iDreamPost

దిల్ రాజు.. విలన్ గా చిత్రీకరించిన ఓ సినిమా పిచ్చోడి కథ!

Dil Raju: దిల్‌ రాజుకు నిర్మాతగా తెలుగులోనే కాదు.. ఇతర భాషల్లో కూడా మంచి పేరుంది. హిట్టు సినిమాలను తీయటంలో ఆయనకు ఆయనే సాటని.. తరచుగా నిరూపించుకుంటూ ఉంటారు.

Dil Raju: దిల్‌ రాజుకు నిర్మాతగా తెలుగులోనే కాదు.. ఇతర భాషల్లో కూడా మంచి పేరుంది. హిట్టు సినిమాలను తీయటంలో ఆయనకు ఆయనే సాటని.. తరచుగా నిరూపించుకుంటూ ఉంటారు.

దిల్ రాజు.. విలన్ గా చిత్రీకరించిన ఓ సినిమా పిచ్చోడి కథ!

దిల్ రాజు హీరోనా? విలనా? ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న ఇది. 2 దశాబ్దాలకి పైబడిన సినీ కెరీర్ లో 4 రాళ్లు వెనకేసుకొని.. 40 రాళ్ల దెబ్బలు తిన్న దిల్ రాజు హీరోనా? విలనా? దిల్ రాజుపై మాత్రమే ఎందుకు ఇన్ని నిందలు? ఎక్కడ.. ఏ సినిమాకి ధియేటర్స్ దొరక్కపోయినా ఆయన్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇంత పెద్ద ఇండస్ట్రీని దిల్ రాజు ఒక్కరే నిజంగా తన చేతుల్లో పెట్టేసుకున్నారా? నిజంగా ఇది సాధ్యమా? ఆయన్ని మాత్రమే ఎందుకు ఓ వర్గం మీడియా టార్గెట్ చేస్తోంది? పండక్కి రిలీజ్ కాబోతున్న 4 సినిమాల్లో ఒక్క సినిమాకి కూడా దిల్ రాజు నిర్మాత కానప్పుడు.. మిగతా సినిమాలని తొక్కేయాల్సిన అవసరం దిల్ రాజుకి ఏముంద? నపై తప్పుడు వార్తలు రాస్తే తాట తీస్తా అని దిల్ రాజు వార్నింగ్ ఇచ్చే వరకు ఎందుకు వెళ్లారు? ఇలాంటి అన్నీ ప్రశ్నలకి ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం.

దిల్ రాజు పెళ్లి పందిరి అనే సినిమా డిస్ట్రిబ్యూషన్ కోసం డబ్బులు చెల్లించలేక.. అప్పులు చేసి మరీ చివరి నిమిషంలో ఆ సినిమా రైట్స్ దక్కించుకున్న ఓ సాధారణ డిస్ట్రిబ్యూటర్ అనే విషయం ఎంత మందికి తెలుసు? డిస్ట్రిబ్యూటర్ అంటే సినిమాని చూడకుండా డబ్బు పెట్టుబడిగా పెట్టాలి. కానీ.., తానే నిర్మాత అయితే రిస్క్ తగ్గుతుందని ఆలోచించిన ఓ ముందుచూపు ఉన్న వ్యక్తి అని ఎంత మందికి తెలుసు? దిల్ మూవీ షూటింగ్ లో ఉండగానే.. సుకుమార్ అనే ఓ కుర్రాడికి నిన్ను డైరెక్టర్ ని చేస్తా అని మాట ఇచ్చిన మంచి మనిషి అని ఎంత మందికి తెలుసు? సుకుమార్ తరువాత బోయపాటి శ్రీను, బొమ్మరిల్లు భాస్కర్, వంశీ పైడిపల్లి, శ్రీకాంత్ అడ్డాల, వాసు వర్మ, లాంటి యంగ్ స్టార్స్ కి తొలి అవకాశం కల్పించిన ఆయన మంచితనం ఎంత మందికి అర్ధం అయ్యింది? ఇవన్నీ ఎవ్వరికీ పట్టవు! దిల్ రాజుపై మాత్రం నిందలు వేయాలి. అందుకు కారణాలు వెతకాలి! ఇదే మీడియా ట్రెండ్.

దిల్ రాజు సాయం చేయలేదు.. వ్యాపారం చేస్తున్నాడు. ఇందులో ఆయన గొప్పతనం ఏంటి అన్నది చాలా మంది వాదన. నిజమే దిల్ రాజు చేస్తున్నది వ్యాపారం. ఆ వ్యాపారంలో ఎంత రిస్క్ ఉందో ఒక్కరికీ అర్ధం కాదు. కాస్త ముందు నుండి వద్దాం. హ్యాపీ డేస్ సినిమా అందరికీ గుర్తే. ఆ సినిమాని దిల్ రాజు తక్కువ రేటుకి కొనేసి ఎక్కువ లాభాలు తెచ్చుకున్నాడు. దీనిపై అప్పట్లో విమర్శలు చేశారు. మరి.. దిల్ రాజు కన్నా ముందే హ్యాపీ డేస్ ని ఏ నిర్మాత ఎందుకు కొనలేదు? ఏ డిస్ట్రిబ్యూటర్ ఎందుకు ముందు అడుగు వేయలేదు? ఎందుకంటే వారెవ్వరూ సినిమా పిచ్చోళ్ళు కాదు. కేవలం వ్యాపారం చేసే నిర్మాతలు మాత్రమే.

Dil raju cinema life

ముక్కు మొహం తెలియని యాక్టర్స్ ని నమ్మి ముందుగా కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టలేరు. కానీ.., దిల్ రాజు ముందుకి వచ్చాడు. కారణం సినిమా అంటే పిచ్చి. కాబట్టి దిల్ రాజుపై నిందలు వేయాల్సిందే. ఆ హ్యాపీ డేస్ అనే సినిమాని దిల్ రాజు సరిగ్గా జనాల్లోకి తీసుకెళ్లకపోతే ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల, తమన్నా ఇంత బలంగా నిలవగలిగేవారా? ఇలాంటి ఎన్నో చిన్న సినిమాలను తన భుజాన వేసుకుని, లాభ నష్టాలను భరించి.. దిల్ రాజు ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాలేదా? అప్పుడు ఆయన ఇదే మీడియాకి హీరోగా ఎందుకు కనిపించలేదు?

థియేటర్స్ దగ్గరికే వద్దాం. గత పదేళ్ల కాలంలో ఎన్ని ధియేటర్స్.. కళ్యాణ మండపాలుగా, ఫంక్షన్ హాల్స్ గా మారిపోయాయో మన అందరికీ తెలుసు. నిర్మాణ రంగాల్లో ఉద్దండులైన సురేశ్ బాబు, అల్లు అరవింద్ వంటి వాళ్ళే నామ మాత్రంగా ధియేటర్స్ మ్యానేజ్ చేసే స్థితికి వెళ్లిపోయారు. దీని అంతటికి కారణం సినిమా హాల్స్ కి వచ్చి సినిమాలు చూసే సాధారణ ప్రేక్షకుల సంఖ్య దారుణంగా పడిపోయింది. ఇలాంటి సమయంలో దిల్ రాజు మాత్రం ధియేటర్స్ పెంచుకుంటూ పోతున్నాడు. సంవత్సరానికి రిలీజ్ అయ్యే మూడు, నాలుగు పెద్ద సినిమాల కోసం.. సంవత్సరం అంతా ఆ ధియేటర్స్ ఖర్చు భరిస్తూ వస్తున్నాడు. ఇలాంటప్పుడు ధియేటర్స్ దిల్ రాజు చేతుల్లో కాక, ఇంకెవరి చేతుల్లో ఉంటాయి? ఒక్కరైనా ఇక్కడ వచ్చే నష్టాలని భరించగలరా? ఒక్కరైనా ఈ రిస్క్ చేయగలరా? నరనరాన సినిమా పిచ్చి ఉన్న దిల్ రాజు లాంటి వారి వల్ల తప్ప.. ఇంకెవరి వల్ల అయినా.. ఇది సాధ్యం అవుతుందా?

ఇప్పుడు పండక్కి రిలీజ్ అవుతున్న నాలుగు సినిమాల్లో.. దిల్ రాజు ఒక్క సినిమాకి కూడా నిర్మాత కాదు. కేవలం డిస్ట్రిబ్యూటర్ మాత్రమే. అలాంటప్పుడు ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే ఆయనకి దేనికి? రోజుకి కోట్ల రూపాయల మధ్య జరిగే ప్రొడక్షన్స్ వదిలేసి.. ఛాంబర్ లో గంటలు గంటలు కూర్చొని, నిర్మాతలని, హీరోలని క్లాష్ లేకుండా చూసుకోమని బతిమిలాడాల్సిన అవసరం దిల్ రాజుకి ఏంటి? కామ్ గా తన సినిమాలని తాను డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే అడిగే వాళ్ళు, అడ్డుకునే వాళ్ళు ఎవరు?

కానీ, దిల్ రాజు అలా కూర్చోలేడు. సినిమా సచ్చిపోకూడదు అన్నది అతని తపన. ప్రతి సినిమా ఆడాలి, పరిశ్రమ పచ్చగా ఉండాలి అన్న ఆశ. పరిశ్రమలో ఎక్కడ ఏ సినిమాకి అడ్డంకులు వచ్చినా.. ఆ కష్టాలు తనవే అన్నంతగా ఫీల్ అయిపోయే అంత అమాయకత్వం, ఆ ప్రాసెస్ లో ఎన్ని నిందలు పైన పడ్డా.. చిరునవ్వుతో ముందుకి వెళ్లిపోయే బోళాతనం. ఇలాంటి సినిమా పిచ్చోడిపై నిందలు వేయకుంటే ఎలా? కచ్చితంగా విలన్ గా చిత్రీకరించాల్సిందే.

దిల్ రాజు అంటే.. ఒక్కసారిగా వచ్చి పడ్డ వందల కోట్లని బ్యాగ్ కి కుక్కేసుకోని సడెన్ గా ఇండస్ట్రీలో ఊడి పడ్డ నిర్మాత కాదు. సినిమా అనే రూట్స్ నుండి పుట్టుకొచ్చిన ఓ కష్టజీవి. నిజానికి ఒక్క పెద్ద సినిమా ప్లాప్ అయితేనే.. పదుల సంఖ్యలో డిస్ట్రిబ్యూటర్స్ మళ్ళీ కనిపించకుండా పోతుంటారు. అంతలా వారి జీవితాలు తలకిందులు అయిపోతుంటాయి. మరి.. దిల్ రాజు అలాంటి ప్లాప్ సినిమాలను కొనలేదా? మణిరత్నం చెలియాతో ఆయన ఎన్ని కోట్లు నష్టపోయారో ఎవరికైనా తెలుసా? అందరికీ “శతమానం భవతి” లాభాలు మాత్రమే కనిపిస్తే ఎలా? శ్రీనివాస కళ్యాణం చేసిన గాయం కూడా దిల్ రాజుకే కదా తగిలింది?

కేవలం 2 శాతం సక్సెస్ రేటు ఉన్న సినీ ఇండస్ట్రీలో వందల సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేసిన దిల్ రాజు ఎలా నెగ్గుకు రాగలుగుతున్నారు? ఎంత రిస్క్ చేస్తున్నారు? సినిమా కోసం ఎంత తపిస్తున్నారు? సినిమానే జీవితంగా ఎలా బతుకుతున్నారు? ఇలాంటి ఆలోచన ఒక్కరికైనా, ఎప్పుడైనా వచ్చిందా? ఇవన్నీ ఆలోచించకుండా దిల్ రాజు అందరినీ తొక్కేస్తున్నాడు అని పిచ్చి రాతలు రాస్తుంటే.. వారి తాట తీయక ఏమి చేయాలి? ఓ ఆఫీస్ బాయ్ గా పని చేసి, కమెడియన్ గా ఎదిగిన వేణుని కూడా దిల్ రాజు బలంగా నమ్మారు. ఆయన నమ్మకానికి ప్రతిఫలమే “బలగం”. నా దగ్గర మంచి కథ ఉందని, నా దగ్గర మంచి సినిమా ఉందని.. ఎంత చిన్న వాళ్ళు అప్రోచ్ అయినా.. కోట్లు ఖర్చు పెట్టి అవకాశాలు ఇస్తున్న దిల్ రాజుకి ఇంకెవరినో తొక్కేసి పైకి రావాల్సిన అవసరం ఏముంటుంది?

చివరిగా ఒక్కమాట

తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే..

కృష్ణానగర్ మాత్రమే కాదు,

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ కూడా!

సినిమా అంటే పిచ్చితో బతికే దిల్ రాజు లాంటి వారికి కూడా కథలు, వ్యధలు, బాధలు, అప్పులు, అవమానాలు, ఆశలు, ఆశయాలు, నిద్ర లేని రాత్రులు లెక్కకి మించి ఉంటాయి.

ఒక్కసారి మంచి మనసుతో మనం చూడగలిగితే.. అవన్నీఅర్ధం అవుతాయి.

అయినా.. సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నంత దిల్ ఉన్నోడు.. సినిమాని ఎలా తొక్కేస్తాడు? ఎలా చంపేస్తాడు?

మొత్తంగా దిల్ రాజుది ఇండస్ట్రీపై తండ్రి ప్రేమ లాంటిది.

ఆ ప్రేమకి బాధ్యత ఎక్కువ. బాధలు ఎక్కువ. నిందలు అంతకన్నా ఎక్కువ.

వీటన్నిటిని ఇన్నాళ్లు మౌనంగా భరిస్తూ వచ్చిన, వస్తున్న దిల్ రాజు.. హీరోనో, విలనో కాదు.. నిజంగా ఓ సినిమా పిచ్చోడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి