iDreamPost

నిన్న ఆఫ్ఘాన్‌.. 20 ఏళ్ల క్రితం సౌత్ ఆఫ్రికా! లెక్కలు తెలియక ఓడిపోయారు

  • Published Sep 06, 2023 | 2:42 PMUpdated Sep 06, 2023 | 2:44 PM
  • Published Sep 06, 2023 | 2:42 PMUpdated Sep 06, 2023 | 2:44 PM
నిన్న ఆఫ్ఘాన్‌.. 20 ఏళ్ల క్రితం సౌత్ ఆఫ్రికా! లెక్కలు తెలియక ఓడిపోయారు

ఆసియా కప్‌లో భాగంగా మంగళవారం శ్రీలంక-ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగింది. ఆఫ్ఘాన్‌ పోరాటానికి క్రికెట్‌ అభిమానులు ఫిదా అయిపోయారు. కానీ, చివర్లో చేసిన చిన్న తప్పుతో మ్యాచ్‌తో పాటు ఆసియా కప్‌ నుంచి నిష్క్రమించారు. లెక్కలు తెలియక జరిగిన తప్పుకు ఆఫ్ఘానిస్థాన్‌ భారీ మూల్యం చెల్లించుకుంది. 37.1 ఓవర్లలో 292 పరుగులు చేయాలనే లెక్క ఒక్కటే తెలుసుకుని, దాని కోసం చివరి వరకు పోరాడి, 3 పరుగుల దూరంలో ఆగిపోయిన సమయంలో బాధతో కుప్పకూలిపోయారు. కానీ, ఆ తర్వాత కూడా 38వ ఓవర్‌లో మిగిలిన 5 బంతుల్లో ఏ ఒక్క సిక్స్‌ వెళ్లినా.. తాము సూపర్‌ 4కి క్వాలిఫై అవుతామనే లెక్కను మిస్‌ అయ్యారు.

రషీద్‌ ఖాన్‌కు ఆ విషయం తెలియక కొత్త బ్యాటర్‌ ఫారూఖీతో సింగిల్‌ తీయించి, మిగిలిన 4 బంతుల్లో ఒక సిక్స్‌ కోసం ట్రై చేయకుండా మ్యాచ్‌ను గివ్‌ అప్‌ చేశాడు. సిక్స్‌ కొడితే క్వాలిఫై అవుతామని రషీద్‌కు తెలిసుంటే.. కచ్చితంగా ప్రయత్నించేవాడు. కానీ, ఆ లెక్క తెలియక ఆఫ్ఘానిస్థాన్‌ ఓటమి పాలైంది. అయితే.. అచ్చం ఇలాంటి ఓ దురదృష్ట ఘటన సరిగ్గా 20 ఏళ్ల క్రితం సౌతాఫ్రికా విషయంలోనూ చోటు చేసుకుంది. ఇప్పుడు ఆఫ్ఘాన్‌-శ్రీలంక మ్యాచ్‌ను చూసిన తర్వాత.. 2003 వరల్డ్‌ కప్‌లో శ్రీలంక-సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌ గుర్తుకు వస్తుంది. ఆ మ్యాచ్‌లోనూ సౌతాఫ్రికా లెక్కలు తెలియక.. గెలవాల్సిన మ్యాచ్‌ను టైగా ముగించి.. వరల్డ్‌ కప్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆ మ్యాచ్‌ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

2003 వరల్డ్‌ కప్‌లో సూపర్‌ సిక్స్‌కు వెళ్లాలంటే శ్రీలంకపై సౌతాఫ్రికా గెలవాలి. అప్పటికే శ్రీలంక సూపర్‌ 6కు క్వాలిఫై అయిపోవడంతో వారిపై ఎలాంటి ఒత్తిడి లేదు. ప్రెషర్‌ మొత్తం సౌతాఫ్రికాపైనే ఉంది. సౌతాఫ్రికా గెలిస్తే.. న్యూజిలాండ్‌ వరల్డ్‌ కప్‌ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. సౌతాఫ్రికా ఓడినా, మ్యాచ్‌ టై అయినా, వర్షం కారణంగా రద్దు అయినా కూడా న్యూజిలాండ్‌ సూపర్‌6కి వెళ్తుంది. సౌతాఫ్రికా సూపర్‌ 6కు వెళ్లాలంటే గెలవడం తప్ప ఇంకో మార్గం లేదు. సౌతాఫ్రికా గెలుపోటములపై న్యూజిలాండ్‌ వరల్డ్‌ కప్‌ భవితవ్యం ఆధారపడి ఉంది.

ఇలాంటి చావోరేవో లాంటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా ముందు లంక 269 పరుగుల టార్గెట్‌ ఉంచింది. అప్పటి శ్రీలంక ఓపెనర్‌ ఆటపట్టు(124 రన్స్‌) సెంచరీతో చెలరేగాడు. అలాగే అరవిందా డిసిల్వా సైతం 73 రన్స్‌తో రాణించాడు. మొత్తానికి లంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. సౌతాఫ్రికా మ్యాచ్‌ గెలవాలంటే 269 పరుగులు చేయాలి. కానీ, మ్యాచ్‌కు వర్ష గండం ఉంటడంతో సౌతాఫ్రికా గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. వర్షం వచ్చి మ్యాచ్‌ ఆగిపోతే.. మ్యాచ్‌ రద్దు అయితే తాము టోర్నీ నుంచి ఇంటికి పోతామనే భయం ఉంది.

ఈ భయంతోనే తమ ఇన్నింగ్స్‌ ఆరంభించింది సౌతాఫ్రికా. గ్రేమ్‌ స్మిత్‌, హర్షల్‌ గిబ్స్‌ ప్రొటీస్‌ టీమ్‌కు మంచి స్టార్ట్‌ ఇచ్చారు. తొలి వికెట్‌కు 65 పరుగులు జోడించిన తర్వాత స్మిత్‌ 35 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. మరో ఓపెనర్‌ గిబ్స్‌ మాత్రం 73 రన్స్‌తో మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆ తర్వాత లంక బౌలర్లు చెలరేగి వెంటవెంటనే వికెట్లు తీయడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ తడబడింది. కానీ.. వికెట్‌ మార్క్‌ బౌచర్‌ బాగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చేలా కనిపించాడు. మ్యాచ్‌ కీలక దశకు చేరుకుంది. 32 బంతుల్లో 46 పరుగులు కావాలి. చేతిలో 4 వికెట్లు ఉన్నాయి.

అప్పటి వరకు బౌచర్‌ ఆడుతున్న తీరు చూస్తే.. ఇది పెద్ద కష్టమైన పని కాదు. పైగా అతనితో క్రీజ్‌లో ఉన్న లాన్స్ క్లూసెనర్ కూడా మంచి షాట్లు ఆడే ఎబిలిటీ ఉన్న ప్లేయరే. దాంతో సౌతాఫ్రికా గెలిచి సూపర్‌ 6లోకి అడుగుపెడుతుందని అంతా భావించారు. కానీ, అప్పుడే వర్షపు చినుకులు మొదలయ్యాయి. అప్పుడు మ్యాచ్‌ ఆగినా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో కచ్చితంగా ఫలితం తేల్చేస్తారు. అప్పటి రూల్‌ ప్రకారం ఇరు జట్లు 25 ఓవర్లపైగా బ్యాటింగ్‌ చేస్తే.. మ్యాచ్‌ ఫలితం వెల్లడించాల్సిందే. ఇప్పుడు ఆ రూల్‌లో మార్పు చేసి 20 ఓవర్లకు కుదించారు.

తిరిగి మ్యాచ్‌ విషయానికి వస్తే.. వర్షపు చినుకులు పెరుగుతూ మ్యాచ్‌ ఆగే దశలో ముత్తయ్య మురళీధరన్‌ వేసిన 45వ ఓవర్‌ 5వ బంతికి బౌచర్‌ భారీ సిక్స్‌ బాదాడు. ఆ ఓవర్‌ తర్వాత మ్యాచ్‌ ఆగినా కూడా డక్‌ వర్త్‌ లూయిస్‌ ప్రకారం తాము విజయం సాధిస్తామనే ధీమాలో ఉన్న బౌచర్‌ చివరి బంతికి సింగిల్‌ తీసే అవకాశం ఉన్నా కూడా పరుగు కోసం వెళ్లలేదు. వర్షం పెద్దది కావడంతో అంపైర్లు 45 ఓవర్లు ముగిసిన తర్వాత మ్యాచ్‌ను ఆపేశారు. ఆ తర్వాత వర్షం ఎంతకీ ఆగకపోవడంతో.. విజేతను డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో వెల్లడించాల్సిన పరిస్థితి నెలకొంది.

సరిగ్గా 45 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా 230 పరుగులు చేయాల్సి ఉంది. కానీ, దురదృష్టవశాత్తు 229 పరుగులు చేసింది. దాంతో మ్యాచ్‌ టైగా ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. అంతే.. సౌతాఫ్రికా టోర్నీ నుంచి నిష్క్రమించి, న్యూజిలాండ్‌ సూపర్‌ 6కు చేరింది. మార్క్‌ బౌచర్‌ 45వ ఓవర్‌ చివరి బంతికి సింగిల్‌ తీసుకొని ఉండి ఉంటే సౌతాఫ్రికా ఆ మ్యాచ్‌ గెలిచేది. కానీ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 45 ఓవర్లు ముగిసే సమయానికి సరిగ్గా ఎన్ని పరుగులు చేయాలో బౌచర్‌కు తెలిసి ఉంటే ఆ సింగిల్‌ తీసుకునే వాడు. సౌతాఫ్రికా వరల్డ్‌ కప్‌ సూపర్‌ 6లోకి ప్రవేశించి ఉండేది.

ఆ ఓటమిని జీర్ణించుకోవడానికి సౌతాఫ్రికాకు చాలా కాలం పట్టింది. ఎందుకంటే వరల్డ్‌కప్‌ ప్రారంభానికి ముందు వరుసగా 8 వన్డేలు గెలిచి, వరల్డ్‌ కప్‌ ఫేవరేట్స్‌లో ఒకటిగా ఉంది సౌతాఫ్రికా. పైగా వరల్డ్‌ కప్‌ వాళ్లదేశంలోనే జరుగుతుండటం, జట్టు ఎంతో బలంగా ఉండటంతో సౌతాఫ్రికన్లు వరల్డ్‌ కప్‌పై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ, చాలా దురదృష్టకరమైన రీతిలో కేవలం లెక్క సరిగ్గా తెలియక.. సౌతాఫ్రికా వరల్డ్‌ కప్‌ ఫస్ట్‌ రౌండ్‌లోనే ఇంటి ముఖం పట్టింది. ఇలాంటి దురదృష్టం మళ్లీ 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్‌ విషయంలో రిపీట్‌ అయింది.

అప్పుడు సౌతాఫ్రికా వరల్డ్‌కప్‌ టోర్నీ నుంచి నిష్క్రమిస్తే.. ఇప్పుడు ఆఫ్ఘాన్‌ ఆసియా కప్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. అప్పుడు బౌచర్‌కు లెక్క తెలియక సింగిల్‌ తీయలేదు. ఇప్పుడు రషీద్‌ ఖాన్‌కు లెక్క తెలియక.. ఫారూఖీతో సింగిల్‌ తీయించి, మిగిలి నాలుగు బంతుల్లో సిక్స్‌ కొట్టడం కోసం ప్రయత్నించకుండా ఓటమి బాధలో నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లోనే ఉండిపోయాడు. క్వాలిఫై సంగతి అటుంచితే.. 77 బంతుల్లో 3 పరుగులు చేయలేక ఆఫ్ఘనిస్థాన్‌ ఓటమి పాలైంది. మరి ఈ రెండు మ్యాచ్‌లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: నేను కుందేలులా ఉంటానని ధోని ఆ పేరు పెట్టాడు: కోహ్లీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి