విచిత్రంగా ఇవాళ పవన్ కళ్యాణ్ అయిదు సినిమాల అప్డేట్స్ వచ్చాయి కానీ ఒక్కదాంట్లో మాత్రమే తన అఫీషియల్ లుక్ బయటికి రావడం భలే ట్విస్టు. అది కూడా లాక్ డౌన్ కు ముందే అధిక శాతం షూటింగ్ జరుపుకున్న వకీల్ సాబ్ దే. అభిమానులు ఆనందపడినట్టు ఉంది కానీ లోలోపల మాత్రం ఇదేంటబ్బా అనేలా ఉన్నాయి పోస్టర్లు. తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించబోయే 28వ సినిమా ప్రీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. క్రిష్ సినిమా లుక్ లో కనీసం నడుము అయినా చూపించారు. ఇందులో ఆ మాత్రం భాగ్యానికి కూడా నోచుకోలేకపోయారు ఫ్యాన్స్. కేవలం ఖరీదైన బైకుతో సరిపుచ్చారు. కాకపోతే కాన్సెప్ట్ మాత్రం చెప్పే ప్రయత్నం చేశారు.
ఇండియన్ గేట్ ముందు పార్క్ చేసిన బండి మీద పెద్ద బాలశిక్ష పుస్తకం, ట్రాన్స్ పరెంట్ బ్యాక్ డ్రాప్ లో స్వతంత్ర సమరయోధుల చిత్రాలు వెరసి ఈసారి హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ టైపు మసాలా ఎంటర్ టైనర్ కాకుండా గట్టిగా మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ ఫ్లిక్ చేస్తున్నాడని అర్థమైపోయింది . అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టం. అందులో ఎంత కాన్సెప్ట్ ఉన్నప్పటికీ ఈ మాత్రం బైకు లుక్కుని వదలడానికి గత రెండు రోజుల నుంచి ఒకటే ఊరించడం న్యాయమా అనే ప్రశ్నకు సమాధానం దొరకదు. పవన్ రేంజ్ స్టార్ హీరో తాలుకు పోస్టర్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా అందులో తమ అభిమాన కథానాయకుడు కనిపించాలని ఫ్యాన్స్ కోరుకోవడం సహజం.
అంతే తప్ప ఇలా పావు సగం లుక్కులతో నిరాశ కలిగించడానికి కాదు. గద్దలకొండ గణేష్ తర్వాత గ్యాప్ తీసుకున్న హరీష్ శంకర్ ఆ తర్వాత పూర్తిగా పవన్ స్క్రిప్ట్ మీదే పని చేస్తున్నారు. మధ్యలో సునీల్ కోసం వేదాంతం రాఘవయ్య కథను అందించారు. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రిపీట్ అవుతున్న కాంబో కాబట్టి దీని మీద అంచనాలు ఎంత ఉంటాయో వేరే చెప్పాలా. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం దీనికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతోంది. మైత్రి సంస్థ రూపొందించబోయే ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి