iDreamPost

పద్మవిభూషణ్ చిరంజీవి మెచ్చిన ప్రభు పుస్తకం.. “శూన్యం నుండి శిఖరాగ్రాల వరకూ”

పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి మీడియా రంగంతో ఉన్న అనుబంధం ప్రత్యేకమైంది. సీనియర్ పాత్రికేయులను గౌరవించడంలో ఆయన ముందు వరుసలో ఉంటారు.

పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి మీడియా రంగంతో ఉన్న అనుబంధం ప్రత్యేకమైంది. సీనియర్ పాత్రికేయులను గౌరవించడంలో ఆయన ముందు వరుసలో ఉంటారు.

పద్మవిభూషణ్ చిరంజీవి మెచ్చిన ప్రభు పుస్తకం.. “శూన్యం నుండి శిఖరాగ్రాల వరకూ”

అది ఏ భాషైనా కావచ్చు, చలనచిత్ర జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరికాదు. నల్లేరు మీద బండి అంతకన్నా కాదు. అడుగడుగునా సుడిగుండాలే. ప్రతీ మలుపులోనూ ఇసుక ఎడారులే. అయినా సినీ జీవితం పట్ల తృష్ణ, అంతులేని ఆసక్తి, అనురక్తి అందరినీ ముందుకు నడిపిస్తుంది. అ నడకలో, ఆ బడలిక అంచున ఎవ్వరికో గానీ ఆశాకుసుమాలు చిగురించి, విజయ దరహాసాలు వికసించవు. ఇదొక ఆహోరాత్రాల నిరంతర సంగ్రామం. ఎండమావుల్లా కనిపించే అవకాశాలు ఎందరినీ విజయతీరాలకు నడిపిస్తాయో, ఎలాంటి ఛీత్కారపూత్కారాలు అనుభవించవలసి వస్తుందో, అనుభవించిన వారికి గానీ తెలియవు. ప్రతీ రోజూ, ప్రతీ క్షణం అనుభవైకవేద్యం.

అలాంటి పోరాట అనుభవాలనే సుప్రసిద్ద జర్నలిస్టు, రచయిత, సినీ దర్శకుడు ప్రభు ఎంతో శ్రద్ధతో, ఆసక్తితో గ్రంథస్తం చేశాడు. ఎవరి జీవితాలు ఎలా ఉక్కిరిబిక్కిరవుతూ కూడా సినీ జీవన సంబరాలను చేరుకోవడానికి ఎలా అవస్థలు, ఆపసోపాలు పడుతూ, లేస్తూ ఎలా అవకాశాలను ఒడిసిపట్టుకుని, సుదీర్ఘప్రయాణాలను కొనసాగించి, వైభవాల కనకమేడలను నిర్మించుకున్నారో ప్రభు రాసిన శూన్యం నుంచి శిఖరాగ్రాలకు అనే పుస్తకంలో తొంగిచూసి, వివరంగా తెలుసుకోవచ్చు. అంత గొప్ప రచన చేసిన ప్రభు నిజంగా అభినందనీయుడు.

ఈ పుస్తకం ఒకరోజులో పూర్తైంది కాదు. లేదా ఒక కాలపరిమితిలో పరిపూర్ణత చెందలేదు. ప్రభు నడచిన మార్గంలో ఈ పుస్తకం పేజీలకెక్కిన అతిరథ మహారథులను ప్రభు అప్పుడప్పుడు కలసి, వారి సమయానుకూలమైన వాతావరణంలో ఎంతో కాలాన్ని వెచ్చించి, ఓపికతో, శ్రద్థతో సుదీర్ఘకాలం రాసిన ఇంటర్వ్యూలను సంకలనంగా చేస్తే, అది చివరికి శూన్యం నుంచి శిఖరాగ్రాల వరకూ అనే బరువైన పుస్తకంగా రూపొందింది. ప్రతీ జీవితం బరువైనదే. సినీ జీవితాలలో భరించి, అనుభవించే బరువులను తూకం వేయగల త్రాసు ఇప్పటి వరకూ ఎవరూ కనుగొనలేదు. కనుగొనబడలేదు. కానీ ప్రభు మాత్రమే ఆ బరువుల భరింపును తన అక్షరాల మానికలతో ఆచితూచి అక్షరాలలో బంధించాడు. ప్రతీ పేజీ ఆయా జీవితాలను ప్రతిబింబించే నిలువటద్దం. అక్షర నిదర్శనం.

నేడు పద్మవిభూషణ్‌ మెగాస్టార్‌ డాక్టర్‌ చిరంజీవి జీవితపు తొలిరోజులలో ఉత్కంఠభరితమైన అనుభవాల దగ్గర్నుంచి, ఎందరో దర్శకులు, ఎందరో నిర్మాతలు, మరెందరో సాంకేతిక నిపుణుల జీవితాలను ఒరుసుకుంటూ ప్రస్థానం చేసిన ప్రయాణాలు ఈ పుస్తకంలో ప్రాణ ప్రతిష్ట పొందాయి. అవీ ప్రభు అక్షరాల పునాదుల పైన. తనూ ఓ పాత్రగా మారి, ఇన్ని సజీవ పాత్రల ప్రాయోపవేశాలను, పరకాయ ప్రవేశాలను తనదైన భావావేశపు శిల్పాకృతులుగా మలచడమే ఈ పుస్తకంలోని ప్రత్యేకత. శూన్యం నుంచి శిఖరాగ్రాల వరకూ అనే ఈ పుస్తకం ప్రభు పుట్టినరోజున సాక్షాత్తూ పద్మవిభూషణ్‌ చిరంజీవి చేతుల మీదుగా రిలీజైంది. చిత్రపరిశ్రమలో అనేకమంది మహామహులు హాజరైన ఈ పుస్తకావిష్కరణ మహోత్పవం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి