iDreamPost

బాబు ప్రతిపక్షం కాదు కాంగ్రెస్ పక్షం అంటా

బాబు ప్రతిపక్షం కాదు కాంగ్రెస్ పక్షం అంటా

ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు ప‌దే ప‌దే విమర్శలతో చంద్రబాబును ఊపిరి పీల్చుకోనియ్యటంలేదు. చంద్రబాబు చేసిన తప్పులను బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌నే ప్ర‌య‌త్నంతో పాటు, ప‌డ్డ వాళ్ల‌కి కూడా నిజంగా మ‌న పార్టీ అంతేనేమో అనుకునేలా ఆయ‌న మాట‌ల తీరు ఉంటోంది. అందుకే అదో పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ స్పీచ్ థెర‌ఫీ లా భావించ‌వ‌చ్చున‌న్న మాట‌. అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి కూడా సోము త‌న‌దైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. 2024లోగా క‌నీసం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా పార్టీని నిల‌బెట్టాల‌నే తాప‌త్ర‌యం ఆయ‌న‌లో బ‌లంగా క‌నిపిస్తోంది. ఆయ‌న దిశ కూడా అలాగే సాగుతోంది. ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్షంలో ఉన్న తెలుగుదేశం ల‌క్ష్యంగా ఆయ‌న రాజ‌కీయాలు సాగుతున్నాయి.

ఆ డైలాగ్ త‌ప్ప‌నిస‌రి…

సోము వీర్రాజు మీడియా స‌మావేశం పెట్టినా, పార్టీ మీటింగ్ అయినా తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడుపై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్ట‌డం తెలిసిందే. దాంతో పాటు తెలుగుదేశం ప్ర‌తిప‌క్ష పార్టీ కాద‌ని, ఆ పాత్ర కోల్పోయింద‌ని ప‌దే ప‌దే చెబుతూ ఉంటారు. తాజాగా గురువారం నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో కూడా ఆయ‌న అదే అన్నారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కేతినేని సురేంద్రమోహన్‌ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం సంద‌ర్భంగా విశాఖలో నిర్వహించిన స‌మావేశంలోను చంద్రబాబుది ప్రతిపక్ష పార్టీ కాదని, కాంగ్రెస్‌ పక్షమని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ద్వితీయ ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ ఎదుగుతోందన్నారు. అలాగే ఏపీలో బీజేపీలో చేరేందుకు పెద్దఎత్తున టీడీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారని ప్ర‌క‌టించారు.

సున్నా టూ టార్గెట్ వైపు..

ఏపీలో ప్ర‌స్తుతం బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. తెలుగుదేశానికి 23 మంది ఎమ్మెల్యేలు (వారిలో చాలా మంది వైసీపీకే మ‌ద్ద‌తు తెలుపున్నార‌నుకోండి) ఉన్నారు. సోము ఔన‌న్నా, కాద‌న్నా ప్ర‌స్తుతానికి అయితే ఏపీలో అదే ప్ర‌తిప‌క్ష పార్టీ. అయితే ఆ స్థాయిలో టీడీపీ ప‌ని చేయ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు ఉన్నాయి. క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు రాష్ట్రం వ‌దిలి ప‌క్క రాష్ట్రానికి వెళ్లిపోవ‌డంతో తీవ్ర ఆక్షేప‌ణ‌ల పాల‌య్యారు. దీన్ని అదునుగా చేసుకుని సోము అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా తెలుగుదేశం ప్ర‌తిప‌క్ష పార్టీ కాదంటూ ప్ర‌చారం చేస్తున్నారు. దీని వెనుక భ‌విష్య‌త్ లో బీజేపీని సున్నా నుంచి ప్ర‌తిప‌క్ష హోదాకి తీసుకెళ్లాల‌నే సోము బ‌ల‌మైన కోరిక క‌నిపిస్తోంది. ఆ కోరిక‌తోనే సోము త‌న స్పీచ్ లో త‌ప్పనిస‌రిగా ఆ ప్ర‌స్తావ‌న తెస్తున్నార‌న్న ప్రచారం జ‌రుగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి