Idream media
Idream media
బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో తీవ్ర ఒడిదోడుకులకు లోనయ్యే భారతీయ స్టాక్ మార్కెట్ సోమవారం ఎలాంటి భయాలు లేకుండా ఆల్ టైం హై రికార్డ్ దిశగా దూసుకు వెళ్ళింది. గతంలో స్పందించే తీరుకు భిన్నంగా… భారతీయ స్టాక్ మార్కెట్ ఒకేసారి గరిష్టానికి వెళ్లడం ఇటు విశ్లేషకులని ఆశ్చర్యపరిచింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టిన దగ్గర నుంచి మార్కెట్ పరుగుకు అంతులేకుండా పోయింది. ఆమె ప్రతి పాయింట్ చదువుతున్న సందర్భంగా మార్కెట్ వేగంగా ముందుకు దూసుకెళ్లింది తప్ప ఎక్కడ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఫలితంగా సోమవారం మార్కెట్ ముగిసే సరికి 2314 పాయింట్స్ లాభ పడి 48,600 పాయింట్స్ వద్ద ముగిసింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సమయంలో మార్కెట్ ఇంతగా లాభం ఇదే మొదటిసారి. ఇది మార్కెట్లో వస్తున్న అనూహ్య పరిణామాలకు, కొత్త మదుపర్ల ఆలోచనలకు, యువ పెట్టుబడిదారుల దూకుడు కు నిదర్శనం ఈ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
గత వారం నష్టాలు అధిగమించి!
గత వారం అంతా నష్టాల బాటలో పయనించిన భారతీయ స్టాక్ మార్కెట్…సోమవారం మొత్తం తన ఆల్ టైం హై అందుకొని తన లాభాల దాహాన్ని తీర్చుకుంది. స్టాక్ మార్కెట్… సోమవారం ఉదయం నుంచే లాభాల బాట పట్టింది. మదుపరులు ఎలాంటి భయం లేకుండానే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు. గత వారం లాభాలు స్వీకరించి… పెట్టుబడుల ఉపసంహరణకు మొగ్గు చూపిన మదుపరులు సోమవారం ఎక్కడ స్టాక్స్ అమ్మకుండా… కేవలం కొనుగోలు వైపే అంతా మొగ్గుచూపారు. గతవారం వచ్చిన నష్టాలను వివరిస్తూ కూడా సోమవారం మరో ఆలోచన లేకుండా పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ మంది మొగ్గు చూపారు. గత వారం మొత్తం ఎన్ని లక్షల కోట్లకు పైగా నష్టాలు వచ్చినా మార్కెట్… సోమవారం ఒక్కరోజే దానిలో ఆరు లక్షల కోట్లకు పైగా రికవరీ అయినట్లు తెలుస్తోంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో నమోదు అయిన ఏ కంపెనీ సైతం సోమవారం నష్టాలు చవిచూడ లేదంటే మార్కెట్ పరుగు ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆరోగ్య భరోసా!!
బడ్జెట్ ప్రసంగం ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మొదలుపెట్టగానే.. మార్కెట్ జోరందుకుంది. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి 35 వేల కోట్ల నిధి ప్రకటించడం మార్కెట్కు సానుకూలాంశం అయ్యింది. మార్కెట్ ఎప్పుడూ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని కదలాడుతుంది. కేంద్రం ప్రజల ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి పెట్టి ప్రత్యేకమైన నిధిని ప్రకటించడంతో బ్యాంకింగ్ షేర్లు ముఖ్యంగా దూసుకుపోయాయి. అంటే భవిష్యత్తు అవసరాలను కేంద్రం ప్రాధాన్యత ఇచ్చింది కాబట్టి మార్కెట్ దీనిని సానుకూలంగా తీసుకుంది. మరోపక్క సామాన్యులకు ఏమాత్రం ఊరట లేకుండా… కేవలం కార్పొరేట్ sattar ను లక్ష్యంగా చేసుకుని బడ్జెట్ ఆశాజనకం గా ఉండడం కూడా మార్కెట్కు కలిసొచ్చింది. బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడు మార్కెట్ పరుగులు తీస్తే కచ్చితంగా అది కార్పొరేట్ కంపెనీలకు వ్యవహారాలకు అనుకూలమైన బడ్జెట్ గానే పరిగణిస్తారు. అంటే సాధారణ మధ్యతరగతి వారికి బడ్జెట్ దూరంగా ఉందనే అర్థం కూడా వస్తుంది. సోమవారం బడ్జెట్ ప్రసంగం మొదలైన దగ్గర నుంచి ఇలాంటి కదలికలే కనిపించాయి. మార్కెట్ ఆసాంతం మూడున్నర వరకు ఎంత ఉత్సాహంగా జరిగింది.
గత రికార్డు ఇది!
ప్రతి ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో స్టాక్ మార్కెట్ రకరకాలుగా కదలాడుతుంది. దానిని అంచనా వేయడం చాలా కష్టం. అయితే సోమవారం మాత్రం లాభాల బాటలోనే మొదటినుంచి స్టాక్ మార్కెట్ పై నుంచి ఆల్ టైం హై నమోదు చేయడం గమనార్హం. గత దశాబ్ద కాలానికి పరిశీలిస్తే….2011లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సమయంలో మార్కెట్ -122 పాయింట్స్ నష్టపోయింది. 2012లో -291 పాయింట్స్ వెనక్కు వెళ్ళింది. 2013లో -210 పాయింట్స్ నష్టం చవి చూసింది. 2014 లో 97 పాయింట్స్ స్వల్ప లాభం వచ్చింది. 2015లో 141 పాయింట్స్ లాభంలో ఉంది. 2016లో -152 పాయింట్స్ నష్టం, 2017లో 486 పాయింట్స్ లాభం మూట గట్టుకుంది. 2018లో -58 పాయింట్స్ నష్టంలో ఉంటే, 2019లో రెండు సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టరు. 213 లాభం, -395 పాయింట్స్ నష్టం వచ్చింది. 2020లో సైతం -989 పాయింట్స్ నష్టమే వచ్చింది. అయితే ఇదే పరిస్థితి కొనసాగుతుందా లేక మంగళవారం లాభాల స్వీకరణకు అంతా మొగ్గు చూపుతారా అన్నది చూడాలి.