iDreamPost

కాంగ్రెస్‌లో ఆపరేషన్‌ పీకే అమలు..!

కాంగ్రెస్‌లో ఆపరేషన్‌ పీకే అమలు..!

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కాంగ్రెస్‌లో చేరికకు ముందే.. ఆయన సూచనలను అమలుచేసే యోచనలో కాంగ్రెస్‌ ఉన్నట్లు తెలుస్తోంది. పలు రాష్ట్రాల్లో పార్టీని ప్రక్షాళన చేయాలని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి పార్టీ నాయకత్వం మధ్య అంతర్గత విభేదాలున్న రాజస్థాన్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో దిద్దుబాటు చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.

బీజేపీతో నేరుగా కాంగ్రెస్‌ పోటీపడే రాష్ట్రాల్లో పార్లమెంటు సీట్లను పెంచుకునేలా చర్యలు చేపట్టాలని ప్రశాంత్‌ కిషోర్‌ తన ప్రజెంటేషన్‌లో పేర్కొన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకే త్వరలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నిర్వహించనున్న మేథోమదన సదస్సులో ఈ అంశాలపై చర్చించే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ను తప్పించి.. యువనేత సచిన్‌ పైలట్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టే విషయంలో చర్చ జరగవచ్చని అంటున్నారు. గెహ్లోత్‌ను ఏఐసీసీలోకి తీసుకోవచ్చని చెబుతున్నారు.

అయితే పంజాబ్‌లో మాదిరిగా ఎన్నికల గడువు కేవలం 114 రోజులు మాత్రమే ఉండగా చరణ్‌జిత్‌సింగ్‌ చన్నీని ముఖ్యమంత్రిని చేసినట్లుగా ఈ నిర్ణయం ఉండబోదని అభిప్రాయపడుతున్నారు. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు 2023 డిసెంబరులో జరగనున్న నేపథ్యంలో కనీసం ఏడాదిన్నర కాలం ఉండేట్లుగా సీఎం మార్పుపై నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. మధ్యప్రదేశ్‌లో నాటి సీఎం కమల్‌నాథ్‌, జ్యోతిరాదిత్య సింధియా మధ్య విభేదాలు ఆ రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోయే దాకా వెళ్లిన విషయాన్ని అధిష్ఠానం ఈ అంశంపై దృష్టి పెట్టినట్లు పేర్కొంటున్నారు.

ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కమల్‌నాథ్‌ను సీఎల్పీ నేత పదవిని వదులుకోవాల్సిందిగా సూచించవచ్చని, ఆ బాధ్యతను ఓ యువనేతకు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక హర్యానాలో పీసీసీ అధ్యక్ష పదవికి కుమారి షెల్జా రాజీనామా చేయడంతో కొత్త సారథిని నియమించే యోచనలో అధిష్ఠానం ఉంది. సీఎల్పీ నేత భూపిందర్‌సింగ్‌ హుడాకు పీసీసీ పగ్గాలను కూడా అప్పగించవచ్చని అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి