iDreamPost

రాష్ట్రమా.. రాజకీయమా..? మెసేజ్ ఈజ్ క్లియర్

రాష్ట్రమా.. రాజకీయమా..? మెసేజ్ ఈజ్ క్లియర్

గత చంద్రబాబు నాయుడి ప్రభుత్వం తమ హాయంలోని గడిచిన ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం తరపున మీడియాకి అనధికారికంగా ఒక స్పష్టమైన మెసేజ్ ఇచ్చేది. కారణాలు ఏవైనా రాష్ట్రలో జరుగుతున్నా పరిణామాలపై “నెగటివ్” ప్రచారం వద్దు అనేది ఆ మెసేజ్ తాలూకు సారాంశం. రాష్ట్రంలోని ప్రతిపక్షాలతో పాటు ఇతర రాజకీయ పార్టీలు తమ రాజకీయ అవసరాల కోసం చేసే దుష్ప్రచారానికి మీడియా ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం లేదని.. అటువంటి విషయాలకు అనవసర ప్రచారం కల్పించడం వలన రాష్ట్రానికి రావలసిన పెట్టుబడులు వెనక్కి పోతాయి. ఇది రాష్ట్ర పురోగతి పై ప్రభావం చూపుతుందని ప్రభుత్వ ఉద్దేశం. అందువల్ల ఈ విషయంలో ఒక “పాజిటివ్ అట్మాస్పియర్” కల్పించాల్సిన భాద్యత మీడియాపై ఉందని గతంలో చంద్రబాబు ప్రభుత్వం అనేక సందర్భాల్లో చెప్తుండేది.

గత ప్రభుత్వం ప్రతిపక్షాల విమర్శను “రాక్షసుల దాడి” గా అభివర్ణించి కొట్టిపారేసింది. అధికారంలో ఉన్న అప్పటి ప్రభుత్వ పెద్దల అభిష్టానికి తగ్గట్టే మీడియా కూడా ప్రతిపక్షాల వార్తలకు, ప్రభుత్వం మీద చేసే ఆరోపణలకు అంతగా ప్రాధాన్యత ఇచ్చేది కాదనేది అప్పటి ట్రెండ్ ని చూస్తే అర్ధమౌతుంది. మొత్తానికి అప్పట్లో రాష్ట్రంలో “పాజిటివ్ అట్మాస్పియర్” చూపించే వార్తలే మీడియాలో ప్రముఖంగా వచ్చేవి. ‘ఆంధ్ర ప్రదేశ్ పెట్టుబడులకు అనుకూలం’ అనో… ‘రాష్ట్రంలో పెట్టుబడుల వరదలు’ అనో.. వార్తలు పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో వచ్చేవి.

విచిత్రం ఏమంటే.. ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడం, రాష్ట్రంలో అధికారం మారడంలో ఇప్పుడు అదే నేతలు, అవే మీడియా సంస్థలు వార్తల స్టయిల్ ని పూర్తిగా మార్చేశాయి. గతంలో “రాష్ట్రంపై ప్రభావం చూపే నెగటివ్ వార్తలు వద్దు” అని చెప్పిన సదరు నేతలు ఇప్పుడు నిత్యం అవే మాటలు చెపుతున్నారు. ఆశ్చర్యకరంగా గత ఐదేళ్ళ చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో సానుకూల వాతావరణం నెలకొల్పడానికి పాటుపడిన పత్రికల్లో ఇప్పుడు కేవలం “నెగిటివ్” వార్తలే నిత్యకృత్యం అయ్యాయి.

గతంలో ప్రభుత్వ పెద్దలు ఒక దేశం సందర్శించినా, ఒక కంపెనీ ప్రతినిధులతో సమావేశం జరిపినా రాష్ట్ర ప్రభుత్వం తో కలసి పనిచేసేందుకు పలానా దేశం ఎంతో ఆసక్తి గా ఉందటూ పతాక శీర్షికల్లో వచ్చిన వార్తలు ఇప్పుడు అసలు మచ్చుకైనా కనిపించడం లేదు. పైగా ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతున్నట్టు వస్తున్న వార్తలు (నిజమో, అబద్దమో తెలియకుండానే) మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.

దానికి తాజా ఉదాహరణే ‘కియా’ వ్యవహారం. అనంతపురం జిల్లాలో నెలకొల్పి, ఉత్పత్తిని కూడా ప్రారంభించిన కొరియాకి చెందిన ప్రముఖ అంతర్జాతీయ ఆటోమోబైల్ దిగ్గజం కియా కంపెనీ తన ప్లాంటుని అనంతపురం నుండి తమిళనాడుకి తరలించాలనే యోచనలో ఉందంటూ ఒక అంతర్జాతీయ దినపత్రికలో కధనం వెలువడడం, వెంటనే ఇక్కడ పత్రికలు కనీసం సదరు కియా కంపెనీ ని సంప్రదించకుండా, ప్రభుత్వం నుండి వివరణ కూడా తీసుకోకుండా రాష్ట్రం నుండి కియా తరలివెళుతుందటూ ఉద్దేశపూర్వకంగా పెద్దఎత్తున ప్రచారం చెయ్యడం జరిగింది. అయితే ఆ వార్తని స్వయంగా కియా కంపెనీ యండి ఖండించినప్పటికీ ఆయన వివరణకు పత్రికల్లో లోపలి పేజీలలో కూడా చోటు కల్పించకపోవడం చూస్తుంటే మీడియా వ్యవహారశైలిపై సామాన్యులకు కూడా అనుమానాలు కలుగుతున్నాయి.

అదే విధంగా ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎఐఐబి రాష్ట్రానికి ఋణం ఇస్తానాని ముందుకు వచ్చినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలి నచ్చక వెనక్కి వెళ్లిందని ఇలా నిత్యం రాష్ట్రంలో పెట్టుబడుల పై ప్రభావం చూపేవిధంగా “నెగిటివ్” వార్తలకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలో ఎదో జరిగిపోతున్నట్టు ప్రచారం చేస్తూ ప్రజల్లో భ్రమలు కలిగించడానికి పడరాని పాట్లు పడుతుంది.

అదే సమయంలో గతంలో చంద్రబాబు హాయంలో కేంద్రప్రభుత్వం శ్రీకాళహస్తి లో ప్రతీష్టాత్మకంగా ప్రారంభించిన బెల్ సంస్థలో 70 % నిధులకు కోత విధించినా.. కడపలో ఉక్కు కర్మాగారం పెడతామని హామీ ఇచ్చినా… రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నాయని ప్రచారం జరిగిన అనేక అంతర్జాతీయ సంస్థలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లినా… అప్పట్లో ఈ అంశాలమీద మీడియాలో కనీస స్పందన కూడా లేదు. అంతేకాక గత చంద్రబాబు నాయకుడు ప్రభుత్వం విశాఖపట్టణంలో పలుమార్లు భాగస్వామ్య సదస్సులు నిర్వహించడం ద్వారా.. దావోస్ పర్యటనల ద్వారా… రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడుల వరద పారుతుందనట్టు, లక్షలమందికి ఉద్యోగాలు లభించనున్నట్టు ఇక్కడి మీడియా ఊదరగొట్టేది. గత ప్రభుత్వ హాయంలో విదేశాల నుండి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని పెద్దఎత్తున ప్రచారం చేసినప్పటికీ వాస్తవానికి అవేవి కూడా కార్యారూపం దాల్చలేదు.

మరి ఇంత సెడన్ గా మీడియా ఆలోచన, ఆచరణల ధోరణిలో వచ్చిన ఈ మార్పు రాజకీయాలకోసమా?? లేక రాష్ట్రం కోసమా?? మరి రాష్ట్రప్రయోజనాల రాష్ట్రం కోసమే అయితే అప్పటి “పాజిటివ్ అట్మాస్పియర్” దృక్పధం ఇప్పుడు కూడా అవసరమే కదా??

రాష్ట్రాభివృద్దే లక్ష్యం అయినప్పుడు భయోత్పాత వాతావరణం కనిపించే వ్యాఖ్యలు రాజకీయ పార్టీలు చేయడం, అలాంటి వార్తలు మీడియా ప్రముఖంగా చూపించడం సమర్ధనీయం కాదు కదా?? మరెందుకు మీడియా ధోరణి లో ఈ మార్పు?? ఈ మార్పు దేనికి సంకేతం?? అప్పుడు రాష్ట్రం కోసం కావాల్సిన “పాజిటివ్ అట్మాస్పియర్” ఇప్పుడు అవసరం లేదా?? ఇంతకూ “పాజిటివ్ అట్మాస్పియర్” రాష్ట్రం అభివృద్ధి కోసమా ?? లేక తమకు నచ్చిన.. తమకు బాగా కావాల్సిన వ్యక్తులు మాత్రమే అధికారంలో ఉండడం కోసమా??..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి