iDreamPost

‘రామాయణం’పై మరో మూవీ.. వివాదాలకు ఛాన్స్ ఇవ్వనంటున్న స్టార్ డైరెక్టర్!

  • Author singhj Published - 04:19 PM, Fri - 14 July 23
  • Author singhj Published - 04:19 PM, Fri - 14 July 23
‘రామాయణం’పై మరో మూవీ.. వివాదాలకు ఛాన్స్ ఇవ్వనంటున్న స్టార్ డైరెక్టర్!

భారతీయ సినీ పరిశ్రమలో ‘రామాయణం’ ఆధారంగా ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు తెరకెక్కాయి. వాటిల్లో హిట్లుగా, సూపర్ హిట్లుగా నిలిచిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో తెలుగులో తెరకెక్కిన ‘లవకుశ’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలోని పాటలను ఇప్పుడు కూడా శ్రీరామనవమి లాంటి పండుగల సమయంలో ప్లే చేస్తుంటారు. అప్పట్లో వచ్చిన ‘సంపూర్ణ రామాయణం’ నుంచి మొన్నటి బాపు ‘శ్రీ రామ రాజ్యం’ వరకు తెలుగులో రామాయణం ఆధారంగా తెరకెక్కిన మూవీస్ అనేకం ఉన్నాయి. సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ అయితే అందరూ చైల్డ్ ఆర్టిస్టులతో ‘బాలరామాయణం’ను అద్భుతంగా తెరకెక్కించి శభాష్ అనిపించుకున్నారు. భారత ఇతిహాసమైన ‘రామాయణం’పై సినిమాలతో పాటు టెలివిజన్ సీరియల్స్ కూడా చాలా రూపొందాయి.

హిందీలో తెరకెక్కిన ‘రామయణ్’ సీరియల్ ప్రేక్షకుల మనసులు చూరగొంది. అయితే ‘రామాయణం’ ఆధారంగా రూపొంది, ఇటీవల ఆడియెన్స్ ముందుకు వచ్చిన ‘ఆదిపురుష్’ మాత్రం తీవ్రంగా విమర్శల పాలైంది. స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ తీసిన ఈ సినిమాపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇందులో రావణుడు, హనుమంతుడు, ఇంద్రజిత్తు పాత్రలను చూపించిన విధానంపై, ఆయా పాత్రలకు రాసిన డైలాగులపై కాంట్రవర్సీ నడిచింది. ఓం రౌత్​కు ‘రామాయణం’పై ఏమాత్రం అవగాహన లేదని.. ఇలాంటి సినిమాతో భక్తుల మనోభావాలను ఆయన దెబ్బతీశారనే కామెంట్లు వినిపించాయి. ‘ఆదిపురుష్’పై వివాదాలు అంతటితో ఆగలేదు. ఈ మూవీపై కోర్టు కేసులు పెట్టే వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో సినిమాకు డైలాగ్స్ రాసిన మనోజ్ ముంతాషిర్ దేశ ప్రజలకు క్షమాపణలు కూడా చెప్పారు.

ఇక, ‘రామాయణం’పై బాలీవుడ్​లో మరో మూవీ తెరకెక్కనుంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మధు వంతెన పాన్ ఇండియా స్థాయిలో ‘రామాయణం’పై సినిమాను తీయాలని డిసైడ్ అయ్యారు. ఈ సినిమాను ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారీ తెరకెక్కించనున్నారు. ఇందులో రాముడి పాత్రలో రణ్​బీర్​ కపూర్ యాక్ట్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. నితీష్ తివారీ డైరెక్షన్ చేసిన ‘బవాల్’ త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను తీయబోయే రామాయణాన్ని ఆడియెన్స్ యాంగిల్​లో నుంచి చూస్తానని.. ఎవరి మనోభావాలు గాయపడకుండా జాగ్రత్తలు తీసుకుంటానన్నారు. ‘వివాదాలకు తావివ్వకుండా భక్తి భావాన్ని ప్రోది చేసేలా రామాయణ దృశ్యకావ్యాన్ని రూపొందించేందుకు ప్రయత్నిస్తా’ అని నితీష్ తివారీ స్పష్టం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి