iDreamPost

రేవంత్ ఆశ‌ల‌పై పీకే నీళ్లు!

రేవంత్ ఆశ‌ల‌పై పీకే నీళ్లు!

కాంగ్రెస్ లోకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్ ఎంట్రీ జాతీయస్థాయిలో ఆ పార్టీకి ఎంతమేలు చేస్తుందో గానీ.. తెలంగాణ నేత‌ల‌ను మాత్రం క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది. అస‌లేం జ‌రుగుతుందో వారికే తెలియ‌ని ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ప్ర‌ధానంగా రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక చాలా ఉత్సాహంగా ప‌ని చేస్తున్నారు. పార్టీలో ఎంతో కొంత మార్పు క‌నిపిస్తోంది. ఏదో కార్య‌క్ర‌మం ద్వారా జ‌నాల్లో ఉండేలా రేవంత్ ముందుకు సాగుతున్నారు. కేసీఆర్ స‌ర్కారుపైనా, బీజేపీ పైనా విమ‌ర్శ‌లు చేస్తూ హ‌వా చాటే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తెలంగాణ‌లో రాహుల్ గాంధీ స‌భ‌ను కూడా ఏర్పాటు చేశారు. ఆ స‌భ‌ను భారీగా స‌క్సెస్ చేసేందుకు విస్తృతంగా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ఇలాంటి క్ర‌మంలో రాష్ట్రంలో పీకే ప‌ర్య‌ట‌న కాంగ్రెస్ లో కలవరం రేపుతోంది.

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అంటున్న పీకే తెలంగాణ‌కు వ‌చ్చే స‌రికి టీఆర్ ఎస్ తో భేటీ కావ‌డం.. ఆ పార్టీకోసం ప‌ని చేయ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. దీనిపై రేవంత్ కు ఇటు పార్టీ ప‌క్షాల నుంచి.. అటు ప్ర‌జ‌ల నుంచి ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో కేసీఆర్ – పీకే భేటీపై రేవంత్ షాకింగ్ కామెంట్లు చేశారు. గత మూడు రోజులుగా ఓ అలజడి నడుస్తోంది.. పీకే.. కాంగ్రెస్, టీఆర్ఎస్‌ను కలపడానికి వచ్చిండు అంటున్నారు.. జాతీయ స్థాయిలో తీసుకునే నిర్ణయానికి మేం ఏమి చెప్పలేమన్నారు.. కానీ, రాహుల్ గాంధీ… టీఆర్ఎస్‌ గుంపుతో చేరినోడు వద్దు, కేసీఆర్‌తో జట్టు కట్టేదిలేదని స్పష్టత ఇచ్చారని తెలిపారు.

పీకేపై విచిత్ర ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు రేవంత్‌రెడ్డి.. పీకే… సోనియా గాంధీతో జరిగిన చర్చలో పాల్గొన్నారని.. కాంగ్రెస్ పార్టీతో పనిచేసేందుకు పీకే ఆసక్తి చూపుతున్నారన్న ఆయన.. ఈ విషయంపై కాంగ్రెస్‌ ఓ కమిటీ వేసింది.. పీకే, కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే ఆ రాష్ట్రంలో మోడీతో జట్టుకట్టిన పార్టీలను, ప్రాంతీయ పార్టీలతో ఉన్న వ్యాపార ఒప్పందాలు వదులుకోవాలని చెప్పారన్నారు.. ఇక, కేసీఆర్‌-పీకే భేటీపై స్పందిస్తూ.. టీఆర్ఎస్‌తో చేసుకున్న అవగాహన నుంచి తప్పుకునేందుకు ప్రశాంత్ కిషోర్ వచ్చారని.. టీఆర్ఎస్‌ వ్యూహకర్తగా ఉంటే మేం పార్టీలో చేర్చుకోమని కాంగ్రెస్ అధిష్టానం కండిషన్ పెట్టిందన్నారు రేవంత్‌రెడ్డి. మరోవైపు, కేసీఆర్‌తో నడిచే ఎవరిని కూడా మేం దగ్గరకు రానివ్వమని చెప్పారు. మొత్త‌మ్మీద తెలంగాణలో కాంగ్రెస్ కు పీకే విప‌క్ష‌మో, స్వ‌ప‌క్ష‌మో తెలియ‌డం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి