ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్ణయం ఎవరికెలా ఉన్నా ఉద్యోగులకు మాత్రం ప్రాణసంకటమనే చెప్పాలి. అందుకే వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకూ వాయిదా వేయాలంటూ ఉన్నతాధికారులకు, న్యాయస్థానానికి విన్నవించారు. కానీ వారి వినతులను ఎవరూ పట్టించుకోలేదు. ఫలితంగా ఎన్నికల విధుల్లో పాల్గొనక తప్పని పరిస్థితి. ప్రధానంగా పోలీసులు తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నారు. మిగతా ఉద్యోగులతో పోల్చుకుంటే వీరు మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఓ వైపు వ్యాక్సినేషన్.. మరో వైపు ఎన్నికల విధులు, ఇంకో వైపు రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణ. ఈ మూడూ కీలక అంశాలే. పోలీసులు లేనిదే సజావుగా జరిగే పరిస్థితి ఉండదు. అందుకే కీలక సమయంలో ఏపీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్ వేయించునే పనిని కూడా వాయిదా వేసి న్యాయస్థానాల ఆదేశాలు పాటిస్తూ విధుల్లో పాల్గొంటున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ప్రస్తుతం ఈ సమయంలో వారు వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంది. కానీ.. విధి నిర్వహణలో భాగంగా రోజుకో ప్రాంతం తిరగాల్సి రావడంతో పోలీసులు కొవిడ్ వ్యాక్సినేషన్‌ను వాయిదా వేసుకున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.
ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడం ఎలా.. సమస్యలను అధిగమించడం ఎలా.. అనే అంశాలపై పోలీసు సంఘాల నేతలు నాలుగు రోజులుగా మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో డీజీపీతో విడతలవారీగా చర్చలు జరిపారు. సుదీర్ఘ చర్చల అనంతరం డీజీపీ విలేకర్లతో మాట్లాడుతూ ప్రాణాల కన్నా ప్రజాప్రయోజనాలు, రాజ్యాంగమే తమకు ముఖ్యమంటూ ధైర్యంగా ముందడుగు వేసిన ఏపీ పోలీసులను చూసి గర్వంగా ఉందన్నారు. పోలీసు అధికారుల సంఘాలు తీసుకున్న నిర్ణయం పట్ల గర్విస్తున్నట్లు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే పంచాయతీ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్ వద్ద పోలీసులు ఎంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో 73 వేల మంది పోలీసులు ఉండగా, 1.33 లక్షల పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. జనవరి 29 నుంచే పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారని, నాలుగు విడతల ఎన్నికల్లో ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా ఈనెల 22 వరకూ ప్రతి దశలో ప్రాంతాన్ని మారుస్తూ డ్యూటీ చేయాల్సి వస్తోందని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో శాంతి భద్రతల నిర్వహణతోపాటు ఎన్నికల విధులకు హాజరై, కొవిడ్ వ్యాక్సినేషన్‌ను వాయిదా వేసుకోవాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయన్నారు.
కొన్ని పార్టీల నేతల ఆరోపణలు బాధాకరం
కుటుంబ సభ్యులు, చిన్నపిల్లలు వద్దంటున్నా యూనిఫామ్ వేసుకుని విధులకు హాజరవుతోన్న పోలీసులపై కొన్ని రాజకీయ పార్టీల నేతలు పనిగట్టుకుని ఆరోపణలు, దుష్ప్రచారం చేస్తున్నారని డీజీపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్లలో బెదిరింపులకు పాల్పడే నాయకుల చర్యలు రాష్ట్రమంతా చూశారన్నారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ ఘటనలో పోలీసులపై వచ్చినవి ఆరోపణలేనని, టెక్కలి సీఐపై దాడి చేసిన వారిని అరెస్టు చేస్తామని చెప్పారు. పోలీసు అధికారుల సంఘం నేతలు శ్రీనివాసరావు, మస్తాన్ మాట్లాడుతూ పోలీసులు నిష్పక్షపాతంగా కష్టపడుతున్నా కొన్ని దుష్టశక్తులు తమపై ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ‘అందరూ ఇళ్లల్లో ఉన్నప్పుడు డ్యూటీలు చేశాం. చివరికి ప్రాణాలను ఫణంగా పెట్టి వ్యాక్సినేషన్ వాయిదా వేసుకుని ఎన్నికల విధులకు సిద్ధమయ్యాం’ అన్నారు.