iDreamPost

Recce Web Series review రెక్కీ రిపోర్ట్

Recce Web Series review రెక్కీ రిపోర్ట్

నిన్న థియేటర్లలో విరాట పర్వం, గాడ్సేలు హంగామా చేస్తే ఓటిటి నేనేం తక్కువా అనేలా కొత్త సినిమాలు, సిరీస్ లతో హల్చల్ చేసింది. అందులో రెక్కీ ఒకటి. జీ5 గత రెండు మూడు వారాలుగా దీన్ని ప్రత్యేకంగా ప్రమోట్ చేయడంతో సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించగలిగింది. ఆ మధ్య ఆహాలో వచ్చిన బుచ్చినాయుడు కండ్రిగ దర్శకుడు పోలూరు కృష్ణ ఇప్పుడీ రెక్కీకి డైరెక్టర్ కాగా టీవీ నటుడు శ్రీరామ్ కొలిశెట్టి నిర్మాతగా వ్యవహరించారు. క్యాస్టింగ్ తో పాటు బడ్జెట్ విషయంలోనూ మంచి క్వాలిటీ తీసుకొచ్చినట్టు ట్రైలర్ చూశాక అర్థమయ్యింది. మరి ఓటిటి ఫ్యాన్స్ అంచనాలకు తగట్టు ఈ రెక్కీ సక్సెస్ అయ్యిందా లేక ఏదైనా తేడా జరిగిందా రిపోర్ట్ లో చూద్దాం

ఇది 1990 కథ. తాడిపత్రి మునిసిపల్ ఛైర్మెన్ వరదరాజులు(ఆడుకాలం నరేన్) హత్యకు గురవుతాడు. దాని వెనుక అతని చిరకాల ప్రత్యర్థి రంగనాయకులు(రామరాజు)హస్తం ఉందని ఊరంతా అనుకుంటుంది. దానికి తగ్గట్టే ఇతని అనుచరుడు కుళ్లాయప్ప( తోటపల్లి మధు) ఓ ముఠాని తీసుకొచ్చి ఊళ్ళో పెట్టి ఉంటాడు. ఈ కేసును చేధించే బాధ్యత తీసుకుంటాడు పోలీస్ అధికారి లెనిన్ (శ్రీరామ్). ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో ఈ పరిణామాల వల్ల వాతావరణం వేడెక్కుతుంది. ఇంతకీ వరదరాజులు ఎలా చనిపోయాడు, అతని కొడుకు చలపతి(శివబాలాజీ)ఈ గొడవల వల్ల ఏమయ్యాడు లాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే రెక్కీ చూడాలి.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్న పోలూరు కృష్ణ తన ఆలోచనలను తెరమీద ఆవిష్కరించడంతో దాదాపుగా సక్సెస్ అయ్యాడు. ఇలాంటి పొలిటికల్ థ్రిల్లర్స్ కు కావలసిన టెంపోని ఎక్కువ ల్యాగ్ లేకుండా నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. కొన్ని క్యారెక్టరైజేషన్లు బలంగా లేకపోయినా ప్రధాన పాత్రల మధ్య సంఘర్షణని కీలక మలుపులతో నిలబెట్టారు. ఎక్కువ బోర్ కొట్టే అవకాశం ఇవ్వలేదు. ప్రతి ఎపిసోడ్ అరగంట లోపే ముగించడం మరో ప్లస్. నటీనటులు పోటీ పడ్డారు. ఎస్తర్ నోరోనా హైలైట్ అయ్యింది. రామ్ కె మహేష్ కెమెరా, శ్రీరామ్ బిజిఎం ఎలివేషన్లకు బాగా ఉపయోగపడ్డాయి. ఎక్కువ అంచనాలు పెట్టుకోకపోతే ఈ రెక్కీ డీసెంట్ వాచ్ అని చెప్పొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి