iDreamPost

‘పంచాయతీ’ లెక్క తేలడం లేదు

‘పంచాయతీ’ లెక్క తేలడం లేదు

నాలుగు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు ముగిసి వారం రోజులవుతోంది. కానీ ఇప్పటికీ జయపజయాల లెక్కలు వేస్తూనే ఉన్నారు. ఫలితాలు వెల్లడైన మరుసటి రోజునే ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలిచిందీ తేలుతుంది. అయితే పంచాయతీ ఎన్నికలు పార్టీ రహిత గుర్తులపై జరగడం వల్ల ఎవరి లెక్కలు వేసుకుంటుండడంతో అసలు లెక్కకు సరిపోలడం లేదు.

ఈ నెల 21వ తేదీన పంచాయతీ చివరి దశ పోలింగ్, ఫలితాలు వెల్లడయ్యాయి. నాలుగు దశల్లో మొత్తం 13,092 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 10,536 పంచాయతీలలో తాము బలపరిచిన అభ్యర్థులు గెలిచారని వైసీపీ పేర్కొంది. ఇందుకు సాక్ష్యంగా.. వైఎస్‌ జగన్‌ పత్రిక సాక్షిలో నియోజకవర్గాల పేజీల్లో మండలాల వారీగా ఆయా పంచాయతీల్లో గెలుపొందిన వారి ఫోటోలను ముద్రించింది. అభ్యర్థులు మెడల్లో వైసీపీ కండువాలు ఉన్నాయి. 10, 536 మంది తమ వారేనని వైసీపీ చెప్పుకోవడంపై ఎవరూ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. సాక్షిలోనే టీడీపీ 2,100 పంచాయతీలు, బీజేపీ–జనసేన సహా స్వతంత్రులు 445 చోట్ల గెలుపొందారని రాశారు.

టీడీపీ విషయానికి వస్తే.. తాము 4,456 పంచాయతీలను గెలుచుకున్నామని చెప్పుకుంది. ఆయా స్థానాల్లో తాము బలపర్చిన అభ్యర్థులే గెలిచారని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మైకందుకున్నారు. వైసీపీ మాదిరిగా టీడీపీ బలపర్చి గెలిచిన అభ్యర్థుల ఫొటోలు ఆ పార్టీ అనుకూల పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతిల్లో ప్రచురించలేదు. టెక్నాలజీని వాడుకునే చంద్రబాబు.. కనీసం ఆ పార్టీ మద్ధతుదారులుగా గెలిచిన వారి ఫోటోలు, వివరాలు టీడీపీ అధికారిక వెబ్‌సైట్‌లోనూ పెట్టలేదు. కానీ తాము ఎన్ని సీట్లు గెలిచామన్నది మాత్రం చెబుతున్నారు. సోషల్‌ మీడియలో అంకెలు వేసి ప్రచారం చేసుకుంటున్నారు. టీడీపీ లెక్క ప్రకారం.. వైసీపీ 5,685 పంచాయతీలు, టీడీపీ 4,421 పంచాయతీలు, బీజేపీ/జనసేన 12, ఇతరులు 349 పంచాయతీలు గెలిచాయి. టీడీపీ వేసిన లెక్కలో బీజేపీ/జనసేనకు కేవలం 12 పంచాయతీలే దక్కాయి.

పంచాయతీ వార్‌ ముగిసి, మున్సిపల్‌ పోరు ప్రారంభం కాబోతున్నా.. పంచాయతీ జయపజయాల లెక్కలపై మాత్రం చర్చ సాగుతూనే ఉంది. తాజాగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన పార్టీ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన స్థానాల లెక్క చెప్పారు. జనసేన బలపర్చిన అభ్యర్థులు 1209 పంచాయతీలను గెలుచుకున్నారని వెల్లడించారు. 1,776 ఉప సర్పంచ్‌ పదవులు, 4,456 వార్డులు గెలిచామని పేర్కొన్నారు. మొత్తం మీద పల్లెపోరులో జనసేనకు 27 శాతం ఓట్లు వచ్చాయని జనసేనాని ప్రకటించారు.

వైసీపీ చెబుతున్న లెక్కకు సాక్షి పత్రికలో గెలిచిన వారి ఫోటోలతో ప్రచురించిన ఆధారాలు ఉన్నాయి. కానీ టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు చెబుతున్న లెక్కలకు ఆధారాలు లేవు. పైగా టీడీపీ చెబుతున్న లెక్క ప్రకారం బీజేపీ/జనసేన పార్టీలు కేవలం 12 పంచాయతీలనే గెలిచాయి. ఈ మొత్తం తాజాగా పవన్‌ కల్యాణ్‌ చెప్పిన లెక్క 1209లో ఒక్క శాతం మాత్రమే కావడం విశేషం.

ఎవరికివారు వేసుకుంటున్న లెక్కల్లో నిజానిజాలు తేల్చడం సాధ్యమయ్యే పని కాదు. ఈ లెక్కల చిత్రాలు పంచాయతీలకే పరిమితం. రాబోవు మున్సిపల్‌ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతాయి కాబట్టి.. ఈ తరహా లెక్కలు వేసుకునే అవకాశం ఎవరికీ ఉండదు. అప్పుడు ఎవరి లెక్క ఎంతో సులువుగా తేలుతుంది. బలమా..? వాపునా..? అందరికీ అర్థమవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి