కడప జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే వీరశివా రెడ్డి త్వరలో వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నారు. ఇప్పటికే ఆయన చాల రోజులనుండి టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు కమలాపురం మండలం కోగటం గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయ ఏర్పాటుకు, నూతన భవన నిర్మాణాల కోసం భూమి పూజ కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కి మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, డిసీసీబీ చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంలోకి వచ్చిన ఏడు నెలలకే ఇచ్చిన హామీలలో 80 శాతం నేరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. రాజధానిపై ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని ముఖ్యమంత్రి మాత్రం అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నారన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అభివృద్ధి చెందుతాయన్నారు.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే వీరశివా రెడ్డి త్వరలోనే సీఎం జగన్ సమక్షంలో వెఎస్సార్‌సీపీలో చేరునున్నట్లు రవీంద్రనాద్ రెడ్డి తెలిపారు. ఇటీవల కొంత కాలంగా వీర శివారెడ్డి టీడీపీకి దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో కమలాపురం తెలుగుదేశం టికెట్ ను వీరశివారెడ్డి ఆశించినా చివరి నిమిషంలో చంద్రబాబు ఆయన్ని కాదాని అప్పటి మంత్రి ఆదినారాయణ రెడ్డి సిఫార్సు మేరకు పుత్తా నరసింహా రెడ్డి కి తెలుగుదేశం టికెట్ కేటాయించడంతో, వీర శివారెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ప్రత్యక్షంగా వైయస్సార్సిపి అభ్యర్థి కి సహరించినట్టు ఎన్నికల రోజున అయన దగ్గరండి వైసిపికి ఓట్లు వేయించినట్టు మీడియాలో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన త్వరలోనే వైఎస్సార్‌సీపీ అధినేత సీఎం జగన్ సమక్షంలో వైసిపిలో చేరనున్నారని తెలుస్తుంది.
గుడ్లూరు వీరశివారెడ్డి కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలుగుదేశం తరుపున 1994 లో అప్పటి రాష్ట్ర హోం శాఖ మంత్రి ఎంవి మైసూరా రెడ్డి పై సంచలన విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2004 ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ హవాలో తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించారు. 2004 ఎన్నికల తరువాత అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చొరవతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా పోటీచేసి తెలుగుదేశం అభ్యర్థి పుత్తా నరసింహా రెడ్డి పై విజయం సాధించారు.
అయితే జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2011 లో కడప ఉప ఎన్నికల్లో పోటీచేసినప్పుడు వీర శివారెడ్డి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి డియల్ రవీంద్రా రెడ్డి తో కలసి జగన్ కి వ్యతిరేకంగా భారీ ఎత్తున ప్రచారం చేశారు. 2014 ఎన్నికల వరకు కాంగ్రెస్ లోనే కొనసాగిన ఆయన అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. వీరశివా రెడ్డి కి జగన్ కుటుంబంతో బంధుత్వం కూడా వుంది. వీర శివారెడ్డి తమ్ముడు కుమార్తె కడప యంపీ వైయస్ అవినాష్ రెడ్డి భార్య కావడంతో వీరశివారెడ్డి కి వైయస్ అవినాష్ వరుసకు అల్లుడు అవుతారు.