iDreamPost

అయిదు సినిమాలు వస్తున్నా నో జోష్

అయిదు సినిమాలు వస్తున్నా నో జోష్

థియేటర్లు జులై 30న తెరిచాక తెలుగులో ఇప్పటిదాకా పాతిక పైగానే స్ట్రెయిట్ సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో కమర్షియల్ గా సేఫ్ అయినవి నిర్మాతలకు లాభాలు ఇచ్చినవి పట్టుమని ఓ అయిదు ఉంటాయి కానీ మిగిలినవాటిలో అధిక శాతం కనీసం హాళ్ల రెంట్లు కిట్టుబాటు చేయనివే. ఎస్ఆర్ కళ్యాణమండపం, రాజరాజ చోరలు మాత్రమే డిస్ట్రిబ్యూటర్లను ఖుషీ చేయించాయి. శ్రీదేవి సోడా సెంటర్ భారీ అంచనాల మధ్య డిజాస్టర్ దిశగా వెళ్తోంది. ఈ క్రమంలో రేపు మరో శుక్రవారం రాబోతోంది. ఒకటి రెండు కాదు ఏకంగా మరో అయిదు చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. కానీ కిక్ వచ్చేలా కనిపించడం లేదు.

కాస్త హైప్ ఉన్నవాటిలో అవసరాల శ్రీనివాస్ 101 జిల్లాల అందగాడు మూవీ లవర్స్ ని ఆకర్షిస్తోంది కానీ జనాన్ని థియేటర్లకు రప్పించేంత మ్యాటర్ ఇందులో ఏ మేరకు ఉందో చెప్పలేం. టాక్ చాలా బాగుందని వస్తే తప్ప రెండు మూడు రోజులకు కానీ పికప్ ఆశించలేం. ఓటిటి బాగా విస్తృతం అయ్యాక బడ్జెట్ సినిమాల కోసం థియేటర్లకు వచ్చేందుకు ప్రేక్షకులు అంతగా మొగ్గు చూపడం లేదు. పైగా బట్టతలతో కామెడీని ఆధారంగా చేసుకున్న ఈ ఎంటర్ టైనర్ మనవాళ్లకు ఏ మేరకు కనెక్ట్ అవుతుందో చూడాలి. మేఘ ఆకాష్ టైటిల్ రోల్ పోషించిన డియర్ మేఘ ప్రమోషన్లు గట్టిగానే చేసుకుంది.

దీని ఒరిజినల్ వెర్షన్ ఇప్పటికే డబ్బింగ్ రూపంలో యుట్యూబ్ లో 5 మిలియన్ల దాకా చూసేశారు. సో రేపు దీనికి కూడా టాక్ చాలా కీలకం. అప్పుడు ఇప్పుడు, అస్మీ, కార్తీక్స్ ది కిల్లర్ అనే మరో మూడు మూవీస్ కూడా పెద్దతెరకు వస్తున్నాయి. దేనికీ కనీస బజ్ కూడా లేదు. వీటికన్నా హాలీవుడ్ మూవీస్ ఎఫ్9, శాంగ్ చి బుకింగ్స్ చాలా మెరుగ్గా ఉండటం గమనార్హం. ఒకవేళ ముందు ప్రకటించిన సీటిమార్ కనక రేపు రేస్ లో ఉండి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. కానీ అది 10కి వాయిదా పడటంతో మాస్ కు రేపు ఒక్క సినిమా లేకుండా పోయింది. ఇక హౌస్ ఫుల్ బోర్డులు జరగని పని. చూద్దాం రేపు వీటిలో ఏదైనా సర్ప్రైజ్ ఇస్తుందేమో

Also Read :  పవర్ స్టార్ ప్రయాణం – కెరీర్ గ్రాఫ్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి