iDreamPost

ఇక సచివాలయాల్లోనే ఆధార్ సేవలు !

ఇక సచివాలయాల్లోనే ఆధార్ సేవలు !

ఆధార్ కు సంబంధించి ఏ చిన్న అప్ డేట్ చేయించుకోవాలన్నా మీ సేవ, పోస్టాఫీసుల చుట్టూ తిరగాల్సి ఉండేది. కానీ రాష్ట్ర ప్రజలకు ఇక ఆ బెడద లేకుండా.. శుభవార్త చెప్పింది ప్రభుత్వం. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఆధార్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గ్రామ, వార్డు సచివాలయ శాఖ పేర్కొంది. తొలిసారి ఆధార్ వివరాలను నమోదు చేసుకునేవారికి పూర్తిగా ఉచితమని, 5-15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్ డేట్ చేసుకునేందుకు నిబంధనల ప్రకారం ఒకసారి ఉచిత సేవలు అందిస్తామని వెల్లడించింది.

ఆధార్ కలర్ ప్రింట్, బయోమెట్రిక్ లో తప్పులు సరిదిద్దడం, అడ్రస్ తదితర వివరాలను మార్చుకునేందుకు యూఐడీఏఐ నిర్థారిత సర్వీసు ఛార్జి కట్టాల్సి ఉంటుందని గ్రామ, వార్డు సచివాలయ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు గ్రామ,వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ షాన్ మోహన్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఐదు సచివాలయకు ఒకటి చొప్పున.. రాష్ట్రవ్యాప్తంగా మూడువేల గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

ఆధార్ సేవల కోసం ప్రత్యేకంగా ల్యాప్ టాప్, మానిటర్, కెమెరా, మల్టీ ఫంక్షనల్, ఐరిస్, ఫింగర్ ప్రింట్ డివైస్, వైట్ స్క్రీన్, ఫోకస్ లైట్, జీపీఎస్ డివైస్, ప్రొటెక్టర్, వీజీఏ టూ హెచ్ డీఎంఐ కన్వర్టర్ సహా మొత్తం 15 రకాల ఎలక్ట్రానిక్ పరికరాలతో కూడిన కిట్ ను ప్రభుత్వం ఆయా సచివాలయాలకు అందించనుంది. ఇప్పటికే 1100 సచివాలయాలకు ఈ కిట్లను అందించగా.. మిగతా సచివాలయాలకు త్వరలోనే అందజేస్తామని అధికారులు తెలిపారు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి