iDreamPost
android-app
ios-app

పొలిటిక‌ల్ సైబ‌ర్ దొంగ‌లు.. ఫేక్ వెబ్ సైట్ తో ఫ‌లితాల తారుమారు…

పొలిటిక‌ల్ సైబ‌ర్ దొంగ‌లు.. ఫేక్ వెబ్ సైట్ తో ఫ‌లితాల తారుమారు…

దేవుడి పేరుతో మోసానికి న‌కిలీ వెబ్ సైట్లు, ప్ర‌ముఖ కంపెనీల వెబ్ సైట్ల‌లోని పేరును ఓ అక్ష‌రం అటూ ఇటూ మార్చి షాపింగ్ పేరుతో ప్ర‌జ‌ల‌ను కొల్ల‌గొట్టేందుకు న‌కిలీ వెబ్ సైట్లు, స్కీములు పేరిట స్కాముల‌కు పాల్ప‌డే న‌కిలీ వెబ్ సైట్ లు ఎన్నో.. ఇలా అన్ని రంగాల‌లోనూ న‌కిలీ వెబ్ సైట్ లు కుప్ప‌లు తెప్ప‌లుగా పుట్టుకొస్తున్నాయి.

న‌కిలీకి కాదేదీ అన‌ర్హం అన్న‌ట్లు ఇప్పుడు ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను మార్చి చూపుతూ.. ప్ర‌జ‌ల‌ను ఏ మార్చేందుకు కూడా న‌కిలీ వెబ్ సైట్ల‌ను రూపొందిస్తున్నారంటే రాజ‌కీయాలు ఎంత‌లా దిగ‌జారుతున్నాయో, సైబ‌ర్ నేరాలు ఎలా రూపాంత‌రం చెందుతున్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. రాజ‌కీయ పార్టీల‌న్నీ త‌మ విధానాల‌ను, ల‌క్ష్యాల‌ను ప్ర‌జ‌ల‌కు చేర‌వేసేందుకు ఇటీవ‌ల సోష‌ల్ మీడియానే ఎక్కువ‌గా వాడుకుంటున్నాయి. సోష‌ల్ మీడియాలోని ప్ర‌చార అంశాల ఆధారంగా ప్రింట్, ఎల‌క్ట్రానిక్ మీడియాల‌లో సైతం క‌థ‌నాలు ప్ర‌చురితం, ప్ర‌సారం అవుతున్నాయంటే ఆ మీడియాకు ఉన్న ప‌వ‌ర్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు.

ఒక్కో అంశానికి ఒక్కో ప్ర‌త్యేక వెబ్ సైట్ లేదా వెబ్ పేజీ రూపొందించ‌డం పొలిటిక‌ల్ పార్టీల‌కు ఆన‌వాయితీగా మారుతోంది. ఒక్కో పార్టీకి ఒక్కో మీడియా ఉన్న‌ట్లే.. సోష‌ల్ మీడియాలో కూడా ప్ర‌త్యేక సైట్లు ఉంటున్నాయి. అలాగే ఇప్పుడు పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు సంబంధించి వివ‌రాల‌ను ప్ర‌జ‌ల‌కు అంద‌జేసేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటీవ‌ల ఓ వెబ్ సైట్ ను రూపొందించింది. జిల్లాల‌ వారీగా ఉన్న మొత్తం పంచాయ‌తీలు, విడ‌త‌ల వారీగా ఎన్నిక‌లు జ‌రిగే పంచాయ‌తీలు, పార్టీల వారీగా, ఇత‌రులు గెలిచిన సంఖ్య‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్ చేస్తూ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సైబ‌ర్ సెల్ ఆ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తోంది. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఆ వెబ్ సైట్ పేరుతో మ‌రో న‌కిలీ వెబ్ సైట్ రూపొందించారు. న‌కిలీ స‌మాచారాన్ని అందులో పొందుప‌రుస్తున్నారు. దీన్ని ప‌సిగ‌ట్టిన వైసీపీ ప్ర‌తినిధులు ఆ వెబ్ సైట్ ను త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాల‌ని సీబీ సీఐడీకి ఫిర్యాదు చేశారు.

వారిపై చ‌ర్య‌లు తీసుకోండి..

న‌కిలీ వెబ్‌సైట్ త‌యారు చేసి త‌ప్పుడు స‌మాచారం ఇస్తున్న వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధులు అంకంరెడ్డి నారాయ‌ణ‌మూర్తి, ఈద రాజ‌శేఖ‌ర్ కోరారు. శ‌నివారం సీబీసీఐడీ అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ జ‌న‌రల్‌ను పార్టీ అధికార ప్ర‌తినిధులు క‌లిసి ఫిర్యాదు చేశారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు సంబంధించి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటీవ‌ల ysrcppolls.in వెబ్‌సైట్‌ను రూపొందించింద‌న్నారు. అయితే కొంద‌రు వ్య‌క్తులు ysrcppolls.com తయారు చేసి త‌ప్పుడు స‌మాచారాన్ని పొందుప‌రిచార‌ని, త‌ప్పుడు వెబ్‌సైట్ క్రియేట్ చేసిన‌ వారిపై సైబర్ నేరాల చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. త‌క్ష‌ణ‌మే ysrcppolls.com website ను నిలిపివేయాలని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సి.బి.సి.ఐ.డి పోలీస్ అధికారిని కోరారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఆ విధ‌మైన న‌కిలీ వెబ్ సైట్ రూప‌క‌ల్ప‌న ద్వారా ఎవ‌రికి లాభం, ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం దాన్ని రూపొందించారు.. అనే కోణాల్లో పోలీసులు కేసు ద‌ర్యాప్తు ప్రారంభించిన‌ట్లు తెలిసింది. వైసీపీ నేత‌ల ఫిర్యాదు అనంత‌రం ఆ వెబ్ సైట్ ను నిలిపివేయించిన అధికారులు బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకునే ప‌నిలో ఉన్న‌ట్లు స‌మాచారం.