iDreamPost
android-app
ios-app

పంచాయితీ ఎన్నికలు-మారిన పల్నాడు ముఖచిత్రం….

  • Published Feb 14, 2021 | 1:28 AM Updated Updated Feb 14, 2021 | 1:28 AM
పంచాయితీ ఎన్నికలు-మారిన పల్నాడు ముఖచిత్రం….

ఎమ్మెల్యే ఎన్నికలకన్నా పంచాయితీ ఎన్నికలు చేయటం కష్టం అని రాజకీయనేతలు,పోలీస్ అధికారులు అంటుంటారు. ఆ మాటలు నిజమే అనిపించే సంఘటనలు అనేకం. లక్ష రూపాయాలు పోయినా పర్లేదు కానీ ఒక్క ఓటు తగ్గినా సహించరు. ఈ పట్టుదలే గ్రామాల్లో కక్షలకు బీజం వేసింది.

స్వాతంత్రానికి పూర్వం దాదాపు 80 సంవత్సరాల కిందట,ఇప్పటి గురజాల నియోజక వర్గంలోని పులిపాడు గ్రామంలో 1944 డిసెంబర్లో జరిగిన ఒక హత్య కేసులో శిక్ష పడిన పులుకూరి కోటయ్య అనే వ్యక్తికి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వలో మద్రాస్ హై కోర్ట్ మరణ శిక్ష విధించగా దాన్ని సవాల్ చేస్తూ లండన్ కోర్టులో పోరాడాడు నిందితుడు కోటయ్య . ఇందుకోసం అతని 60 ఎకరాల సాగుభూమిలో యాభై ఎకరాలు హారతి కర్పూరంలా కరిగిపోగా వారసులకు పదెకరాలు భూమి ,షెడ్డు లాంటి చిన్న ఇల్లు మిగిలాయి … ఫ్యాక్షన్ , వర్గ కక్షలకు కుటుంబాలు ఏ విధంగా నాశనమవుతాయో అనేదానికి ఒక ఉదాహరణ ఈ ఘటన .

పలనాడు అంటేనే పంతాలకు పట్టింపులకు పెట్టింది పేరు .నికరంగా ఎకరం పోయినా నిలబడి గెలవాలనేది ఇక్కడ వాడుక పదం . అయిన వాళ్ళల్లో వచ్చిన చిన్న చిన్న మాట తేడాలే దీర్ఘ కాల కక్షలు కార్పణ్యాలకు దారి తీస్తాయి ఇక్కడ .ఈ వివాదాలతో దగ్గరి బంధువులు సైతం ఎడమొహం పెడమొహంగా ఉండటమే కాక ఒకరి పై ఒకరి ఆధిపత్య ప్రదర్శన కోసం ప్రతి సందర్భంలోనూ ప్రయత్నిస్తుంటారు . ఫలితంగా వివాదాలు తారాస్థాయికి చేరి గ్రామస్థులు ఇరు వర్గాలుగా మారి కలహించుకొనే వారు .

ఈ క్రమంలో జరిగిన భౌతిక దాడుల్లో ధన ఆస్తి ప్రాణ నష్టాలకు లెక్కే లేదు . పొలం గట్ల దగ్గర మొదలైన తగాదా ముదిరి కొట్టుకొని , నరుక్కొనే దాకా నడిచి స్టేషన్లకి , కోర్టు ఖర్చుల కోసం ఆ పొలమే హారతి కర్పూరంలాగా కరిగిపోయినా ఆ కక్షలు తీరేవి కావు .
దాయాదుల మధ్య మొదలయ్యే గ్రామ ఆధిపత్య పోరు తీవ్ర రూపం దాల్చి రక్త సంబంధాలు మరిచి దాడులు , హత్యాయత్నాలు , హత్యలతో రక్తం కళ్ళజూసేవారు .

సహజంగా ఒకరికి కష్టమొస్తే పది మంది అండగా ఉండే పల్లెల్లో కనపడే సమిష్ఠితత్వం వెనకబడి దగ్గరి బంధువుల్లో కూడా బుస కొట్టే వైషమ్యాలతో రగులుకుపోతూ సొంత అన్నదమ్ములు,ఆడబిడ్డలు కష్టాల్లో ఉన్నా వైరి వర్గానికి కొమ్ము కాసాడనో,తమకి అండగా నిలబడలేదనో వారిని దూరం పెట్టటమే కాకుండా మరింత నష్టం చేసేందుకు యత్నించేవారు . దూడ గడ్డికి కరువొచ్చినా , బిడ్డ పాలకి లేకపోయినా మాడి చచ్చేవారు కానీ పంతాన్ని వీడి తమ వారి సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకోరిక్కడ . అల్లుడు శత్రు వర్గం వైపు ఉంటే కన్న కూతురిని సైతం ఇంటికి రాని కర్కశత్వం , ఒక తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములు , అక్క చెల్లెల్లు మధ్య దశాబ్దాల తరబడి మాటలు లేని దృష్టాంతాలు ఎన్నో . తాము దూరం కావడమే కాకుండా కొమ్ము కాసిన వర్గీయులు తమ బంధువుల మీదే దాడి చేస్తున్నా చూసి చూడనట్టు పోయేంతగా విద్వేషాలు పెరిగిపోయేవి .

దాయాదుల మధ్య వివాదంతో జరిగిన పల్నాటి యుద్ధంలో పారిన రక్తపుటేరులతో తడిసిన ప్రాంత ప్రభావమో , పెరిగిన వాతావరణ ప్రభావంతోనో పచ్చగా ఉండాల్సిన పల్లెల్లో ఉండే ఇలాంటి చిన్న వివాదాల్ని తమ లబ్ది కోసం పెంచి పోషించేవారు స్థానిక రాజకీయ నాయకులు . ఏ ఒక్క పార్టీనో కాదు అన్ని పార్టీల నాయకుల భాగస్వామ్యం ఉంది ఈ పాపంలో . ఆయా పార్టీల నాయకులు గ్రామాల్లో ఉన్న వర్గాలకు కొమ్ము కాయడమే కాకుండా ఎన్నికల వేళ ప్రయోజనం కోసం ప్రత్యర్థి వర్గాల పైకి దాడులకు ప్రోత్సహించేవారు . ఫలితం మూగజీవాల ఆహారమైన గడ్డి వాముల దగ్ధంతో పాటు , పంట పొలాల ధ్వంసం , ఇల్లు కొష్టాలు కూలగొట్టటం , విషం పెట్టి ప్రత్యర్థి కాడెద్దులను చంపడం ఎన్నికల వేళ నిత్యకృత్యాలు అయ్యేవి . అధికారం చేతులు మారేవేళ బలవంతుడిది పై చేయి అయినా ఈ దుశ్చర్యల వలన గ్రామంలో ఇరు వర్గాలు తీవ్రంగా నష్టపోవడమే కాకుండా ఏళ్ల తరబడి స్టేషన్ల చుట్టూ , కోర్టుల చుట్టూ తిరిగి కోలుకోలేనంతగా దెబ్బ తినేవారు .

నాలుగైదు దశాబ్దాల క్రితం ప్రవేశించిన నాటు బాంబుల సంస్కృతితో ఈ విభేదాలు వికృత రూపం దాల్చాయి . ఎన్నికలు సమీపిస్తున్నాయంటే బాంబులు కొనుక్కొని దిబ్బల్లో దాచి దాడులు చేసే దగ్గర నుండి అదో కుటీర పరిశ్రమలా ఇళ్ల వద్దే ఎన్నికలకు ఆరు నెలల ముందు నుండీ తయారు చేసి దిబ్బల్లో,కొష్టాల్లో నిల్వ చేసేవారు . వీటి మూలంగా పలువురు మహిళల తాళిబొట్లు తెగడంతో పాటు కాళ్ళు చేతులు తెగి శాశ్వత వైకల్యంతో జీవితాలు వెళ్లదీస్తున్న వారు ఎందరో .

ఈ ప్రాంతంలో పల్నాటి పులి అని పిలిపించుకొనే ఒక నాయకుడి అసలు ఇంటిపేరు పోయి బాంబుల అనే పదం ఇంటిపేరుగా స్థిరపడిపోయింది అంటే అతను హయాంలో బాంబుల సంస్కృతి ఏస్థాయిలో ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. .

గెలిచినోడు జైలుకి , ఓడినోడు కాటికి, అదృష్టం బావుంటే హాస్పిటల్ కి పోయేవాడు . వీళ్ళని ఉసిగొల్పిన రాజకీయ నాయకులు మాత్రం చేతులు మారే అధికారంతో తమ సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకునేవారు . సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈ విష సంస్కృతి కొంతకాలంగా తగ్గుతూ వస్తుండటం మంచి పరిణామం అని చెప్పొచ్చు . ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న స్థానిక పంచాయతీ ఎన్నికల్లో ఒకటీ ఆరా చోట్ల చెదురుమదురు ఘటనలు తప్ప నిన్నటితో ముగిసిన రెండు దశల్లో అవాంఛనీయ ఘటనలు , భౌతిక దాడులు లేకుండా ప్రశాంత వాతావరణంలో సాగడంపట్ల ప్రజలు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు .

మారిన ప్రజల ఆలోచనా ధోరణి , విద్యతో ఉన్నత జీవనం వైపు పరుగులెడుతున్న యువత వర్గ భేదాలు , గొడవలు జోలికి పోకుండా ఉండటంతో పాటు ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో భాగస్వామ్యమైన పలు నియోజక వర్గాల్లోని కొత్తతరం రాజకీయ నేతలు వివాదాల్ని పెంచి పోషించకుండా ఆదర్శవంతంగా వ్యవహరించడం ఈ మార్పుకి కారణంగా చెప్పొచ్చు . ఒకటీ ఆరా చిన్న వివాదాల్ని పక్కన పెట్టి చూస్తే గత యాభై ఏళ్ళల్లో పల్నాడు ప్రాంతంలో వివాదరహితంగా , అవాంఛనీయ సంఘటనలు లేకుండా ముగిసిన ఎన్నికలుగా ప్రస్తుత పంచాయితీ ఎన్నికలు నిలవడం పల్నాడు ప్రాంతంలో కక్షలు , కార్పణ్యాలకు చరమగీతం పాడటానికి దోహదం చేసిన ఎన్నికలుగా ఈ ప్రాంత ప్రజల మదిలో నిలిచిపోతాయి …..