iDreamPost

నిజామాబాద్ లో PM మోడీ.. రూ. 8 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

నిజామాబాద్ లో PM మోడీ.. రూ. 8 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు రానున్న వేళ మోడీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోందంటూ పలువురు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిజామాబాద్ లో పీఎం మోడీ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మోడీ సభకు ప్రజలు, కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చారు. ముందుగా నా కుటుంబ సభ్యులారా అంటూ ప్రధాని మోడీ ప్రసంగించారు. తమ ప్రభుత్వం శంకుస్థాసనలే కాదు.. వాటిని పూర్తి చేస్తున్నామని చెప్పారు.

ఈ పర్యటనలో భాగంగా మోడీ రూ.8,021 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రామగుండంలో 800 మెగా వాట్ల ఎన్టీపీసీ రూ.6 వేల కోట్లతో చేపట్టిన విద్యుత్తు ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. రూ.1,200 కోట్ల వ్యయంతో మనోహరాబాద్‌-సిద్దిపేట మధ్య నిర్మించిన 76 కి.మీ కొత్త రైలు మార్గం, రూ.305 కోట్లతో మన్మాడ్‌-ముద్కేడ్‌-మహబూబ్‌నగర్‌- డోన్‌ మధ్య చేపట్టిన రైల్వేలైన్ల విద్యుదీకరణ ప్రాజెక్టును, సిద్దిపేట-సికింద్రాబాద్‌ మార్గంలో తొలి రైలు సర్వీసును ప్రధాని వర్చువల్‌గా పీఎం మోడీ ప్రారంభించారు.

వీటితోపాటు సుమారు రూ.1,360 కోట్లతో 496 బస్తీ దవాఖానాల ఏర్పాటు, ఆయుష్మాన్‌ భారత్‌ కింద పలు జిల్లా కేంద్రాల్లో 50 పడకలతో నిర్మించబోయే 20 క్రిటికల్‌ కేర్‌ విభాగాల పనులను ప్రధాని ప్రారంభించారు. రూ.1369కోట్లతో హెల్త్ సెంటర్స్‌కు భూమిపూజ చేశారు. త్వరలో భారతీయ రైల్వే వందశాతం ఎలక్ట్రిఫికేషన్ పూర్తవుతుందని వెల్లడించారు. బీబీనగర్ లో ఎయిమ్స్ నిర్మిస్తున్న ఎయిమ్స్ భవనాన్ని మీరు చూస్తున్నారని, తెలంగాణ ప్రజల విద్యుత్ అవసరాలు తీర్చేందుకు తాము కృషి చేస్తున్నామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి