మొన్న శుక్రవారం ఏకంగా నాలుగు తెలుగు సినిమాలు ఒక ఇంగ్లీష్ మూవీ రిలీజయ్యింది కాబట్టి మొదటి వారం మొత్తం డామినేట్ చేసిన ఉప్పెన నెమ్మదిస్తుందని ట్రేడ్ సైతం భావించింది. కానీ అనూహ్యంగా అలాంటిదేమీ జరగలేదు. శని ఆదివారాలు సైతం ఉప్పెన భారీ వసూళ్లు రాబట్టుకుని ఔరా అనిపించేసింది. మీడియం రేంజ్ సినిమాల్లో పదో రోజు అత్యధిక వసూళ్లు తెచ్చిన సినిమాల్లో ఫిదాను దాటేసి మొదటి స్థానాన్ని ఆక్రమించేసింది. ఫిదా పేరు మీద టెన్త్ డే 1 కోటి 89 లక్షల వసూళ్లు ఉండగా పెద్ద మార్జిన్ తో ఉప్పెన 2 కోట్ల 61 లక్షలతో టాప్ ప్లేస్ ని కొట్టేసింది. ఒక డెబ్యూ హీరో సాధించిన అరుదైన రికార్డు ఇది. అందులోనూ ఇంత పోటీలో.
ఇక్కడితో అయిపోలేదు. నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్స్ లో సైతం పదో రోజు లెక్కల్లో అరవింద సమేత వీర రాఘవ, భరత్ అనే నేను, మిర్చిలను క్రాస్ చేసి ఏడో స్థానాన్ని ఆక్రమించుకుంది. మరోవైపు ఇందులో సగం కూడా రెండు రోజుల క్రితం రిలీజైన పొగరు, కపటధారిలు తేలేకపోవడం ఇక్కడ గమనించాలి. నాంది, చక్రలు పర్వాలేదనిపించాయి. అంటే కొత్త రిలీజుల కంటే లాస్ట్ వీక్ వచ్చిన ఉప్పెన మీదే ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారనేది అర్థమవుతోంది. నిన్న మొన్న ఏ సెంటర్స్ లో చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి. మల్టీ ప్లెక్సుల్లో బుకింగ్స్ కిటకిటలడాయి. నిజానికి ఈ స్పందన రెండో వారంలో ఊహించనిది.
ఈ లెక్కన ఫైనల్ రన్ పూర్తయ్యే లోపు ఉప్పెన ఏ నెంబర్ దగ్గర నిలబడుతుందో అంతు చిక్కడం లేదు. ఈ శుక్రవారం నితిన్ చెక్ వస్తోంది. అదేమి కమర్షియల్ ఎంటర్ టైనర్ కాదు. ఒకవేళ టాక్ కనక చాలా బాగుందని వస్తే అప్పుడు ఉప్పెన మీద ప్రభావం ఉంటుంది. అలా కాకుండా కొంచెం డివైడ్ గా ఉన్నా మెగా హీరోకు పండగే. ఆపై ఇంకో వారం అడ్వాంటేజ్ దొరుకుంటుంది. ఫస్ట్ వీక్ టికెట్ రేట్ల పెంపు, వంద శాతం సీటింగ్ అనుమతి, సరైన రిలీజ్ టైమింగ్, పోటీ సినిమాల బలహీనతలు ఉప్పెనకు ఇంత స్థాయిలో భారీ కలెక్షన్లను తెచ్చి పెట్టాయి. ఇంకెన్ని రికార్డులు తుడిచిపెడుతుందో చూడాలి