iDreamPost

ఇల్లు తగలడుతుంటే.. చెరువు తవ్వినట్టే..

ఇల్లు తగలడుతుంటే.. చెరువు తవ్వినట్టే..

వెనకటికొక ఆసామి ఇల్లు తగలబడి పోతుంటే చెరువు తవ్వడం మొదలు పెట్టాడట. ప్రస్తుతం వర్షాలు ముంచెత్తి, పంటలు, జనావాసాలు ఎక్కడికక్కడే ముంపులో చిక్కుకుపోతే గానీ మన కళ్ళుతెరుచుకోవడం లేదు. ముందుచూపు అన్న మాటకు ఏ కోశాన ఆస్కారం లేకుండా వ్యవహరిస్తున్న కారణంగానే ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్న విషయాన్ని ఎవ్వరూ ఒప్పుకునేందుకు కూడా ఇష్టపడడం లేదంటే మనం ప్రకృతికి ఎంత వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నామో అర్ధం చేసుకోవచ్చు.

గత ముప్పైళ్ళుగా ప్రతి పదేళ్ళకోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. జనావాసాలు, పంటలు మునిగిపోతూనే ఉంటున్నాయి. ఇలా జరిగినప్పుడు శాశ్వత పరిష్కారం చూపాలంటూ హడావిడి చేయడం తప్పితే ఆ తరువాత దానిని గురించి పట్టించుకున్న వారే కరువవుతున్నారు. అప్పటికిప్పుడు తాత్కాలిక చర్యలతోనే సరిపెట్టేస్తున్నారు. దీంతో మరోసారి ఇటువంటి ఉపద్రవం వచ్చిన తరువాతే దీని గురించిన చర్చ చేస్తున్నారు. జనం మాట పక్కన పెడితే వ్యవస్థలను సక్రమంగా నడిపించాల్సిన అధికారుల తీరు కూడా అదే విధంగా ఉండడంతో సమస్యలు మరింత జఠిలంగా మారిపోతున్నాయి.

పక్కా అంచనాలతోనే..

దాదాపుగా యాభై, అరవయ్యేళ్ళ క్రితమే పెద్దపెద్ద నగరాల్లో జనాభా స్థాయిని అంచనా వేసి, అప్పటికి మరో ఇరవై ముప్పై ఏళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రోడ్లు, మురుగునీటి పారుదల వ్యవస్థలు, నీటి నిల్వ సదుపాయాలను అప్పట్లో రూపొందించారు. ఆ తరువాత నగరాలు పెరుగుతున్నాయి తప్పితే అందుకు అనుగుణంగా పైన చెప్పిన సదుపాయాలను కూడా పెంచుకుంటూ వెళ్ళాలన్న లాజిక్‌ను పాలకులు మిస్సైపోయారు. దీంతో భవనాలు పెరిగాయి, నీటి వాలుకు అడ్డుగా రోడ్లు వెలిసాయి తప్పితే ముందుముందు రాబోయే ప్రమాదాన్ని గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు.

హైదరాబాదు నగరాన్నే పరిగణనలోకి తీసుకుంటే దాదాపు అయిదువేల కిలోమీటర్ల మేర డ్రైనేజీలు ఉండాల్సి ఉండగా కేవలం 1500 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉన్నాయని ఒక అంచనా ఉంది. అంటే అవసరానికంటే దాదాపు ఒకటిన్నరరెట్లు తక్కువగానే ఏర్పాటయ్యాయన్నది ఇక్కడ అర్ధమవుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇందుకు భిన్నంగా ఏమీ పరిస్థితులు లేవన్నది పరిశీలకులు చెబుతున్నారు.

దాని ప్రభావమే ఇప్పుడు మనం ఎదుర్కోంటున్న ముంపు ముప్పు. తీరా అన్నీ మునిగిపోయాక ఇప్పుడు నీటి వాలు ఎటువైపు ఉంది?, అడ్డంగా ఏమేమి ఉన్నాయి? అంటూ వెతుక్కుంటూ మరీ తవ్వుకుండా వెళుతున్నారు. అసలు అటువంటి వాటికి అడ్డమే పెట్టకపోతే ఇంతటి ఇబ్బందులు ఉండవుకదా? అన్న ఆలోచనే రానీయడం లేదు. ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తులో ఇంతకంటే భారీ నష్టాలనే చవిచూడాల్సిన పరిస్థితులు ఏర్పడినా ఆశ్చర్యపోనక్కర్లేవు.

నీటి నిల్వలే మార్గం..

జనావాసాలు, పంట భూములను ముంచెత్తుతున్న వర్షపునీటిని ఎక్కడిక్కడే చెరువులు, నీటి చెలమల్లోకి మళ్ళించడం ద్వారా మాత్రమే ముంపు మప్పు భారి నుంచి బైటపడగలుగుతారని ఇప్పటికే ఎంతో మంది నిపుణులు చెవినిల్లుకట్టుకుని పోరుతూనే ఉన్నారు. ఈ విధానాల ద్వారా విజయవంతమైన పలువురిని గురించి కథలుకథలుగానే చెప్పుకుంటున్నారు. అయినప్పటికీ వాటిపై దృష్టి పెడుతున్న దాఖలాల్లేవు. చెరువులను అభివృద్ధి పర్చడం, ఇంకుడు కుంటలను ఏర్పాటు చేయడం వంటి వాటి ద్వారా వర్షపునీటిని భూగర్భంలోకి పంపించడం ద్వారా ముంపును గణనీయంగా తగ్గించుకోవచ్చని సంబంధిత రంగ నిపుణులు చెబుతున్నారు. ఎక్కడా భూమిలో నీరు ఇంకే అవకాశం లేకుండా నిర్మాణాలు చేయడం, నీటి వాలుకు అడ్డు పెట్టడం కారణంగానే ప్రస్తుత ఇబ్బందులని వారు వివరిస్తున్నారు.

ఇప్పటికైనా దీనిపై దృష్టిపెట్టి భవిష్యత్‌ అవసరాల మేరకు ఇప్పుడే చర్యలు తీసుకోకపోతే మున్ముందు మరిన్ని ఇబ్బందులు పడాల్సివస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి