iDreamPost

ఏడాదిలో చెక్కు చెదరని ప్రజాభిమానం

ఏడాదిలో చెక్కు చెదరని ప్రజాభిమానం

ఐదేళ్ళ పదవీ కాలంలో మొదటి యేడాది పూర్తయింది. ఈ 12 నెలలు చాలు మిగతా కాలంలో పాలన ఎలా ఉండబోతోందో అర్ధం చేసుకోవడానికి. మొదటి యేడాది పాలనే మరింత మెరుగు పర్చి కొనసాగించే అవకాశం కనిపిస్తుంది.

“శత్రువులను చీల్చి చండాడే యోధుడు” “పరిపాలనా దక్షుడు” అంటూ గుర్తింపు ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన అనుచర గణం ఎంత గొంతులు చించుకున్నా, మీడియా ఎన్ని వ్యతిరేక కధనాలు రోజువారీ వండి వార్చినా ఈ యేడాదిలో ప్రజల్లో జగన్ “ఇమేజ్” ను కొంచెం కూడా తగ్గించలేకపోయారు. మీడియా మద్దతు లేకపోయినా, ఒక సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామిక రంగం, సినిమా రంగం సహకరించకపోయినా, పైగా వ్యతిరేకంగా పనిచేస్తున్నా ఎన్నికల నాటి “ఇమేజ్”లో కొంత శాతం కూడా తగ్గించలేకపోవడం అంటే సామాన్యం కాదు. సహజంగానే ఎన్నికల తర్వాత ఒక యేడాదికి పాలక పార్టీకి, ఆ పార్టీ నేతకు ప్రజాదరణ కొంత తగ్గుతుంది. ప్రభుత్వ నిర్ణయాలు నచ్చని వారు, ప్రభుత్వ పధకాలు అందని వారు ప్రతిపక్షం చేసే విమర్శలకు ఆకర్షితులవుతారు. కానీ అలాంటి ఆకర్షణేది ఈ యేడాది కాలంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాకపోవడం విశేషమే.

జగన్ పదవి చేపట్టిన తర్వాత తాను పాదయాత్ర సమయంలో తయారుచేసుకున్న ప్రణాళికను అమలుచేయడం మొదలుపెట్టారు. ఆ ప్రణాళిక ప్రజలలోనుండి తయారయ్యింది కనుక, ప్రజలే ఇచ్చిన ఎజెండా కనుక దాని అమలులో ప్రజల ఆమోదం లభించింది. ఇంటికే వచ్చిన పెన్షన్ మరియు రేషన్ ప్రజల కష్టాలను తొలగించింది. ప్రతినెలా పెన్షన్ కోసం, రేషన్ కోసం ప్రజలు పడే అవస్థలు తీరిపోయాయి. వీటికి తోడు అమ్మఒడి, వాహన మిత్ర, రైతు మిత్ర వంటి పధకాలు, ఫీజు చెల్లింపు వంటివి అమలు చేయడంలో ప్రజలనుండి పెద్దగా విమర్శ రాకపోవడం జగన్మోహన్ రెడ్డి విజయంగానే చూడాలి. యేడాదిపాటు ఇన్ని దఫాలుగా అందించిన ఈ పధకాలు ఎక్కడో ఒక చోట, ఏదో ఒక నెలలో ప్రభుత్వానికి తలనొప్పి కలిగించి ఉండాల్సింది. అందునా విమర్శకు వేయికళ్ళు వేసుకుని చూస్తున్న ప్రతిపక్షం, విమర్శే పనిచేస్తున్న మీడియా ఏ ఒక్క అవకాశాన్నీ చేజార్చుకోదు. అయినా ఇలాంటి విమర్శలేవీ రాలేదు అంటేనే పరిపాలన ఎంత పకడ్బందీగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

“జగన్ మాట తప్పుడు” అనే నమ్మకాన్ని ఈ యేడాది కాలంలో ఆయన వమ్ము చేయలేదు. పాలనలో సగం మందికి పైగా అధికారులు సహకరించకపోయినా, తన చుట్టూ ఉన్న నేతలు పాలనపై పట్టులేనివారే అయినా, వేయి కళ్ళతో చూస్తున్న ప్రతిపక్షం, లక్ష కత్తులతో కాచుకున్న మీడియా ఈ యేడాది కాలంలో ప్రజల్లో వ్యతిరేకత సృష్టించలేకపోవడం విశేషం. ప్రతిపక్షం తప్పు పట్టొచ్చు. మీడియా తప్పు పట్టొచ్చు. కోర్టులు కూడా తప్పు పట్టొచ్చు. అయినా ఒక్క విషయంలో కూడా ప్రజల్లో ప్రభుత్వాన్ని తప్పుపడుతున్న సంకేతాలు రాకపోవడం నిస్సందేహంగా పాలనాదక్షతే అని చెప్పాలి.

ఈ యేడాదిలో రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు రాకపోవచ్చు. అది నూతన నాయకత్వ పారిశ్రామిక విధానం ప్రకారం పరిశ్రమలు వస్తాయి. పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలు అందుకోకుండా ఎక్కువకాలం దూరంగా ఉండలేరు. అలాగే ఈ యేడాది కొత్తగా ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరక్కపోవచ్చు. రాష్ట్రం దగ్గర నిధులు లేవని ప్రజలకు తెలుసు. విభజనతో లోటు బడ్జెట్ తో ప్రారంభమైన రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టే నాటికి రెండు లక్షల పాతికవేల కోట్ల అప్పుతో, ముప్పై ఆరువేలకోట్ల బకాయిలతో, కేవలం వందకోట్ల నిల్వతో ఉండనే విషయం ప్రజలకు తెలుసు. ఈ పరిస్థితులకు తోడు వరదలు, లాక్ డౌన్ వంటి విపత్కర పరిస్థితులు రాష్ట్ర ఖజానాను దెబ్బతీశాయి. ప్రజలు ఈ విషయాలను కూడా అర్ధం చేసుకున్నారనే చెప్పాలి.

గతంలో మాదిరి రాష్ట్రంలో పెట్టుబడుల సదస్సులు లేవు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు, అమరావతికి విదేశీ ప్రతినిధుల పర్యటనలు, స్టాక్ ఎక్సేంజిల్లో ఆర్భాటపు లిస్టింగులు, ఇటుక విరాళాలు లేవు. అయినా శ్రీసిటీలో 500 వందల కోట్లు, కియా పరిశ్రమలో 400 వందల కోట్లు పెట్టుబడి రాబోతోంది. ఇంకా పరిశ్రమలు వస్తాయని, పెట్టుబడులు పెరుగుతాయని గురువారం (మే 28) తాడేపల్లిలో ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన పారిశ్రామిక వేత్తల సదస్సు సూచన ప్రాయంగా తెలియజేసింది.

యేడాదిగా ప్రజల్లో చెక్కు చెదరని అభిమానం శతృ దుర్బేధ్యమైన కోటగా తయారవుతోంది. ప్రజల నుండి విమర్శలు రానంతవరకు పాలన సరైన దారిలో ఉన్నట్టే. ఈ యేడాది పాలనను మరింత మెరుగు పర్చి రానున్న కాలంలో అమలు చేయగలిగితే 2024 ఎన్నికలు కూడా ఏకపక్షంగానే ఉంటాయనడంలో సందేహం లేదు. అయితే సంక్షేమాన్ని, పాలనలో సంస్కరణలను ఇలా కొనసాగిస్తూనే అభివృద్ధిని కూడా చూపించాల్సి ఉంది. కొన్ని ప్రాజెక్టులు కదలాలి. కొత్త ప్రాజెక్టులు, పరిశ్రమలు మొదలవ్వాలి. ఈ దిశగా రెండో యేడాది పాలన మొదలయితే ప్రజాభిమానం కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి