iDreamPost

యువతి మీద పగబట్టిన మృత్యువు.. ఒక చోట తప్పించుకుంటే.. మరో చోట

  • Published Sep 21, 2023 | 8:29 AMUpdated Sep 21, 2023 | 8:29 AM
  • Published Sep 21, 2023 | 8:29 AMUpdated Sep 21, 2023 | 8:29 AM
యువతి మీద పగబట్టిన మృత్యువు.. ఒక చోట తప్పించుకుంటే.. మరో చోట

వినాయకచవితి పండగను కుటుంబ సభ్యులందరితో కలిసి సంతోషంగా జరుపుకోవాలని భావించి.. ఇంటికి వచ్చింది ఆ యువతి. ఎంతో సంతోషంగా పండగ చేసుకుంది. తన చదువుకు ఆటంకం కలగకూడదని భావించి.. తిరిగి కాలేజీకి బయల్దేరింది. ఇంటికి వచ్చేటప్పుడు.. వచ్చాక ఎంత సంతోషంగా ఉందో.. తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం తీరని దుఖాన్ని మిగిల్చింది. కాలేజీకి తిరిగి బయలుదేరిన యువతి మీద మృత్యువు పగబట్టింది. ఓ చోట తప్పించుకున్నాను అనుకునేసరికి.. మరోచోట తన కోసం కాపు కాసి.. కాటేసింది. రోడ్డు ప్రమాదంలో యువతి మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ వివరాలు..

మార్కాపురం పట్టణానికి చెందిన మానస అనే యువతి విజయవాడలో ఫిజియోథెరపీ కోర్సు చదువుతోంది. ఇక వినాయక చవితి సందర్భంగా రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చింది మానస. కుటుంబసభ్యులతో ఆనందంగా పండగ జరుపుకుంది. ఆ తర్వాత కాలేజీకి వెళ్లడం కోసం.. తిరుగు ప్రయాణం అయ్యింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మార్కాపురంలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సెక్కింది మానస. అయితే ఆ బస్సు త్రిపురాంతకం వద్ద అదుపుతప్పి డివైడర్‌ ఎక్కడంతో ప్రయాణీకులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. అయితే అదృష్టం కొద్ది ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ఇక ఉదయం కాలేజీకి వెళ్లాలన్న తొందరలో మానస అదే మార్గంలో గుంటూరు వైపు వెళ్తోన్న ఓ ప్రైవేట్ బస్‌ ఎక్కింది. రాత్రి త్రిపురాంతకం వద్ద మృత్యువు నుంచి తప్పించుకున్నప్పటికి.. మరోచోట మాత్రం తప్పించుకోలేకపోయింది. కాలేజీకి వెళ్లడం కోసం ప్రైవేట్‌ బస్‌ ఎక్కగా.. అది మేడపి వద్ద ఘోర ప్రమాదానికి గురయ్యింది. మానస ప్రయాణం చేస్తున్న బస్‌ను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో మానస ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ముందు బస్సు ప్రమాదానికి గురైనప్పుడే తిరిగి ఇంటికొచ్చేస్తే తమ కూతురు ప్రాణాలతో ఉండేదని ఆమె తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు.

ఈ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులుకున్నారు. వీరిలో 20 మందికి గాయాలయ్యాయి. వీరందరిని వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మానస మృతదేహాన్నీ పోస్టుమార్టం నిమిత్తం యర్రగొండపాలెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి