iDreamPost

అయ్యన్న పాత్రుడి అరెస్టుకి రంగం సిద్ధం ??

అయ్యన్న పాత్రుడి అరెస్టుకి రంగం సిద్ధం ??

విశాఖపట్టణం జిల్లాకి చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై పోలీసులు కేసు నమోదు చెయ్యడం జిల్లా తెలుగుదేశం వర్గాల్లో తీవ్ర కలకలం లేపింది. ఆయన ప్రస్తుతం సొంత పనిమీద బయటకి వెళ్లారని చెప్తున్నారు. ఆయన ఇంటిదగ్గర లేని సమయంలో పోలీసులు కేసు నమోదు చెయ్యడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకి దారితీసింది. ఈ నేపథ్యంలో ఆయన్ని ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చంటూ జిల్లావ్యాప్తంగా గత రెండురోజులనుండి జోరుగా ప్రచారం జరుగుతుంది.

వివరాల్లోకి వెళితే అయ్యన్నపాత్రుడు ఆయన సోదరుడు సన్యాసి నాయుడుతో కలసి ఒకే ఇంట్లో వుంటారు. ఆయన కూడా అన్నకి చేదోడు వాదోడుగా మొదటినుండి నియోజకవర్గ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఆయనకి నియోజకవర్గం వ్యాప్తంగా కొంత సొంతవర్గం కూడా వుంది. అయితే అయ్యన్న పాత్రుడు మంత్రిగా ఉన్నప్పటినుండే వీళ్లిద్దరి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. అయ్యన్నపాత్రుడు పెద్ద కొడుకు చింతకాయల విజయ్ రాజకీయాల్లోకి వచ్చాక అతని వ్యవహార శైలితో ఈ రెండు కుటుంబాల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి.

ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఓటమి అనంతరం మొన్న సెప్టెంబర్ 3 న అయ్యన్న పాత్రుడి జన్మ దినాన్ని పురస్కరించుకొని పార్టీ కేడర్ నారా లోకేష్ బాబు ని ముఖ్య అతిధిగా ఆహ్వానించి నర్సీపట్నంలో భారీ స్థాయిలో అయ్యన్నపాత్రుడి జన్మదిన కార్యక్రమాలు ఏర్పాట్లు చెయ్యగా సరిగా లోకేష్ పర్యటన రోజునే అయ్యన్నపాత్రుడి సోదరుడు సన్యాసి నాయుడు తన అనుచరులతో కలసి జగన్ సమక్షంలో వైసిపిలో చేరడంతో ఇరు కుటుంబాల మధ్య దూరం మరింత పెరిగింది.

కాగా ఈనెల 12 న తానూ ఉంటున్న భవనానికి సన్యాసి నాయుడు వైసిపి జెండా కట్టడంతో వివాదం ఏర్పడింది. దీనితో పోలీసులు అక్కడకి వెళ్లగా ముందస్తు అనుమతి లేకుండా ఇంట్లోకి పోలీసులు ఎలా వస్తారంటూ పోలీసులపై అయ్యన్నపాత్రుడు తీవ్ర అసభ్య పదజాలంతో దూషించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అయినా పాత్రుడి తమని దూషించాడని తమ విధులకు ఆటంకం కల్పించాడనే అభియోగం మీద పోలీసులు అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు చేశారు.

తొలుత దర్యాప్తు చేసి నివేదిక రూపొందించాలని అధికారులు నిర్ణయించారు. ఒకవేళ అరెస్ట్ చెయ్యాల్సి వస్తే ముందస్తు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయ్యన్న పాత్రుడిని తాము అరెస్ట్ చెయ్యడం లేదని,దర్యాప్తు అనంతరం నిర్ణయం తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. అయ్యన్న పాత్రుడిపై కేసు నమోదు అయ్యిందని తెలుసుకున్న పలువురు తెలుగుదేశం నేతలు కార్యకర్తలు ఆదివారం అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లి ఆయన కుమారుడు విజయ్ ని పరామర్శించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి