Venkateswarlu
Venkateswarlu
జగపతి బాబు ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఓ వెలుగు వెలిగారు. మహిళల్లో సూపర్ ఫాలోయింగ్‌ను తెచ్చుకున్నారు. అలాంటి ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌లో రూటు మార్చారు. విలన్‌గా మాస్ రోల్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. సినిమాల్లో తన మార్కు విలనిజాన్ని పండిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నారు. ఆయన తాజాగా ‘రుద్రంగి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. మరి, ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?..
కథ
1940ల ప్రాంతంలో రుద్రంగి అనే ప్రాంతాన్ని భీమ్ రావ్ దేశ్‌ముఖ్( జగపతి బాబు) పాలిస్తూ ఉంటాడు. భీమ్ రావు చాలా క్రూరుడు. ప్రజల్ని బానిసల్లా చూస్తూ ఉంటాడు. దానికి తోడి అతడికి అమ్మాయిల పిచ్చి ఉంటుంది. మోజు పుడితే చాలు వారిని తన దాన్ని చేసుకుని అనుభవిస్తూ ఉంటాడు. ఎదురు తిరిగిన వారిని దారుణంగా చిత్ర హింసలకు గురి చేస్తూ ఉంటాడు. అతడి అప్పటికే మీరాభాయి( విమలారామన్) అనే అమ్మాయితో పెళ్లి అయి ఉంటుంది.
అయినా జ్వాలా భాయి(మమతా మోహన్‌దాస్) మీద మోజుతో ఆమెను కూడా పెళ్లి చేసుకుంటాడు. ఆమె ప్రవర్తన నచ్చక ఆమెను దూరం పెడతాడు. ఈ నేపథ్యంలో అతడు రుద్రంగి (గనవి లక్ష్మణ్) అనే యువతిపై మనసు పారేసు కుంటాడు. ఆమెను ఎలాగైనా తన దాన్ని చేసుకోవాలని భావిస్తాడు. అప్పటికే భీమ్ రావ్ మీద కోపంతో ఉన్న ప్రజలు అతడికి ఎదురు తిరుగుతారు. ఈ క్రమంలో భీమ్ రావుకు ఎదురయ్యే ఇబ్బందులు.. రుద్రంగి గురించి అతడికి తెలిసే నిజాలు.. చివరకు భీమ్ రావ్ రుద్రంగి దక్కించుకున్నాడా? లేదా? అన్నదే మిగితా కథ.
విశ్లేషణ
ఈ మధ్య కాలంలో పీరియాడిక్ డ్రామాలు రావటం బాగా తగ్గిపోయింది. అలాంటి ఈ సమయంలో దర్శకుడు అజయ్ సామ్రాట్ ఓ మంచి ప్రయత్నాన్ని చేశాడని చెప్పొచ్చు. ఓ మంచి కథను రాసుకోవటమే కాదు.. అందులోని పాత్రలకు సరిగ్గా సూటయ్యేలా నటుల్ని ఎంచుకున్నారు. కథకు జగపతిబాబు ప్లస్ అయ్యాడని చెప్పొచ్చు. కథ పాత చింతకాయ పచ్చడిలా కాకుండా కొంత కొత్తగా ఉంది. పీరియాడిక్ డ్రామ కాబట్టి అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టే చూపే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ విషయంలో కూడా అజయ్ సక్సెస్ అయ్యాడు.
ఫస్ట్ హాప్ ఎంతో ఎంగేజింగ్ దూసుకుపోతుంది. ఎక్కడా బోరు కొట్టదు. అలా జాగ్రత్తలు తీసుకుని మరీ కథను ముందుకు నడిపించాడు దర్శకుడు. అయితే, కొన్ని పాత్రల విషయంలో దర్శకుడు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ముఖ్యంగా సినిమాలో హైలెట్‌గా నిలిచే మమతా మోహన్‌దాస్ పాత్రను చివరకు వచ్చే సరికి పక్కకు పెట్టేశాడు. క్లైమాక్స్‌లో ఆమె కంత ప్రాధాన్యత కూడా ఉండదు. క్లైమాక్స్ సీన్ల విషయంలో దర్శకుడు ఇంకొంత శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కొంత సాగదీసినట్లుగా అనిపిస్తూ ఉంది. కొన్ని సీన్లు మరీ ఇంత సేపు అవసరమా అన్న ఫీలింగ్ కలుగుతుంది.
ఎవరెవరు ఎలా చేశారంటే
విలన్ పాత్రలో జగపతి బాబు ఎప్పటిలాగే అదరగొట్టారు. తనదైన శైలి మ్యానరిజంతో సినిమాను మరో లెవల్‌కు తీసుకుపోయారు. ఒకరకంగా పాత్రలో జీవించేశారు. జగపతి బాబు భార్య పాత్రలో మీరాభాయిగా.. విమలారామన్ ఒకప్పటి మహిళకు ప్రతీకగా నిలుస్తారు. పతియే ప్రత్యక్ష దైవం అనుకునే భార్య పాత్రలో జీవించేశారు. ఇక, జ్వాలా భాయి పాత్రలో మమతా మోహన్‌దాస్ ఇరగ దీశారు. మమతా మోహన్ దాస్ స్క్రీన్ మీద కనిపించిన ప్రతీసారి ఆమె నటనతో నిజంగానే ఫైర్ మొదలవుతుంది. చాలా రోజుల తర్వాత మమతా మోహన్ దాస్‌కు ఓ మంచి పాత్ర లభించిందని చెప్పొచ్చు. అందుకే పాత్రలో లీనమైపోయి నటించారు. రుద్రంగి పాత్ర చేసిన గనవి లక్ష్మణ్.. మల్లేష్ పాత్రలో నటించిన ఆశీష్ గాంధీ.. భుజంగ రావు పాత్రలో నటించిన కాలికేయ ప్రభాకర్ ఒకరితో ఒకరు పోటీ పడి నటించారు.