iDreamPost

దర్శకధీరుడికి నీరాజన వర్షం

దర్శకధీరుడికి నీరాజన వర్షం

ఆర్ఆర్ఆర్ విడుదలై ఆరు నెలలు దాటేసింది. ఓటిటిలో ఎప్పుడో వచ్చేసింది. శాటిలైట్ ఛానల్ ప్రీమియర్స్ అన్ని భాషల్లో జరిగిపోయాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు హిందీ నెట్ ఫ్లిక్స్ లో, మిగిలిన భాషలకు జీ5లో అందుబాటులో ఉంది. కొన్ని కీలకమైన సన్నివేశాలు, ఎపిసోడ్లు హిందీ వెర్షన్ హక్కుదారు పెన్ స్టూడియోస్ యుట్యూబ్ అఫీషియల్ ఛానల్ లో అందుబాటులో ఉంచేసింది. ఇలాంటి పరిస్థితిలో ఎంత గ్రాండియర్ కైనా థియేటర్ లో జనం మళ్ళీ చూడటం కష్టమే. అయినా కూడా యుఎస్ బియాండ్ ఫస్ట్ పేరిట జరుగుతున్న స్పెషల్ ప్రీమియర్లో ప్రపంచపు అతి పెద్ద ఐమాక్స్ స్క్రీన్ మీద దీన్ని వెయ్యి దాకా ప్రేక్షకులు చూసి థ్రిల్ అవ్వడం విశేషం.

ప్రశంసల పర్వాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్న ట్రిపులార్ నిజమైన బ్లాక్ బస్టర్ కి అర్థాన్ని నిర్వచిస్తోంది. కెజిఎఫ్ 2 ఎప్పుడో చల్లారిపోయింది. దాని గురించి మాట్లాడుకునే వాళ్ళే లేరు. ఘనంగా బాలీవుడ్ చాటింపేసుకున్న బ్రహ్మాస్త్రకి ఈ స్థాయి ఆదరణ కలలో కూడా ఊహించలేం. గంగూబాయ్ కటియావాడి, భూల్ భూలయ్యా 2 వీటి గురించి ఎంత గర్వంగా చెప్పుకున్నా ఎన్ని గొప్పలు పోయినా అవన్నీ ఆర్ఆర్ఆర్ ముందు గడ్డిపోచని ఋజువయ్యింది. స్క్రీనింగ్ జరిగాక హాలీవుడ్ టాలీవుడ్ తేడా లేకుండా అందరూ అక్కడికి ప్రత్యక్షంగా వచ్చిన రాజమౌళికి చప్పట్లు ఈలలుతో నీరాజనాలు పలకడం గతంలో ఎవరికీ దక్కని గౌరవమన్నది వాస్తవం.

ఇక్కడితో అయిపోలేదు. ఈ ఫెస్ట్ లో భాగంగా జక్కన్న ఇతర సినిమాలు బాహుబలి 1, బాహుబలి 2, మగధీర, ఈగలను ఏకధాటిగా ప్రదర్శిస్తే వాటికి సైతం ఇంతే స్థాయిలో అదిరిపోయే రెస్పాన్స్ రావడం గమనార్హం. పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు రాజమౌళికి ఆస్కార్ ఇవ్వాల్సిందేనని బలంగా రికమండ్ చేయడం విశేషం. ఇటీవలే ఇండియా తరఫున అఫీషియల్ నామినేషన్ గా వెళ్లలేకపోయిన ఆర్ఆర్ఆర్ కు ఇతర విభాగాల్లో పురస్కారం అందజేయలనే డిమాండ్ పెరుగుతోంది. అసలు ఒక ఇండియన్ మూవీకి ఓవర్సీస్ లో రిలీజైన ఆరు నెలల తర్వాత కూడా ఇదే రిసెప్షన్ దక్కడం మొదటిసారి. ఇక చైనా, జపాన్ లో ఎలాంటి రికార్డులు నమోదవుతాయో చూడాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి