iDreamPost

సినిమాలు థియేటర్ల కోసం కాదా

సినిమాలు థియేటర్ల కోసం కాదా

భాష ఏదయినా సినిమా అనే వినోద సాధనాన్ని పెద్ద తెరపై థియేటర్ లో చూసే అనుభూతి ఇంకేది ఇవ్వదు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా హాల్ కు సాటి రావు కాబట్టే జనంలో వీటికి ఆదరణ బ్రతికే ఉంది. అయితే గత రెండేళ్లుగా డిజిటల్ విప్లవం పరిశ్రమను ఎంతగా కుదిపేస్తోందో చూస్తూనే ఉన్నాం. జనం టికెట్లు కొని సినిమాలు చూడటం లేదని వాపోతున్న నిర్మాతలే ఆదాయం కోసం వాటి లైఫ్ ని పూర్తిగా కుదించేసి సదరు సంస్థలకు అమ్మేయడం కూడా జరిగిపోతోంది. ఇప్పుడీ ప్రస్తావనకు కారణం ఉంది.

ఈ నెల 6న విడుదలైన ఓ పిట్ట కథ నిన్న అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. పట్టుమని పది రోజులు గడవడం ఆలస్యం ఇలా నెట్టింట్లోకి తెచ్చేశారు. ఇంకా చాలా బిసి సెంటర్లకు ఈ సినిమా వెళ్లనే లేదు. అలాంటప్పుడు ఇంత త్వరగా ఓ పిట్ట కథను అమెజాన్ ప్రైమ్ లో తీసుకురావడం టూ మచ్ అనే చెప్పాలి. ఇంతోటి దానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని అతిథిగా పిలిచి హడావిడి చేయాలా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలైపోయాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావుని హీరోగా పరిచయం చేస్తూ తీసిన ఓ పిట్ట కథకు చందు ముద్దు దర్శకత్వం వహించాడు. రిలీజ్ కు ముందు కొంత అంచనాలు రేపినా ఆ మాత్రం కూడా అందుకోలేక ఈ మూవీ ఫెయిలయ్యింది. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించినప్పటికీ కథనంలో ఉన్న లోపాల వల్ల సినిమా ఆడలేదు.

అయినప్పటికీ కొత్త సినిమాలకు కనీసం రెండు నుంచి మూడు వారాలు మినిమమ్ లైఫ్ అవసరం. కానీ ఇలా మరీ 10 రోజులకే డిజిటల్ లో వచ్చేస్తే ఇకపై ఏ చిన్న సినిమా వచ్చినా ఖర్చు పెట్టుకుని ఎందుకు చూడటం ఫ్రీగా ఇంట్లోకే వస్తుంది కదా అనే ఫీలింగ్ రావడం ఖాయం. అదే జరిగితే ఇప్పటికే మూలుగుతున్న బడ్జెట్ నిర్మాతలకు ఇదో శాపంగా మారుతుంది. వాళ్ళ కోణంలో ఇలా త్వరగా ఇచ్చేయడంలో న్యాయం ఉన్నప్పటికీ ప్రేక్షకుడు అలా ఆలోచించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. తనకు డబ్బు ఆదా అయ్యే మార్గాలనే చూసుకుంటాడు. కరోనా దెబ్బకు ఇప్పటికే తెలంగాణలో థియేటర్లు మూతబడి ఇన్ డైరెక్ట్ గా ఏపీలోనూ ప్రభావం చూపుతున్నాయి. కొత్త చిత్రాల రిలీజులన్నీ వాయిదా పడటంతో ఉన్నవాటిని దాదాపుగా ఖాళీగా నడిపించే పరిస్థితి ఉంది. ఇకనైనా డిజిటల్ విషయంలో మన నిర్మాతలు సీరియస్ గా ఆలోచిస్తే మంచిది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి