పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు తెస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలోని పలువురి సీనియర్ నేతల పట్టు ప్రస్తుతం ఎలా ఉందో తేటతెల్లం చేశాయి. మరోవైపు భారతీయ జనతా పార్టీ బలం ఎలా ఉందో కూడా తెలిసింది. ఏపీలో తమదే నిజమైన ప్రతిపక్ష పాత్ర అని, 2024 అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారంలోకి వచ్చే దిశగా పార్టీని బలోపేతం చేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతూ వస్తున్నారు. కానీ పంచాయతీ ఎన్నికలు, వాటి ఫలితాలను ఆ పార్టీని కూడా నిరాశకు గురి చేశాయి. టీడీపీ స్థానాన్ని ఆక్రమించే స్థాయిలో బీజేపీకి ఏపీలో పరిస్థితులు అనుకూలంగా మారాలంటే ఇంకా బలం పెంచుకోవాలని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. బీజేపీ మద్దతు ఉన్న అభ్యర్థులు కొన్ని సీట్లను గెలుపొందగలిగారు. వాటిలో చాలా సీట్లు కాపు కమ్యూనిటీ ఆధిపత్య ప్రాంతాలలో.. జనసేన మద్దతుతో గెలిచినవేనని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక పోటీ తెరపైకి వస్తోంది.
బీజేపీ – జనసేన పొత్తులో భాగంగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో బీజేయే పోటీ చేస్తుందని పంచాయతీ ఎన్నికల ముందు వరకూ ఊహాగానాలు వెలువడ్డాయి. పలు సందర్భాల్లో ఆ పార్టీ నేతలు కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. జనసైనికులు కూడా ఆ సీటు గురించి పట్టుబడుతున్నారు. తిరుపతి లో బీజేపీ కంటే జనసేనే బలంగా ఉందని మొదటి నుంచీ చెబుతూనే వస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో సీటు బీజేపీకి ఇవ్వాలా? లేదా జనసేనకు ఇవ్వాలా? అన్న సంశయానికి పంచాయతీ ఎన్నికలు తెరదించాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. తిరుపతి ఎంపీ సీటును జనసేనకే ఇవ్వాలన్న బలమైన వాదనకు ఈ పంచాయతీ ఎన్నికలు నిదర్శనంగా నిలుస్తున్నాయని ఆ పార్టీ తిరుపతి పార్లమెంటరీ నాయకులు మరోసారి లేవనెత్తుతున్నారు. జనసేనకు సీటు ఇవ్వకపోతే స్థానిక బలిజా అసోసియేషన్ ఇప్పటికే నోటాకు ఓటు వేయాలని తీర్మానం చేసింది. కాబట్టి జనసేనకు సీటును వదిలివేయాలని మేము ఆలోచిస్తున్నాము ” అని బిజెపికి చెందిన కొందరు తమతో అంటున్నారని జనసేన నాయకులు చెబుతున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చే నెలలో తిరుపతికి రానున్నారు. బీజేపీ-జనసేన కూటమి భవిష్యత్ కార్యాచరణపై ఆయన సమక్షంలో అక్కడ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై వస్తున్న తాజా రిపోర్టుల ఆధారంగానే ఆయన ఏపీకి వస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన రాకను పురస్కరించుకుని ఎవరి వాదనలు, వారు బలంగా వినిపించేందుకు ఇరు పార్టీల నేతలూ కసరత్తు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలలో బీజేపీ, జనసేన పోటీ చేసిన స్థానాలు, గెలుపొందిన స్థానాలు, వచ్చిన ఓట్లు వంటి వివరాలను సిద్ధం చేసుకుంటున్నారు. కాగా, వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ రావు మరణించి ఐదు నెలలకు పైగా అయ్యింది. ఆరు నెలల్లో ఎన్నికలు జరగాలి. కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చని అంటున్నారు.