iDreamPost

పాపం.. నారా లోకేష్‌..! ఆ సమస్య తీరేట్టులేదు..!

పాపం.. నారా లోకేష్‌..! ఆ సమస్య తీరేట్టులేదు..!

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మాజీ మంత్రి, చంద్రబాబు తనయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సోషల్‌ మీడియా సెగ తగలడం మాత్రం ఆగలేదు. సహజంగానే నారా లోకేష్‌కు నాలుక తరచూ మడతపడుతుంటుందని ఆయన మాట్లాడిన మాటలను బట్టీ తెలుస్తోంది. ఒకసారి లేదా రెండు సార్లు అంటే ఏదో ఫ్లోలో వచ్చిందని అనుకోవచ్చు. కానీ తరచూ ఆయన పదాలను తప్పుగా పలకడంతోపాటు ఒకటి అనబోయి మరొకటి అంటూ దొరికిపోతున్నారు. ఇంకేముందు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నారు. నెటిజన్లు లోకేష్‌ అన్నమాటల వీడియోను వైరస్‌ చేస్తూ ఆయన తెలివితేటలు ఇవంటూ ఎండగడుతోంది.

నిన్న ఆదివారం మాజీ ప్రధాని, తెలుగు వ్యక్తి అయిన పీవీ నరసింహారావు 100వ జయంతి. దేశంతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, రాజకీయపార్టీలు,ప్రజలు సంస్కరణ వాదికి ఘనంగా నివాళులర్పించారు. పలువురు నేతలు ట్విట్టర్‌ వేదికగా పీవీకి నివాళులర్పించగా, మరికొందరు మీడియాతో మాట్లాడుతూ ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే నారా లోకేష్‌ కూడా మీడియా ముందుకు వచ్చారు. పీవీ జయంతిని స్మరించుకుంటూ ఆయన ఉనికి, సేవలను గుర్తు చేయబోయారు. పీవీ నరసింహారావు గారు తెలుగు దేశం నుండి అంటూ నాలుక కరుచుకుని తెలుగు ప్రజల నుంచి ఒక ప్రధాని అవడం ఆ రోజు ఒక అదృష్టంగా భావించాం అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరస్‌ అవుతోంది.

మంత్రి అయిన కొత్తలో కూడా నారా లోకేష్‌ మీడియా ముందు మాట్లాడుతూ ఇలా దొరికిపోయేవారు. ఆ తర్వాత ఆయన మీడియా ముందుకు రావడం తగ్గించారు. అయినా తెలుగుదేశంపార్టీ సమావేశాలు, బహిరంగసభల్లో మాట్లాడే సమయంలో పదాలు సరిగా పలకకుండా పలుమార్లు, ఒకటి చెప్పబోయి మరొకటి చెబుతూ నెటిజెన్లకు టార్గెట్‌ అయ్యారు. అంబేడ్కర్‌ వర్థంతిని జయంతి అనడం, వర్థంతి సందర్భంగా శుభాకాంక్షలు అంటూ చెప్పడం, తానుపోటీ చేసిన మంగళగిరిని మందలగిరి, గుంటూరును గుంతుర్రు, ప్రమాదవశాత్తు అనబోయి ప్రమాదపు శాతం అంటూ.. ఇలా అనేక సందర్భాల్లో నారా లోకేష్‌ తప్పుగా పలికారు. అప్పట్లో ఆయన మాట్లాడిన మాటల వీడియోలు ఇప్పటికీ సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్నాయి.

Read Also : బాబు ‘స్వయం ఖాతా’లో చేరిన మరో ఘనత..!

ఈ క్రమంలో అధికారంలో ఉన్న సమయంలో నారా లోకేష్‌కు తెలుగు నేర్పించేందుకు ప్రత్యేకంగా ట్యూటర్‌ను కూడా చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఆ ట్యూటర్‌కు ప్రభుత్వ ఖజానా నుంచి జీతభత్యాలు చెల్లించడంతో అప్పట్లో దుమారం రేగింది. శిక్షణ ఇప్పించినా కూడా లోకేష్‌లో మార్పు రాకపోవడంతో ఎన్నికలకు ఏడాది ఉందనగా లోకేష్‌ను మీడియా ముందుకు రానీయలేదు. ఒకరకంగా చెప్పాలంటే అనధికారిక ఆంక్షలు విధించారు. దీంతో ఆయన ట్విటర్‌కే పరిమతమయ్యారు. తన భావాలను, ప్రకటనలను ట్విటర్‌ వేదికగా వెల్లడించి మిన్నుకుండిపోయారు. ఎన్నికల సమయంలోనూ నారా లోకేష్‌తో ఒక్క బహిరంగ సభలోనూ మాట్లాడించలేదంటే నమ్మలేము. కానీ రిస్క్‌ తీసుకోవడం ఎందుకు అనుకున్నారేమో గానీ లోకేష్‌ను కేవలం మంగళగిరి నియోజకవర్గానికే పరిమితం చేశారు.

ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండడంతో లోకేష్‌పై విధించిన మీడియా ఆంక్షలన ఎత్తివేశారు. ఈ క్రమంలో లోకేష్‌ పార్టీ తరఫున కార్యక్రమాల్లో పాల్గొనడం, అరెస్ట్‌ అయిన పార్టీ నేతలను పరామర్శించడం, అక్కడే మీడియాతో మాట్లాడడం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకటి చెప్పబోయి మరొకటి చెబుతూ గతంలో మాదిరిగా దొరికిపోతున్నారు. లోకేష్‌ మాటలను చూస్తున్న వారు ఆయన మాటలో నాణ్యత, స్పష్టత రావడం కష్టమేనంటూ చెప్పుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి