iDreamPost

పవన్‌ కళ్యాణ్‌కు అహం ఎక్కువ.. AP రాజకీయాల్లో ఆయన స్థానం ఇదే: రాజు రవితేజ

  • Published Jul 24, 2023 | 2:47 PMUpdated Jul 24, 2023 | 2:47 PM
  • Published Jul 24, 2023 | 2:47 PMUpdated Jul 24, 2023 | 2:47 PM
పవన్‌ కళ్యాణ్‌కు అహం ఎక్కువ.. AP రాజకీయాల్లో ఆయన స్థానం ఇదే: రాజు రవితేజ

జనసేన అధ్యక్షడు పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య కాలంలో చేస్తోన్న వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా వాలంటీర్ల గురించి పవన్‌ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. ఈ క్రమంలో పుష్కర కాలం పాటు పవన్‌కు సన్నిహితుడిగా మెలిగిన ఓ వ్యక్తి.. ఆయన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కళ్యాణ్‌ ఎలాంటి వాడు.. ప్రస్తుత రాజకీయాల్లో ఆయన స్థానం ఏంటో చెప్పుకొచ్చారు. ఆయనే రాజు రవితేజ. పేరు వినగానే గుర్తు పట్టడం కష్టం. కానీ జనసేన, పవన్‌ అభిమానులకు మాత్రం ఆయన సుపరిచితుడే. రాజు రవితేజ గతంలో పవన్‌కు అత్యంత సన్నిహితుడు మాత్రమే కాక జనసేన మాజీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కూడా. దాదాపు 12 ఏళ్ల పాటు పవన్‌తో కలిసి నడిచారు రాజు రవితేజ. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2019లో పార్టీకి గుడ్‌బై చెప్పి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

ఈ క్రమంలో తాజాగా రాజు రవితేజ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన భవిష్యత్తు.. తిరిగి జనసేలోకి వెళ్లడం వంటి విషయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాక పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిత్వం గురించి, ప్రస్తుత రాజకీయాల్లో ఆయన స్థానం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు రాజు రవితేజ. మళ్లీ జనసేనలోకి వెళ్లే ఆలోచన తనకు లేదని తెలిపారు. పైగా పవన్‌ ఎవరిని స్వయంగా పిలవడని.. మరోకరితో ఆహ్వానం పంపుతాడని చెప్పుకొచ్చారు. తన విషయంలో కూడా ఇదే జరిగిందని తెలిపారు. పవన్‌ కళ్యాణ్‌కు అహాకారం ఎక్కువ.. చేసింది చెప్పడు.. చెప్పేది చేయడు అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాక పవన్‌ ఇదే ధోరణితో వెళ్తే రాజకీయాల్లో విజయం సాధించడం చాలా కష్టం అన్నారు.

ప్రస్తుత ఏపీ పొలిటికల్‌ రేసులో పవన్‌ మూడవ స్థానంలో ఉంటాడు. మొదటి స్థానంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఉన్నారు. ఒకవేళ ఈ పొలిటికల్‌ రేసులోకి జూనియర్‌ ఎన్టీఆర్‌, ఇంకా ఎవరైనా వస్తే పవన్‌ నాలుగో స్థానంలో ఉంటారన్నారు. అంతేకాక పోలింగ్‌రోజున మీరు ఓటింగ్‌ సెంటర్‌కు వెళ్తే మీకు అక్కడ మహిళలు, పురుషులు, యువతీయువకులు ఆఖరికి వృద్ధులు కూడా ఆ క్యూ లైన్లలో కనిపిస్తారు. కానీ పవన్‌ అభిమానులు మాత్రం ఆ దరిదాపుల్లో ఎక్కడా కనిపించరు. వాళ్లు జెండాలు పట్టుకుని ఎక్కడో రోడ్ల మీద తిరుగుతుంటారు. వాళ్ల వల్ల పవన్‌కు ఎలాంటి ఉపయోగం ఉండదని తెలిపారు.

అభిమానుల వల్ల పవన్‌ ఈగో మాత్రమే సంతృప్తి చెందుతుంది. ఇది ఆయనలో మరింత అహంకారాన్ని పెంచుతుందే కానీ వాళ్ల వల్ల పవన్‌కు వచ్చే లాభం ఏం లేదు అన్నారు. పోలింగ్‌ రోజున వాస్తవంగా ఓటేసిది కుంటుంబాలు, పేదలు మాత్రమే. వాళ్ల జీవితాలను ఎవరైతే మారుస్తాడో.. ఆ నమ్మకం ఎవరైతే కలిగిస్తారో.. అలాంటి వారికే జనాలు ఓటు వేస్తారు. పవన్‌ ఉపన్యాసాలకు, వాస్తవానికి సంబంధమే ఉండదు అన్నారు. అలానే వాలంటీర్ల గురించి పవన్‌ చేసిన వ్యాఖ్యలు కూడా చాలా తప్పన్నారు. వాలంటీర్లు కూడా ఈ సమాజంలో భాగమే అని కానీ పవన్‌ మాత్రం వారిని శత్రువులుగా భావిస్తున్నారని తెలిపాడు. వాలంటీర్లపై పవన్‌కు, ఆయన అభిమానులకు ఇలాంటి ద్వేషమే కనిపిస్తుంది.. అందుకు కారణం ఏంటో తెలిదన్నారు రాజు రవితేజ. పార్టీ నుంచి బయటకు వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా తనపై బూతు కామెంట్స్‌ చేస్తూనే ఉన్నారని.. అది వారి స్థాయి అని తెలిపారు రాజు రవితేజ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి