప్పుడైతే ఫ్లాపులు పలకరిస్తాయో అప్పటిదాకా అభిమానంతో పలకరించిన జనం మొహం చాటేస్తారు. అయితే ఒక్క హిట్టు కొడితే చాలు మళ్ళీ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా దూసుకుపోవచ్చు. ఓవర్ నైట్ హిట్టు కొట్టి స్టార్లు అయిపోయిన వాళ్ళను ఇప్పటికీ చూస్తూనే ఉంటాం. రెండు మూడు ఫ్లాపులతో తెరమరుగైన వాళ్ళూ ఉన్నారు. ఆ బ్రేక్ రావడమే ఇక్కడ కీలకం. అది కనక సరిగ్గా కుదిరితే జాతకాలు ఎలా మారిపోతాయో చెప్పడానికి మంచి ఉదాహరణ 1999లో వచ్చిన స్వయంవరం. ఆ విశేషాలు చూద్దాం.

1991లో దర్శకుడు విజయ్ భాస్కర్ సురేష్ హీరోగా ‘ప్రార్ధన’ సినిమాతో తన డెబ్యూ చేశారు. కానీ అది దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఎంతగా అంటే కనీసం టెక్నికల్ గానూ పేరు రాలేదు. లైన్ బాగున్నప్పటికీ మరీ సీరియస్ గా స్లోగా డీల్ చేయడంతో ప్రేక్షకులు తిరస్కరించారు. దీని పుణ్యమాని ఆయనకు ఎనిమిదేళ్ల అజ్ఞాతవాసం తప్పలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏవో కారణాల వల్ల 1998 దాకా ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ సమయంలో భీమవరం నుంచి వచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన కథ ఎస్పి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థకు నచ్చడంతో అలా ‘స్వయంవరం’కు తొలిబీజం పడింది. తక్కువ బడ్జెట్ తో వేగంగా పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారు.

ప్రేమకు పెళ్లికి మధ్య అయోమయంలో కొట్టుమిట్టాడే ఓ యువకుడి లవ్ స్టోరీని వినూత్నంగా ఆలోచింపజేసే విధంగా త్రివిక్రమ్ రాసిన స్టైల్ కి అంతే సహజంగా దర్శకుడు విజయ భాస్కర్ తీర్చిదిద్దిన తీరు ఎన్నో ప్రశంసలు దక్కించుకుంది. ఫ్రెష్ గా ఉండాలనే ఉద్దేశంతో కొత్త జంట వేణు, లయలను ఎంపిక చేసుకోవడం బ్రహ్మాండంగా పనికొచ్చింది. ఎర్ర సినిమాలతో పాపులర్ అయిన వందేమాతరం శ్రీనివాస్ తాను ఫీల్ గుడ్ మూవీస్ కు సైతం అద్భుతమైన ట్యూన్స్ ఇవ్వగలనని దీంతో ఋజువు చేశారు. 1999 ఏప్రిల్ 22న విడుదలైన స్వయంవరం మొదటి సినిమాగా త్రివిక్రమ్-వేణు-లయలకు గొప్ప బ్రేక్ ఇస్తే విజయభాస్కర్ కు లైఫ్ ఇచ్చింది. దీనికి ఆ సంవత్సరం ఉత్తమ సంగీతం, స్పెషల్ జ్యురీ,  బెస్ట్ సింగర్ గా చిత్ర గారికి ఇలామూడు నంది అవార్డులు దక్కడం మరో విశేషం.