iDreamPost

రామ‌తీర్థం రాముడి విగ్ర‌హం ధ్వంసం కేసు అనుమానితుల్లో టీడీపీ నేత‌లు..?

రామ‌తీర్థం రాముడి విగ్ర‌హం ధ్వంసం కేసు అనుమానితుల్లో టీడీపీ నేత‌లు..?

వైసీపీ నేత‌ల ఆరోప‌ణ‌లు నిజ‌మ‌వుతున్నాయి.. అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి.. ప్ర‌సిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం, కోదండరామస్వామి అలయంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం ఘటన వెనక తెలుగుదేశం పార్టీ కుట్ర ఉన్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తెలుస్తోంది. మహిళలకు ఇళ్ల పట్టాలిస్తూ ముఖ్యమంత్రి జగన్‌ అనితర సాధ్యమైన రీతిలో ముందుకెళుతుండటంతో విజయనగరంలోని ఆయన బహిరంగ సభను అడ్డుకోవాలన్న కుట్రతోనే మొదట దీనికి తెగబడినట్లు తెలియవస్తోంది. రకరకాల కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు… 20 మందికిపైగా వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. విచార‌ణ‌లో టీడీపీ కుట్ర కోణం స్పష్టంగా బయటపడినట్లు సమాచారం. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇదంతా టీడీపీ నేతలు ఒక పన్నాగం ప్రకారం చేసిందేనని ప్రాథమికంగా నిర్ధారణకు వ‌చ్చిన‌ట్లు తెలిసింది. రాజ‌కీయ ల‌బ్ఙి కోస‌మే ఈ దుశ్చ‌ర్య కు పాల్ప‌డిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ముమ్మాటికీ కుట్రేనని, దాని వెనుక ఎవ‌రున్నార‌నేది పూర్తి సాక్ష్యాధారాలు సేకరించాకగానీ నిర్థారించలేమని పోలీసులు చెబుతున్నారు.

అదే ఈ అనుమానాల‌కు కార‌ణ‌మా..?

రామతీర్థం ప్రధానాలయానికి సుమారు 500 మీటర్ల దూరంలో నీలాచలం కొండ మీద శ్రీ కోదండరామస్వామి ఆలయంలోని సీతారామలక్ష్మణుల విగ్రహాల్లో ఈ నెల 28 అర్ధరాత్రి కొందరు దుండగులు శ్రీరాముని విగ్రహాన్ని ద్వంసం చేశారు. సాధారణంగా రోజూ అక్కడకు పూజారి ఉదయం 8 గంటలకు వెళ్లి మధ్యాహ్నం 12కు వెనక్కి వచ్చేస్తారు. అప్పటి నుంచి ఎవ్వరూ ఉండరు. దీన్ని అదనుగా తీసుకున్న దుండగులు ఖండించిన శిరస్సును సీతమ్మ కొలనులో పడేశారు. ఈ దుశ్చర్యను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం విశాఖ రేంజ్‌ డీఐజీ రంగారావు, విజయనగరం ఎస్పీ రాజకుమారి పర్యవేక్షణలో 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. వారు దర్యాప్తు చేస్తుండగా… స్థానిక టీడీపీ నేతలు కొందరు హడావుడి చేసి, కోనేరులో వెదికినట్లుగా వెదికి, అందులోంచి తల భాగాన్ని బయటకు తీయటం వారి అనుమానాల్ని మరింత పెంచింది. అనంతరం ఈ శిరస్సు భాగాన్ని వెనుక నుంచి కోసినట్లు పోలీసులు గుర్తించారు. ఆధారాల కోసం మళ్ళీ నీలాచలం కొండపైన పరిశీలించారు. మాగ్నెట్లతో కోనేరులో సెర్చ్‌ చెయ్యగా యాక్సా బ్లేడు దొరికింది. వారు పగులగొట్టిన తాళం కూడా ఆలయం బయట పోలీసులకు దొరికింది. నిజానికి డిసెంబరు 25న కొండపైకి కరెంటొచ్చింది. 29న సిసి కెమెరాలు ఏర్పాటు చేయటానికి అంతా సిద్ధం చేశారు. ఈ విషయం తెలిసి తెల్లారక ముందే విగ్రహాన్ని ద్వంసం చేశారంటే అదంతా పక్కా సమాచారంతోనే జరిగి ఉంటుందనేది పోలీసుల భావన. పైగా 30న గుంకలాంలో 12,301 మందికి ఇళ్లపట్టాలివ్వటానికి సీఎం వైఎస్‌ జగన్‌ వస్తున్న నేపథ్యంలో ఇది జరగటాన్ని బట్టి… ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనే ఉద్దేశంతో పక్కా పథకం ప్రకారమే చేశారన్నది వారి దర్యాప్తులో ప్రాథమికంగా తేలినట్లు సమాచారం.

చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న అందుకేనా..?

విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్న అనుమానితుల్లో రామతీర్థం గ్రామానికి చెందిన టీడీపీ మాజీ ఉపసర్పంచ్, మాజీ వార్డు మెంబర్, మరికొందరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారున్నారు. మొత్తం 21 మందికి పైగా పోలీసుల అదుపులో ఉన్నారు. ఇది తెలుసుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హుటాహుటిన రామతీర్థం పర్యటనకు రావటం… రాక ముందే 3 రోజులుగా జనాన్ని పోగేయటం ఇక్కడ గమనార్హం. దీన్నిబట్టి తమ వారి పాత్ర ఏమాత్రం లేదని జనాన్ని నమ్మించడానికే ఈ అక్కర్లేని రాద్దాంతానికి ప్రయత్నించారన్నది తెలియకమానదు. కాగా పోలీసుల అదుపులో ఉన్న టీడీపీ నేతలను ఎట్టిపరిస్థితుల్లోనూ బయటపడేయాలని, అందుకోసం ఎలాంటి ఉద్యమానికైనా వెనుకాడవద్దని ఈ సందర్భంగా తమ పార్టీ వారికి చంద్రబాబు సూచించటం గమనార్హం. దీంతోపాటు పోలీసులు విచారణ కోసం పిలిచి 24 గంటలు కూడా గడవకముందే అనుమానితుడైన టీడీపీ నేత భార్య న్యాయస్థానాన్ని ఆశ్రయించి హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేసినట్లు సమాచారం. ఇదంతా టీడీపీ పెద్దలు దగ్గరుండి చేయించడం విశేషం. ఈ కేసులో వివ‌రాలు బ‌య‌ట‌ప‌డుతుండ‌డంతో ఆ పార్టీ నేత‌ల్లో క‌ల‌వ‌రం పెరుగుతోంది. దాడికి పాల్ప‌డింది ఎవ‌రో పూర్తి ఆధారాల అనంత‌రం పోలీసులు అధికారికంగా వెల్ల‌డించ‌నున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి