iDreamPost
iDreamPost
ప్రధాన మంత్రి మోడీ అనూహ్యంగా స్పందించారు. అది కూడా పార్లమెంట్ వేదికగా ఆయన కన్నీరు పెట్టుకున్నారు. అందులోనూ కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పదవీ విరమణ గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి స్పందన ఈ స్థాయిలో ఉండడం చర్చనీయాంశమయ్యింది. రాజ్యసభలో కాంగ్రెస్ తరుపున ప్రతిపక్ష నేతగా ఉన్న గులాంనబీ ఆజాద్ వచ్చే ఏప్రిల్ లో పదవీ విరమణ చేస్తున్నారు. ఆయన పదవీకాలం ముగుస్తుండడంతో ఎగువ సభ నుంచి ఆయన రిలీవ్ అవుతారు. ఈ నేపథ్యంలో ఆయన గురించి చర్చ సందర్భంగా ప్రధాని మోడీ ప్రశంసల వర్షం కురిపించడం ఆసక్తిగా మారింది. అదే సమయంలో ఆజాద్ తో తన అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకుంటూ మోడీ కంట తడి పెట్టుకోవడం విశేషంగా మారింది.
గులాంనబీ ఆజాద్ కశ్మీర్ కి చెందిన కాంగ్రెస్ నేత. సుదీర్ఘకాలం పాటు ఆయన కాంగ్రెస్ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ గా ఉండేవారు. అప్పట్లో వైఎస్సార్ హయంలో ఆజాద్ పేరు తెలుగు నేల మీద మారుమ్రోగింది. అయితే ఇటీవల ఆయన కాంగ్రెస్ అధిష్టానం నుంచి దూరం జరుగుతూ వస్తున్నట్టు కనిపిస్తోంది. పలుమార్లు ఆయన నాయకత్వం మీద ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఈ నేపథ్యంలో మోడీ ప్రశంసలు చర్చనీయాంశంగా మారాయి. గతంలో కశ్మీర్ కి రాష్ట్ర ప్రతిపత్తి తొలగించిన నేపథ్యంలో పలువురు రాజకీయ నేతలను నిర్బంధించిన సమయంలో గులాం నబీ ఆజాద్ ని కూడా కొంతకాలం పాటు గృహనిర్బంధంలో ఉంచారు. అయితే ఇప్పుడు ఆయన గురించి మోడీ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.
‘‘ఉన్నత పదవులు వస్తుంటాయి. అధికారమూ వస్తుంది. ఇన్ని వచ్చినా, ఎలా వుండాలో ఆజాద్ దగ్గర నేర్చుకోవాలి. ఆజాద్ నాకు నిజమైన స్నేహితుడు.’’ అంటూ మోడీ చేసిన కామెంట్ ఆసక్తికరం అయ్యింది. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ తన అనుభవం ఒకటి గుర్తు చేసుకున్నారు… ‘‘గుజరాతీ పర్యాటకులపై కశ్మీర్ లో ఉగ్రవాదులు దాడి చేశారు. అప్పుడు ఆజాద్ నాకు ఫోన్ చేశారు. బాధపడుతూ ఏడ్చేశారు. నేరుగా విమానాశ్రయానికే వచ్చేశారు. ఓ కుటుంబ సభ్యుడిగా వారందర్నీ చూసుకున్నారు. బాధితులపై శ్రద్ధ చూపారు. ఆ సమయంలో ప్రణబ్ దాదా రక్షణ మంత్రిగా ఉన్నారు. మృత దేహాన్ని తరలించడానికి ఓ ఏయిర్ ఫోర్స్ విమానం కావాలని అడిగా. ఏదో ఒకటి కచ్చితంగా ఏర్పాటు చేస్తానని చెప్పారు. రాజకీయాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఆజాద్ వల్ల దేశానికి చాలా లాభం జరిగింది. ఆయన చేసిన సేవలకు ధన్యవాదాలు. దేశం కోసం వారిచ్చే సూచనలు, సలహాలను ఎప్పటికీ స్వాగతిస్తూనే ఉంటాం.’’ అంటూ ఏకంగా శాల్యూట్ చేశారు.
గులాంనబీ ఆజాద్ కేవలం పార్టీ కోసమే ఆలోచించలేదంటూ మోడీ వ్యాఖ్యానించడం విశేషం. అజాద్ అన్ని వేళలా దేశం కోసం కూడా ఆలోచించారని ప్రశంసించారు. ఆయన దేశానికి చాలా ప్రాధాన్యాన్ని ఇచ్చేవారని, శరద్ పవార్ కూడా అచ్చు ఇలాగే ఉండేవారని మోడీ అభిప్రాయపడ్డారు. ఆజాద్ తర్వాత ఆ సీట్లో ఎవరు కూర్చున్నా, చాలా సవాళ్లను స్వీకరించాల్సి ఉంటుందని మోడీ చేసిన వ్యాఖ్యలు కూడా విశేషంగానే చెప్పవచ్చు. ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం ఆజాద్ కి మరోసారి రాజ్యసభ అవకాశాలను నిరాకరించగా, తాజాగా మోడీ చేసిన వ్యాఖ్యలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయోననే చర్చ మొదలయ్యింది.