iDreamPost

ఏపీ ప్రభుత్వ డోర్‌ డెలివెరీలో మూడో అంశం

ఏపీ ప్రభుత్వ డోర్‌ డెలివెరీలో మూడో అంశం

ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలు అనే లక్ష్యంతో పని చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సర్కార్‌ ఆ బాటలో ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు సాగుతోంది. ప్రభుత్వ యంత్రాంగం, వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు ఇళ్లకు చేరేస్తోంది.

ఇందులో భాగంగా ప్రస్తుతం రెండు అంశాలు పైలెట్‌ప్రాజెక్టు దశలో ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో లబ్ధిదారుల ఇంటికే రేషన్‌ బియ్యం డెలివరీ చేస్తుండగా, ఏప్రిల్‌ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఈ నెల మూడో తేదీ నుంచి ఇసుకను అవసరమైన వారికి డోర్‌ డెలివరీ చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా మొదలైన ఈ విధానం ఈ నెలాఖరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు కానుంది.

తాజాగా ప్రతి నెలా లబ్ధిదారులకు ఇస్తున్న పింఛన్‌ నగదును కూడా వారి ఇంటికే వెళ్లి ఇచ్చేలా జగన్‌ సర్కార్‌ నూతన ఆలోచన చేసింది. వచ్చే నెల నుంచి వృద్ధాప్య, వితంత తదితర 13 రకాల సామాజిక పింఛన్లను గ్రామ, వార్డు వాలంటీర్లు లబ్ధిదారులు ఇంటికి వెళ్లి అందివ్వనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 53.19 లక్షల మందికి 2250 రూపాయల నుంచి 10 వేల రూపాయల వరకు పింఛన్‌ రూపంలో లబ్ధిదారులకు ఇస్తున్నారు. కాగా, వచ్చే నెల నుంచే నూతన పింఛన్లు కూడా మంజూరు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి