iDreamPost

లోకేష్ కి చెలగాటం టీడీపీ నాయకులకి ప్రాణసంకటం..

లోకేష్ కి  చెలగాటం టీడీపీ నాయకులకి ప్రాణసంకటం..

ఇన్నాళ్లు తన ప్రసంగాల తడబాట్లతో టీడీపీ నేతల్ని ఇరుకున పెట్టిన లోకేష్ ఈ సారి తన దుందుడుకు చర్యతో టీడీపీ కార్యకర్తలని ప్రమాదం అంచులకు తీసుకెళ్లారు . పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు మండలంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న లోకేష్ సిద్దాపురం గ్రామం వద్ద ఉప్పుటేరు కాల్వ చప్టా పై వరద ప్రవాహంలో ట్రాక్టర్ నడిపే ప్రయత్నం చేయగా అది కాల్వలోకి దూసుకెళ్లింది . ట్రాక్టర్ పై ఉన్న ఉండి ఎమ్మెల్యే చాకచక్యంగా బ్రేక్ వేసి అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది .

సామాన్య జన జీవనంలో మమేకమయ్యే ప్రయత్నాలు రాజకీయ నాయకులు చేయడం కొత్తేమీ కాదు . అందులో భాగంగానే రాజకీయ నాయకులు తమ పర్యటనల్లో స్థానిక ప్రజల వృత్తి విధానాలు తాము కూడా నేర్చుకునే ప్రయత్నం చేసి పలు విషయాలు తెలుసుకొంటూ ఉంటారు . ఈ క్రమంలో తీసే ఛాయా చిత్రాలు అపురూపంగా దాచుకొంటారు . ఇలాంటి చర్యలు ఆయా వృత్తిదారుల , సామాజిక వర్గాలకు సదరు నాయకుల పట్ల సానుకూల ధోరణి రావటానికి ఉపయోగపడేవి .

కొందరి నాయకులకు అలాంటి ఫోటోలు తెచ్చిన పేరు అంతా ఇంతా కాదు . అయితే రానురాను ఇది సామాన్య ప్రజల జీవన విధానాలు స్థితి గతులు తెలుసుకొనే ప్రయత్నం కాక ఫోటోలకు ఫోజిచ్చి ప్రచారం చేసుకొనే విధానంగా మారిపోయింది . ప్రచార కాంక్షకి పెట్టింది పేరైన చంద్రబాబు ఇలాంటి విషయాల్లో అందరికన్నా ముందు నేనున్నా అంటూ ప్రత్యక్షమై ఫోటోలకు ఫోజిచ్చేవారు . ప్రస్తుతం లోకేష్ కూడా తండ్రి ప్రచార విధానాల్ని ఫాలో అయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లుంది .

నేత నేసే మగ్గం నుండి గీత గీసే ఈతకల్లు వరకూ ప్రతి వృత్తిదారుల పనుల్లో వేలు పెట్టి చంద్రబాబు ఇచ్చినన్ని ఫోజులు బహుశా ఇంకే రాజకీయ నాయకుడూ ఇచ్చి ఉండరు . ఒకానొక సందర్భంలో తన ప్రచార కాంక్ష కోసం మాగాట్లో వేయాల్సిన వరి నాట్లు నెర్రెలిచ్చిన మట్టి గడ్డల్లో వేసి నవ్వుల పాలైనా బాబు ఇలాంటి పనులు మానుకోలేదు . సరే అది వారి అవలక్షణం అని సరిపెట్టుకొన్నా కొన్ని సందర్భాల్లో ప్రచార కాంక్ష ముదిరి అనుభవజ్ఞులు మాత్రమే చేయాల్సిన పనులు కూడా చేయటానికి పూనుకొని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం దురదృష్టకరం .

2015 గోదావరి పుష్కరాల నిర్వహణని తన ప్రచారానికి వాడుకునే ఉద్దేశ్యంతో ఓ సినీ డైరెక్టర్ చేత పుష్కరాల్ని షూటింగ్ చేయించిన చంద్రబాబు , ఆ పుష్కరాల్లో తన పూజల షూటింగ్ సమయానికి జనసందోహం ఎక్కువగా కనపడాలని గేట్లు మూయించి తాను పూజలు చేస్తుండగా జనం వత్తిడి ఎక్కువై తొక్కిసలాటలో ఊపిరి ఆడక 29 మంది చనిపోవడం ఎప్పటికీ మరిచిపోలేని విషాద ఘటన . చివరికి అందులో తన తప్పేమీ లేదని బాబు సమర్ధించుకొన్నా ప్రజల దృష్టిలో మాత్రం ప్రచార కాంక్ష కోసం పదుల మందిని పొట్టన బెట్టుకొన్న నాయకుడిగా మిగిలిపోయారు . మరోసారి ఏరువాక కార్యక్రమం అంటూ ఎద్దులతో అరక తోలే ప్రయత్నం చేయగా టీడీపీ నేతల హడావుడికి అవి బెదిరి అదుపు తప్పినా వెంటనే పక్కనున్న వారు ఎద్దుల్ని అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది . మరో టీడీపీ నేత దేవినేని ఉమా గొల్లపూడిలో ఏరువాక కార్యక్రమంలో భాగంగా ఎద్దుల్ని తోలే ప్రయత్నం చేయగా బెదిరిన ఎద్దులు అదుపు తప్పడంతో దేవినేని ఉమా నేలకరవగా , మరో మహిళకు గాయాలయ్యాయి .

ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నట్లుంది లోకేష్ .నిన్న లోకేష్ అత్యుత్సాహంతో ట్రాక్టర్ తోలి యాక్సిడెంట్ చేసిన ఘటనలో ఏదైనా జరిగి ఉంటే ట్రాక్టర్ లో ఉన్న దాదాపు 25 మంది టీడీపీ కార్యకర్తలు , ఇద్దరు ఎమ్మెల్యేల పరిస్థితి తలుచుకొంటే భయం కలగక మానదు . అదే జరిగుంటే లోకేష్ చేసిన దుందుడుకు చర్యని కప్పిపెట్టి వరద బాధితుల కోసం తపిస్తున్న లోకేష్ ఈ క్రమంలో భాగంగా ప్రమాదానికి గురయ్యారు అని ఓ సెక్షన్ మీడియా రాసుకొచ్చేది . అంతే కానీ ఇలాంటి నాయకుల చర్యల వలన ప్రజల ప్రాణాలకు వాటిల్లుతున్న ముప్పు గురించి మాత్రం ఏ ఆందోళనా ఉండదు .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి