ఈ వేసవి రాజకీయ పోరుకు వేదికగా నిలవబోతోంది. ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను జారీ చేసింది. బెంగాల్‌లో 8 దశల్లో, అస్సోంలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో ఒకే విడతలో పోలింగ్ జరగబోతోంది. మార్చి 27వ తేదీన మొదలయ్యే పోలింగ్ పలు దఫాలుగా ఏప్రిల్ 29వ తేదీ వరకూ కొనసాగనుంది. మే 2వ తేదీన ఐదు రాష్ట్రాల ఫలితాలు వెల్లడించనున్నారు.
బెంగాల్‌తో మొదలు.. ముగింపు
మొదటి విడత పోలింగ్ మార్చి 27వ తేదీన బెంగాల్‌లో జరగనుంది. ఏప్రిల్ 29వ తేదీన చివరి విడత కూడా బెంగాల్‌లోనే జరగనుంది. బెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలకు 8 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చి 27, ఏప్రిల్ 1, 6, 10, 17, 22, 26, ఏప్రిల్ 29 తేదీల్లో పోలింగ్ జరగనుంది. 126 స్థానాలు గల అస్సాంలో మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6వ తేదీల్లో పోలింగ్ జరగనుంది. తమిళనాడు (294), కేరళ (140), పుదుచ్చేరి(30)లలో ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ జరుగుతుంది.
అందుకే బెంగాల్‌లో 8 దశలు..
బెంగాల్‌లో సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో అక్కడ ఎనిమిది దశల్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలోనూ బీజేపీ, తృణముల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అనేక హింసాత్మక ఘటనలు బెంగాల్‌లో జరిగాయి. పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలను దృష్టిలో పెట్టుకున్న ఎన్నికల సంఘం దశల వారీగా ఎన్నికల తంతు ముగించాలని భావించింది. తొలి దశలో 30, రెండో దశలో 30, మూడో దశలో 31, నాలుగో దశలో 44, ఐదో దశలో 45, ఆరో దశలో 43, ఏడో దశలో 36, ఎనిమిదో దశలో 35 సీట్లకు పోలింగ్ జరగనుంది.