iDreamPost

శ్రీలంక ప్రజలకు కాకినాడ నుంచి సాయం

శ్రీలంక ప్రజలకు కాకినాడ నుంచి సాయం

శ్రీలంక ప్రజల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది.తినడానికి తిండి లేదు అని బాధపడాలో రోగం వస్తే మందుల్లేక ఇబ్బంది పడాలో లేక పెట్రోల్ డీజిల్ లేక దేశమంతా ఎక్కడిక్కడ స్తంభించిపోయిందని బాధపడాలో అర్ధంకాని పరిస్థుతులలో అక్కడి ప్రజలు ఉన్నారు. ఆవేశంతో ప్రజలు రోడ్లు ఎక్కడంతో కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. అంతర్యుద్ధం కంటే భయంకరమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు పెద్దన్నలా భారత్ అండగా నిలబడింది. నిత్యావసర వస్తువులైన ఇంధనం, బియ్యాన్ని లంకకి భారత్ పంపగా ఇప్పుడు మరోసారి ఏపీ నుంచి సాయం వెళుతోంది.

శుక్రవారం సాయంత్రం కాకినాడ యాంకరేజ్ పోర్టు నుండి శ్రీలంకకు చెన్ గ్లోరి-1 కార్గో నౌక బయలు దేరింది. ఈ నెల 11వ తేదీ సాయంత్రానికి చెన్ గ్లోరి-1 కొలంబో చేరుకోనుంది. ఈ నౌకలో 11 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపుతున్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో శ్రీలంక ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు. శ్రీలంకను ఆదుకునే ఉద్దేశంతో భారత ప్రభుత్వం మానవతా సాయం ప్రకటించింది. అందులో భాగంగా కాకినాడ పోర్టు ద్వారా 40 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపేందుకు ఏర్పాట్లు జరగగా ఇప్పుడు అత్యవసరంగా 11 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పట్టాభి ఆగ్రో ఫుడ్ సంస్థ ద్వారా శ్రీలంకకు కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసింది.

కేంద్రం పంపిన బియ్యాన్ని రేషన్ డిపోల ద్వారా అక్కడ ప్రజలకు శ్రీలంక సర్కార్ సరఫరా చేయనుంది. మరోపక్క రెండు రోజులుగా ప్రధాని రాజపక్సే ఇంటివద్ద ప్రజలు తీవ్ర దాడులకు పాల్పడుతున్నారు. దీంతో రాజపక్సే ప్రాణాలకు ప్రమాదం ఉందని అంటున్నారు. ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ ఎక్కువగా వినిపిస్తున్న క్రమంలో రాజపక్సే విదేశాలకు పారిపోయే యోచనలో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి