iDreamPost

బతకనేర్చిన రాజకీయం

బతకనేర్చిన రాజకీయం

డబ్బు, అధికారాలు మనిషి గుణగణాలను పరీక్షిస్తాయి. అందుకే డబ్బు, అధికారం ఇచ్చి చూస్తే ఎవరేంటో తెలుస్తుందంటారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నాయకుల తీరు ఇప్పుడిలాగే ఉంది. అధికారంలో ఉండగా ఇచ్చిన హామీలనే త్రుణప్రాయంగా విస్మరించిన టీడీపీ…ప్రతిపక్షంలోకి రాగానే  కుటుంబానికి రూ.5000, రూ.7500 సాయం అందించాలంటూ డిమాండ్‌ చేస్తోంది. దీంతో ఇదే కదా అసలైన రాజకీయం అంటూ ప్రజలు చెవులుకొరుక్కుంటున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు ప్రభుత్వ సొమ్మును సొంత సొమ్ముగా భావిస్తుంటారు. ఇంకొందరు అధికారం, చేయగలిగే సామర్థ్యాలు ఉండి కూడా సాయానికి మొగ్గుచూపరు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి వైద్యం కోసం డబ్బులు ఇప్పించేందుకు పేదలను పదిసార్లు తిప్పించుకొనే ప్రజాప్రతినిధులే దీనికి ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. కానీ, సదరు ప్రజాప్రతినిధులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వానిది రాతి గుండె పేదలను ఆదుకోవట్లేదు అంటూ విమర్శలు గుప్పిస్తుంటారు. బహుశా దీన్నే బతకనేర్చిన రాజకీయం అంటారేమో….! 

తాజాగా కరోనా పరిస్థితుల్లో తెలుగుదేశం నాయుకుల డిమాండ్‌లు అవకాశవాదానికి పర్యాయపదాలుగా మారాయి. ఇప్పటికే చంద్రబాబునాయుడు కుటుంబానికి రూ.5000 సహాయం చేయాలని కోరగా, దేవినేని ఉమా రూ.7500 అందించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపైనే ఏకంగా పరిటాల సునీత,గద్దె రామ్మోహన్ ,జ్యోతుల నెహ్రూ తనయుడు, మాజీ మంత్రి జవహర్‌ వంటి వారు ఏకంగా దీక్షలు కూడా చేపట్టారు. 

కరోనా అనేది ఇప్పటి వరకు రాష్ట్రం కనీవినీ ఎదుర్కోని విపత్తు. కానీ, హుద్‌హుద్, తిత్లీ వంటి తుపానులను రాష్ట్రం ఎదుర్కొంది. ఆ సమయంలో బాధితులకు సరైన సహాయం అందించడంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం విఫలమైంది. బాధితులకు సరైన ఆర్థిక సహాయం అందలేదు. దీనిపై ఆగ్రహించిన ఓ గ్రామ  ప్రజలు ఏకంగా ఎంపీ రామ్మోహన్‌నాయుడిపై తిరుగుబాటు చేశారు. ఈ నేపథ్యంలో కేవలం మూడు జిల్లాల్లో వచ్చిన విపత్తునే ఎదుర్కోలేని నాయకులు ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం నిజంగా శోచనీయమే…! 

2014కు ముందు చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. వ్యవసాయ, బంగారు రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి తదితరాలు వీటిలో కొన్ని. అయితే వీటిలో దేన్నీ ఆయన పూర్తి స్థాయిలో నిలబెట్టుకోలేకపోయారు. ఫలితంగా అధికారం కోల్పోయారు. కానీ, ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన జగన్‌మోహన్‌రెడ్డి దారాళంగా సంక్షేమానికి నిధులు వెచ్చిస్తున్నారు. హామీలనే కాకుండా చెప్పనవీ చేస్తున్నారు. అయినప్పటికీ ప్రతిపక్ష నాయకులు ఇలాంటి సమయంలో పరిహారం పేరుతో రాజకీయం చేయడం శోచనీయం. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి