iDreamPost

నిర్భయ నిందితుల ఉరి మరోసారి వాయిదా

నిర్భయ నిందితుల ఉరి మరోసారి  వాయిదా

దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన నిర్భయ అత్యాచారోదంతంలో నిందితుల ఉరిశిక్ష అమలు మూడోసారి కూడా వాయిదా పడింది.

మంగళవారం ఉదయం నలుగురు నిందితుల్ని ఉరి తీస్తారని అందరూ భావించినా పాటియాలా కోర్టు మాత్రం చివరి సమయంలో ట్విస్ట్ ఇచ్చింది. కోర్టు ఆదేశించేవరకూ వారికి విధింయిన ఉరిశిక్షపై స్టే విధించింది. ఈకేసులో నిందితుడైన పవన్ గుప్తా వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం మూడోసారి ఉరిశిక్ష అమలు నిలిపివేస్తూ తీర్పునిచ్చింది.

మరోవైపు పవన్ కుమార్ గుప్తా దాఖలుచేసిన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఈక్రమంలో నిందితులకు మంగళవారం ఉరిశిక్ష పడుతుందా లేదా అని సందిగ్ధత కొనసాగింది. ఈ నలుగురు దోషులు దాఖలుచేసిన క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి తిరస్కరించారు. అంతకుముందు పవన్ దాఖలుచేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తనకు విధించిన ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలంటూ పవన్ చేసిన విజ్ఞ‌ప్తిని జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం తిరస్కరించింది. మీరు చేసిన దుర్మార్గానికి ఉరిశిక్ష విధించడం సరైందేనని కోర్టు అభిప్రాయపడింది.సుప్రీంకోర్టు తన పిటిషన్‌ ను తిరస్కరించడంతో పవన్ గుప్తా లాయర్ ఏపీసింగ్ క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలుచేయగా రాష్ట్రపతి దీనిని తిరస్కరించిన విషయం తెలిసిందే.

దోషుల ఉరిశిక్షపై కోర్టు మరోసారి స్టే విధించడం పట్ల నిర్భయ తల్లి తీవ్ర నిరాశ వ్యక్తంచేశారు. ఉరిశిక్ష పదే పదే వాయిదా పడడం మన వ్యవస్థ వైఫల్యం అంటూ ఆమె కంటతడి పెట్టారు. తీర్పు వెలువడిన తర్వాత కోర్టు ఆవరణలో కుప్పకూలిన ఆమె వెక్కి వెక్కి ఏడ్చారు. దోషులను ఉరితీయాలంటూ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడానికి కోర్టుకు ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నట్టు.? మన వ్యవస్థ మొత్తం నిందితులకే మద్దతిస్తుంది. ఈ కేసులో కోర్టు ఏమి చేస్తుందో ప్రపంచం మొత్తం చూస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి