iDreamPost

ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న పరిటాల..!

ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న పరిటాల..!

పరిటాల శ్రీరామ్‌పై అక్రమ కేసులు పెడుతున్నారు.. పోలీస్‌ స్టేషన్‌లోనే ప్రత్యర్థులు శ్రీరాంపై దాడి చేశారు.. ఇదీ శుక్రవారం నుంచి జరుగుతున్న ప్రచారం. నిజంగా పరిటాల శ్రీరాంపై అక్రమ కేసులు పెడుతున్నారా..? ఆయనపై దాడి చేశారా..?

రాప్తాడు భూములను నీళ్లతో తడిపేందుకు పని చేస్తున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి నియోజకవర్గంలో ఉద్రిక్త పరస్థితులు కావాలని కోరుకుంటారా..? కక్ష సాధింపు రాజకీయాలు చేస్తారా..? అనే చర్చ సాగుతోంది. ఇటీవల పరిటాల శ్రీరాం, అతని అనుచరులపై కేసు ఎందుకు నమోదైంది..? తెలుసుకుంటే.. జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంతనేది తెలిసిపోతోంది.

అనారోగ్యంతో చనిపోయిన టీడీపీ కార్యకర్త రాజు కుటుంబాన్ని పరామర్శించేందుకని ఈ నెల 24వ తేదీన చెన్నెకొత్తపల్లి మండలం ముష్టి కోవెల గ్రామానికి పరిటాల శ్రీరామ్‌ వెళ్లారు. భారీ బైక్‌ ర్యాలీతో వెళ్లిన పరిటాల శ్రీరామ్‌ అనుచరులు.. గ్రామంలో మట్టి రోడ్డు పని చేయిస్తున్న వైసీపీ సర్పంచ్‌ రామలక్ష్మమ్మ కుమారుడును రెచ్చగొట్టేలా వ్యవహరించారు. ఇరు వైపుల నుంచి మాటల తూటాలు పేలిన తర్వాత.. చనిపోయిన రాజు ఇంటికి శ్రీరాం వెళ్లారు. అటుగా వెళుతున్న బత్తిన వెంకటరాముడును అటకించిన టీడీపీ కార్యకర్తలు.. పంచాయతీ ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదంటూ కొట్టారు. కిందపడేసి కాళ్లతో తన్నారు.

కమ్మ సామాజికవర్గానికి చెందిన బత్తిన వెంకటరాముడు 2019 ఎన్నికల వరకు టీడీపీ మద్ధతుదారుడుగా ఉన్నారు. ముష్టికోవెల గ్రామం టీడీపీకి కంచుకోటలాంటిది. 2019 ఎన్నికల్లోనూ ఈ గ్రామంలో టీడీపీకి 450 ఓట్ల మెజారిటీ వచ్చింది. సాధారణ ఎన్నికల తర్వాత గ్రామంలోని మెజారిటీ టీడీపీ మద్ధతుదారులు వైసీపీలో చేరారు. దీంతో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బోయ సామాజికవర్గానికి చెందిన వైసీపీ మద్ధతుదారు రామలక్ష్మమ్మ గెలిచారు. అప్పటి నుంచి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Also Read : వరుసగా మూడుసార్లు ఓడిపోయిన చలమలశెట్టి సునీల్ కు ఎంపీ అయ్యే యోగం ఉందా..?

ఈ క్రమంలోనే ఈ నెల 24వ తేదీన గ్రామానికి వచ్చిన పరిటాల శ్రీరామ్‌ సమక్షంలో అతని అనుచరులు బత్తిన వెంకటరాముడుపై దాడి చేశారు. చెన్నే కొత్తపల్లి వెళ్లి చికిత్స చేయించుకున్న బత్తిన వెంకటరాముడు, స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్‌ ఇచ్చిన మెడికో లీగల్‌ కేసు (ఎమ్మెల్సీ) ఆధారంగా పోలీసులు పరిటాల శ్రీరామ్, అతని అనుచరులు 9 మందిపై కేసు నమోదు చేశారు. ఆ వెంటనే స్టేషన్‌ బెయిల్‌ మంజూరైంది.

అయితే పరిటాల శ్రీరామ్‌పై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలంటూ బత్తిన వెంకటర రాముడుపై అతని తమ్ముడు, టీడీపీ మద్ధతుదారుడుగా ఉన్న బత్తిన కిష్టప్ప ఒత్తిడి తెచ్చారు. డబ్బులు ఇప్పిస్తానని చెప్పినా, బెదిరించినా వెంకటరాముడు వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో అన్న బత్తిన వెంకటరాముడుపై కిష్టప్ప దాడి చేసి గాయపరిచాడు. చికిత్స తీసుకున్న వెంకటరాముడు.. తమ్ముడు కిష్టప్పపై కేసు పెట్టాడు. ప్రతిగా కిష్టప్ప కూడా తనపై వెంకట రాముడు దాడి చేశాడని కేసు పెట్టారు. అయితే అతనికి గాయాలు కాకపోవడంతో ఎమ్మెల్సీ రాలేదు. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ వేయలేదు.

ఈ కేసు విషయమై మాట్లాడేందుకు పరిటాల శ్రీరామ్ నిన్న శుక్రవారం చెన్నే కొత్తపల్లి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. వైసీపీ, టీడీపీ మద్ధతుదారులు భారీగా అక్కడకు చేరుకున్నారు. స్టేషన్‌ ఆవరణలోనే పరిటాల శ్రీరామ్‌ మీడియాతో మాట్లాడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇది గమనించిన పోలీసులు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా.. ఇరు వర్గాల వారిని అక్కడ నుంచి పంపిచేశారు.

ఫ్యాక్షన్‌ రాజకీయాలను నమ్ముకుని రాజకీయాలు చేసిన పరిటాల శ్రీరామ్‌.. తాను పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ఓటమి చవిచూశారు. ఫ్యాక్షన్‌ రాజకీయానికి తావులేదని, అభివృద్ధిదే భవిష్యత్‌ రాజకీయమని 2019 ఎన్నికల్లో తేలిపోయినా పరిటాల శ్రీరాం మాత్రం అదే పంథాలో కొనసాగుతున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టడం, వారిపై డాడులకు ఉసిగొల్పడం వంటి చర్యలతో శ్రీరామ్‌ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. కంచుకోట అయిన రాప్తాడులో ఓడిపోవడంతోపాటు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ తమకు కంచుకోటలుగా ఉన్న పంచాయతీల్లోనూ వైసీపీ మద్ధతుదారులు గెలవడంతో పరిటాల శ్రీరాం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ, అనుచరులను దాడులకు ప్రేరేపిస్తున్నారు. చివరికి ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెడుతోందనే ప్రచారం చేయించుకుంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు.

అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి సాగునీరు, ఉపాధి కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత పేరూరు డ్యాంకు ప్రకాష్‌ రెడ్డి నీళ్లు తెప్పించారు. నియోజకవర్గంలోని బీడు భూములను తడిపేందుకు ఒకే రోజు నాలుగు రిజర్వాయర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వాటి నిర్మాణంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఉపాధి కల్పన కోసం టెక్స్‌టైల్‌ పరిశ్రమను తీసుకువచ్చేందుకు పని చేస్తున్నారు. ఈ క్రమంలో దశాబ్ధాల తరబడి కక్షలు, కార్పణ్యాల గుప్పెట్లో చిక్కుకున్న రాప్తాడు పల్లెలు.. ఇప్పుడు బయటకు వస్తున్నాయి. వర్గాలు విడిచిపెట్టిన రైతులు గ్రామాల్లో కలసిమెలసి ఉంటున్నారు. కుటుంబ అభివృద్ధి, వ్యవసాయంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో తమ రాజకీయ ప్రాభవాన్ని కాపాడుకునేందుకు పరిటాల కుటుంబం గ్రామాల్లో వర్గాలను కొసాగేలా రాజకీయాలు చేస్తోంది.

Also Read : కాపుల కోసం ఆకుల స్కీమ్ ….. అందుకేనా ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి